top of page

తీరంలో పోటెత్తిన రక్తపు కెరటాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 10 hours ago
  • 2 min read

ఫారో దీవుల్లో సముద్ర జీవుల ఊచకోత

వార్షిక వేట పేరుతో వందలాది ప్రాణుల హతం

కొక్కీలతో పొడిచి, కత్తులతో నరికి కిరాతక హత్యాకాండ

తీరం నిండా తిమింగలాలు, డాల్ఫిన్ల కళేబరాలే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

‘దాదాగిరికి వచ్చినా.. దౌర్జన్యానికి వచ్చినా.. గూండాయిజానికి వచ్చినా.. గ్రూపులు కట్టడానికి వచ్చినా.. రాజకీయంతో వచ్చినా.. రౌడీయిజంతో వచ్చినా.. ఈ పోర్టుకే బలి అవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి!’

ఛత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ చెప్పిన ఈ పవర్‌ఫుల్ డైలాగ్‌ను నిజం చేస్తూ అక్కడి సముద్రతీరంలో కెరటాలు రక్తవర్ణం పులుముకున్నాయి. డైలాగులో చెప్పినట్లే నోరూవాయీ లేని మూగజీవులపై మానవుల దౌర్జన్యకాండకు వందలాది సముద్రజీవులు బలయ్యాయి. వార్షిక వేట పేరిట జరిగిన వికృతక్రీడలో విగతజీవులుగా మారాయి. మానవజాతి క్రూరత్వానికి పరాకాష్టగా విచ్చుకత్తుల విశృంఖల దాడిలో రక్తం ఏరులై పారింది. సముద్రతీరం ఎర్రరంగు కెరటాలతో పోటెత్తితింది. ఈ భయంకరమైన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి ఏటా వార్షిక వేట పేరుతో ఫారో దీవుల తీరంలో వందలాది తిమింగలాలు, డాల్ఫిన్లు అత్యంత కిరాతకంగా ఊచకోత కోశారు. ‘ది గ్రైండ్ ’ అని పిలిచే ఈ భయంకరమైన వేట కారణంగా అట్లాంటిక్ మహాసముద్రతీరం రక్తపు మడుగుగా మారిపోయింది. గత వారం జరిగిన ఈ దారుణకాండలో ఏకంగా 700కు పైగా మూగజీవాలను తీరం వైపు తరిమి తరిమి వందల సంఖ్యలో కొక్కీలు, పొడవాటి కత్తులతో నరికి చంపారు. దీనికి సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు చూసి ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు ప్రకటిస్తున్నాయి.

గంటల తరబడి నరకయాతన

గ్లోబల్ మెరైన్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ ‘సీ షెపర్డ్ ’ అందించిన సమాచారం ప్రకారం.. ఈ వేటలో మొత్తం 706 సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోయాయి. టోర్షావన్ తీరంలో 402 పైలట్ తిమింగలాలు, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్లను హతమార్చగా, స్కాలబోట్‌నూర్‌లో 168, హ్వాల్విక్‌లో 132 తెల్లటి డాల్ఫిన్లను వేటగాళ్లు బలితీసుకున్నారు. సాధారణంగా ఈ వేటలో జంతువుల బాధను త్వరగా తగ్గించి, వాటి వెన్నెముకను తెగ్గొట్టే ‘వెన్నెముక లాన్స్‌లు’ అనే ప్రత్యేక సాధనాలను చట్టబద్ధంగా వాడాల్సి ఉంటుంది. కానీ ఈసారి వేటగాళ్ల దగ్గర ఆ సాధనాలు అయిపోవడంతో, మిగిలిన వందలాది జంతువులను కత్తులు, కొక్కీలతో క్రూరంగా పొడుస్తూ తీరంలోకి లాగారు. దీంతో ఆ మూగజీవాలు చావలేక, బతకలేక గంటల తరబడి సముద్రపు నీటిలో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాయి. మే 27న స్కాట్లాండ్‌కు 200 మైళ్ల దూరంలో ఉన్న ఈ తీరాల్లో డజన్ల కొద్దీ తిమింగలాల దేహాలు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. మత్స్యకారులు ఏమాత్రం జాలి లేకుండా ఆ రక్తపు నీటిలోనే నడుస్తూ, చనిపోయిన తిమింగలాలు, డాల్ఫిన్ల శరీరాలను తాళ్లతో లాగి కట్టారు. డెన్మార్క్ ఆధీనంలో ఉండే ఈ భూభాగంలో శతాబ్దాలుగా ప్రతి వేసవిలో ఈ గ్రైండ్ వేట జరుగుతుంది. అయితే ఇది తమ సంస్కృతిలో భాగమని, ఆహారం కోసం చేసే స్థిరమైన వేట మాత్రమేనని స్థానికులు వాదిస్తున్నారు.

వేటగాళ్లకే వత్తాసు

జంతు హక్కుల సంఘాల అభ్యంతరాలు, విమర్శలను పట్టించుకోకుండా ఈ ఏడాది ఫారోయిస్ పార్లమెంటు ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘనల నుంచి వేటగాళ్లను రక్షించడానికి వీలుగా స్థానిక వేట నిబంధనలే జంతు సంక్షేమ చట్టాల కంటే ఉన్నతమైనవంటూ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా ఈ అనాగరిక వేటను అడ్డుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణతో ‘సీ షెపర్డ’ సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ప్రొగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎలిసా అలెన్ ఈ క్రూరత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘ప్రతి ఏటా వందలాది తిమింగలాలు, డాల్ఫిన్లను తీరంవైపు తరిమి, లోహపు కొక్కీలను వాటి ఊపిరితుత్తుల్లోకి దూర్చి ఊచకోత కోస్తున్నారు. అవి బాధతో పెట్టే కేకలు వింటే గుండె తరుక్కుపోతుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డాల్ఫిన్లు, తిమింగలాలు అత్యంత తెలివైన జీవులని, మనుషుల్లాగే అవి కూడా నొప్పిని, భయాన్ని అనుభవిస్తాయని ఎలిసా గుర్తుచేశారు. ఈ ఊచకోతను తక్షణమే శాశ్వతంగా నిషేధించాలని ఫారో దీవుల ప్రధానమంత్రిని ‘పెటా’ డిమాండ్ చేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page