top of page

బాలల మెదళ్లకు ‘సెల్ ’ చెదలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 6 hours ago
  • 3 min read
  • పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కబళిస్తున్న మొబైల్

  • వేసవిలో అడాలసెంట్ సైకియాట్రీ కేంద్రానికి కేసుల తాకిడి

  • విశాఖ మానసిక ఆస్పత్రిలో ఐదు నెలల్లో 640 నమోదు

  • సెల్ బానిసత్వం వర్చువల్ ఆటిజానికి దారితీసే ప్రమాదం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

వేసవి సెలవులు అనగానే గతంలో పిల్లలు స్వగ్రామాల్లో ఉండే అమ్మమ్మ, తాతయ్యల వద్దకు వెళ్లి పల్లెపట్టుల్లో ఆటపాటల్లో నిమగ్నమయ్యేవారు. కాలం మారిన తర్వాత ఆ సంప్రదాయాన్ని కాస్త వెనక్కినెట్టి తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలు చేయడం అలవాటుగా మారింది. కానీ ఈ కాలం పిల్లలు అటు పల్లెబాట.. ఇటు విహారయాత్ర కాకుండా ఆస్పత్రి బాట పడుతున్నారు. అదికూడా మానసిక ఆస్పత్రులు, సైకియాట్రిస్టుల వద్దకు క్యూ కడుతున్నారు. ఏమిటీ.. నమ్మలేకపోతున్నారా? ఇదేమీ ఊసుపోక చెబుతున్న విషయం కాదు.. ఆస్పత్రులకు వస్తున్న కేసుల సంఖ్య చూస్తే ఇది చేదు నిజమని నమ్మకతప్పదు. ఒక్క విశాఖలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి ఆస్పత్రికి వస్తున్న కేసులే తీసుకుంటే.. ఈ ఏడాది జనవరిలో 76, ఫిబ్రవరిలో 98, మార్చిలో 113, ఏప్రిల్‌లో 192, మే నెలలో రెండోవారం నాటికి 161 కేసులు.. మొత్తంగా ఐదు నెలల్లో 640 కేసులు నమోదయ్యాయంటే చిన్న విషయం కాదు. గత ఏడాది జనవరి మార్చి మధ్యలో 477 కేసులు నమోదయ్యాయి. అది కూడా వేసవి సీజనులోనే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లాల్సిన తల్లిదండ్రులు మానసిక ఆస్పత్రికి తీసుకురావడానికి కారణం వారిలో తలెత్తుతున్న మానసిక సమస్యలేనని వైద్యులు చెబుతున్నారు. విశాఖ మానసిక ఆస్పత్రిలోని చైల్డ్ అడాలసెంట్ సైకియాట్రీ వింగ్‌కు ఈ కేసులు పోటెత్తుతున్నాయి. 12 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక రుగ్మతల చికిత్సకు మనదేశంలో బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో ఈ విభాగం తొలుత ఏర్పాటైంది. ఆ తర్వాత విశాఖలోనే రెండో కేంద్రం పనిచేస్తున్నది. కాగా చిన్న వయసులోనే పిల్లలను మానసిక ఆస్పత్రికి తీసుకురావడానికి కారణం ఏమిటంటే.. మానసిక వైద్యనిపుణులు చెబుతున్న ఏకైక కారణం.. సెల్‌ఫోన్.

ఆటబొమ్మల స్థానంలో సెల్‌ఫోన్లు

మిగతా రోజుల్లో స్కూళ్లు, హా0వర్కులతో బిజీగా ఉండే పిల్లలు.. వేసవి సీజనులో ఖాళీగా ఉంటారు. గతంలో సెలవులను పిల్లలు జాలీగా ఎంజాయి చేసేవారు. వీలుంటే స్వగ్రామాలకు వెళ్లి ప్రకృతి ఒడిలో ఆటపాటల్లో నిమగ్నం కావడం లేకపోతే ఉన్న ఊళ్లోనే వినోద క్రీడల్లో నిమగ్నం కావడం చేసేవారు. కానీ మనిషి జీవితం బిజీగా మారిపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత సమయం కేటాయించలేని పరిస్థితి. తమ వృత్తి, ఉద్యోగ వ్యాపకాల్లో నిమగ్నమైపోతున్న వారు పిల్లల చేతుల్లో సెల్‌పోన్లు పెట్టి వదిలేస్తున్నారు. గతంలో పిల్లల చేతుల్లో ఆటబొమ్మలు ఉండేది. ఇప్పుడు వాటిస్థానాన్ని సెల్‌ఫోన్లు ఆక్రమించాయి. దానికితోడు పట్టణాల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిపోవడం, విశాలమైన స్థలాలు లేకపోవడం వల్ల పిల్లలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రకృతి ఒడిలో ఆడుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఒకవేళ ఉన్నా పిల్లలను ఇళ్ల నుంచి బయటకు రావడానికి తల్లిదండ్రులు అంగీకరించని దుస్థితి. ఇంట్లోనే ఉంటూ టీవీ, సెల్‌ఫోన్ లేదా పుస్తకాలతో కాలక్షేపం చేయమని చెప్పే తల్లిదండ్రుల తీరుతో పిల్లలు కూడా ఆరుబయలు ఆటల గురించే మర్చిపోతున్నారు. అయితే పుస్తకాల పురుగులుగానో లేదా సెల్‌ఫోన్, టీవీలకు అతుక్కుపోతూ కాలాన్ని వృథా చేస్తున్నారు. ఈ వాతావరణం వారి మన:ప్రవృత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వారిలో మానసిక రుగ్మతలకు దారితీస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో ఏకాగ్రత దెబ్బతిని మానసిక పరిస్థితి అదుపు తప్పుతప్పి ఆస్పత్రుల పాల్జేస్తున్నది.

నిరంతరం వేరే లోకంలో..

విశాఖ చైల్డ్ అడాలసెంట్ సైకియాట్రీ విభాగానికి వస్తున్న కేసులు అన్నీ ఒకేరకంగా కాకుండా ఒక్కొక్కటీ ఒక్కో తరహాలో ఉంటున్నాయి. కొందరు పిల్లల్లో విపరీతమైన అల్లరి కనిపిస్తే.. మరికొందరు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తమదైన వేరే లోకంలో ఉండిపోతారు. అరచి పిలిచినా తమను కాదన్నట్లు, ఒకవేళ పలికినా స్లోమోషన్‌లో స్పందించడం, మాట్లాడటం చేస్తుంటారు. ఇంటికి వచ్చే బంధువులు, చివరికి అమ్మానాన్నలు చెప్పేవే, మాట్లాడుకునే మాటలు కూడా వారి మెదడుకు చేరవు. వారితో మమేకం కాలేరు. ఒకవేళ గట్టిగా చెబితే తీవ్ర అసహనానికి గురై అమ్మానాన్నలపైనా విరుచుకుపడి కసిరేంత పనిచేస్తారు. నిరంతరం సెల్‌ఫోన్ స్క్రీను చూడటం వల్ల మెదడులోని ఉండే గ్రే మేటర్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల చిన్న స్క్రీన్‌పై చూసే సినిమాలు, కార్టూన్లు, సీరియళ్లే మెదడులో నిరంతరం గిర్రున తిరుగుతుంటాయి. అదే తమ లోకమని అనుకునే దుస్థితికి పిల్లలు దిగజారిపోతారు. పాఠ్య పుస్తకాలపై అనాసక్తి పెరుగుతుంది. సెలవుల తర్వాత స్కూలుకు వెళ్లడానికి కూడా ఇచ్ఛగించరు. వెళ్లినా ఎంత వేగం ఇంటికి తిరిగి వెళ్లిపోదామా.. ఎంత త్వరగా సెల్ లోకంలోకే వెళ్లిపోదామా అని ఆరాటపడుతుంటారు. చిన్న స్క్రీన్‌పై కనిపించే రంగుల ప్రపంచం వారిలోని ఆలోచన శక్తిని, జ్ఞాపకశక్తిని నశింపజేసి ఒకవిధమైన ఆటిజం బారిన పడేలా చేస్తుంది. సాధారణంగా పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు, బయట చుట్టుపక్కలవారు మాట్లాడుకునేవి గమనించి అలా మాట్లాడటం, అందరితో కలిసిమెలసి ఉండటం నేర్చుకుంటారు. కానీ సెల్ లోకంలో పడిపోయినవారు పరిసరాలను మర్చిపోయి, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవడం వల్ల మాటలు నేర్చుకోవడమే కాదు.. మాట్లాడటం కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇరవై నాలుగ్గంటలూ ఎక్కడో ఒకచోట కదలకుండా కూర్చుండిపోవడం వల్ల అవయవాలు మొద్దుబారిపోయి చలనశక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. సాధారణంగా పుట్టుకతో వచ్చే ఆటిజం వల్ల ఇటువంటి అవలక్షణాలు ప్రాపిస్తాయి. కానీ సెల్ బానిసలు కూడా ఈ అవలక్షణాల పాలవుతారు. దీన్నే మానసిక శాస్త్ర నిపుణులు వర్చువల్ ఆటిజం అని వ్యవహరిస్తున్నారు. మానసిక చికిత్స చేయడంతోపాటు దీనికి శాశ్వత పరిష్కారం సాధించాలంటే పిల్లలను స్వేచ్ఛగా ఆరుబయట ఆడుకోనివ్వాలి. సెల్‌ఫోన్ ఇవ్వడానికి పూర్తిగా పరిహరించాలి. నలుగురిలో మసలనివ్వాలి. అందరితో కలివిడిగా మాట్లాడే అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా వీలైనంత ఎక్కువసేపు పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినట్లే సెల్ బానిసత్వానికి గురికాకుండా వారిని కాపాడుకోవచ్చు

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page