అవును.. మొత్తం వాళ్లే చేశారు!
- Guest Writer
- Jun 9, 2025
- 3 min read
నేడు అధిక శాతం యువత చెడుదారిలో వెళుతోందంటే ఒక ముఖ్యమై కారణం తల్లిదండ్రులు. ఆకలేస్తేనే.. తిండి రుచిగా ఉంటుంది. దాహమేసినప్పుడు మంచి నీరు స్వీట్‌గా అనిపిస్తుంది. చీకటి.. వెలుతురు.. కష్టం సుఖం.. కావడి కుండలు ! రాత్రన్నదే లేక 24 గంటలూ వెలుతురుంటే? ఆకలెయ్యక ముందే... అన్నం తినాల్సివస్తే? పనీ పాటా లేక.. రోజంతా పడుకోవాల్సి వస్తే? జీవితం బోర్ కొట్టేస్తుంది. బతుకు నరకప్రాయం అయిపోతుంది. అవునా? కాదా?
‘మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదని’ నేడు అధిక శాతం తల్లిదండ్రులు తపన పడుతున్నారు. వారి కోసం శక్తికి మించి సంపాదిస్తున్నారు. మీ ప్రేమ చల్లగుండా.. మీరు మీ పిల్లలకు చేస్తున్న నష్టమేమిటో ఇప్పటికైనా గ్రహించండి.

మీ కుటుంబం ఒక క్రికెట్ టీం అనుకోండి. ఇంట్లో తాత, అవ్వ ఓపెనింగ్ బాట్స్‌మెన్ / బ్యాట్స్ విమెన్. అమ్మ నాన్న వన్ డౌన్.. టు డౌన్ బాట్స్‌మెన్/ బ్యాట్స్ విమెన్. ‘అబ్బే.. మా పిల్లలు ఒట్టి అమాయకులు.. పసిపిల్లలు.. వాళ్లకేమి చేతనౌను?! అని మీరే వారి రన్స్ మొత్తం కొట్టేస్తున్నారు. వాళ్లు క్రీజ్‌లో దిగే అవకాశం రాకుండా మీరు మ్యాచ్ గెలిచేస్తున్నారు. ఒక్కోసారి వారు బాటింగ్‌కు దిగాల్సి వచ్చినా.. అక్కడ తగినంత రన్స్ టార్గెట్‌గా ఉండవు. ‘అయ్యో ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటారో!’.. ‘స్పిన్‌ను ఎదుర్కొనే నేర్పరితనం వారిలో లేదు’.. అని మీ భయం. తధాస్తు దేవతలున్నారు.. మీ భయాలే నిజాలు అవుతున్నాయి. అది క్రికెట్ మ్యాచ్.. ప్రాక్టీస్ చెయ్యాలి.. అసలు మ్యాచ్‌లో పిచ్‌పై దిగాలి. దెబ్బలు తగిలించుకోవాలి. బౌలర్ చేత మాటలు అనిపించుకోవాలి. కసి పెరిగి బాల్‌ను చితకొట్టాలి. అప్పుడే మ్యాచ్. అదే కిక్కు. పిచ్‌పై వారు దిగే ఛాన్స్ ఇవ్వకుండా.. వారి మ్యాచ్ మొత్తం మీరే ఆడిస్తే.. వారు ఎందుకూ కొరగాని సన్నాసులు అయిపోరా?
లైఫ్ కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కాకపోతే ఇండియన్ పోరంబోకు లీగ్ కాదు. ఐపీల్ ఒక టీం కాదు. అది ఒక ఆట కాదు. అది వేరే టాపిక్. మధ్య తరగతి.. ఎగువ తరగతి తల్లిదండ్రులు.. నేడు తమ కోసమే కాకుండా తమ పిల్లలు ‘జీవితాంతం కాలిపై కాలు వేసుకొని హాయిగా తినేంత’ సంపాదిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక తండ్రి తన కొడుకును పాతిపెట్టిన సమాధిపై పడి ఏడుస్తున్న వీడియో... అందరినీ కదిలించింది. ‘నీ కోసం ఇన్ని కోట్లు సంపాదించాను కొడుకో.. నువ్వేమో ఇలా అర్ధాంతరంగా ఐపీల్ తొక్కిసలాటలో పోయావు’ అని తండ్రి ఏడుస్తున్న వీడియో అది.
మన చుట్టూరా జరిగే ఘటనల నుంచి మనం సరైన పాఠాలను గ్రహించాలి. మీ వయసు 20 అనుకొందాం. మీ తండ్రి మహా బిజీ. మంచి దారో.. అడ్డదారో.. కోట్లు సంపాదిస్తున్నాడు. జీవితాంతం తిని కూర్చున్నా మరో మూడు తరాలకు అది సరిపోతుంది. ఇప్పుడు మీరు కష్టపడి బాటింగ్ చేస్తారా? ఆ మోటివేషన్ వస్తుందా? ఆ అవసరం ఉందా? ఒక యువకుడి లాగా ఆలోచించండి. అందరూ కష్టపడితే.. ఇక ఖర్చుపెట్టేది ఎవరు ఆలోచించరా? మా నాన్నకు లైఫ్‌ను ఎంజాయ్ చెయ్యడం రాదు. నేను ఆ పని చేస్తాను అని డిసైడ్ అయిపోరా?? మీరు ఒంటరి కాదు.. మీ లాగే ఎందరో.
ఒక్కసారి హైదరాబాద్ జూబిలీ హిల్స్‌కు పోదాం.
అక్కడ చాలామంది యూత్‌కు రాత్రి పదకొండుకు పొద్దుపుడుతుంది. లేచి.. పబ్బు.. గబ్బు.. డ్రిరక్ .. డ్రగ్.. అటుపై రాత్రి రెండిటికి-మూడిరటికి.. రోడ్డుపైకి వచ్చి బీర్ బాటిల్‌తోనో, రాళ్లతోనో రోడ్డుపై హంగామా చెయ్యాలి. 300 కిలోమీటర్ వేగంతో బైక్ నడపాలి.
తప్పు వారిదా?
అడిగినంత డబ్బు.. ఖర్చు పెట్టినంత సంపద. తిని తిని, తాగి తాగి బోర్ కోట్టేసింది. తూ.. జీవితం.. డోపామైన్ హై. ఆరు పెగ్గులు కొట్టినా కిక్కు ఎక్కదు. మరి డ్రగ్స్ తీసుకోకపోతే ఎలా? పదో తరగతి నాటికే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పుడిక సింగిల్స్ మ్యాచ్ ఏమి రుచిస్తుంది? తనలాంటి ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి మొత్తం పది మందితో వైల్డ్ గేమ్ ఆడకపోతే మజా ఎలా వస్తుంది?
‘మీరు చెప్పేది ధనికుల పిల్లల సంగతి.. మాది మధ్య తరగతి..’ అనే కదా మీ ప్రశ్న? మీరు మధ్య తరగతి అనుకొంటున్నారు. ‘మా అమ్మ నాన్న దగ్గర మూడెకరాల పొలం ఉంది. అమ్మితే ఐదో పదో కోట్లు వస్తాయి.. ఇది కాకుండా ఇదిగో ఇంత బంగారు నగలు అని వారి లెక్కలు వారికున్నాయి.
యువత పీర్ ప్రెషర్‌కు ఎప్పుడూ బలవుతుంది. తమ కాలేజీలో ఒకడు బీఎండబ్ల్యూలో వస్తే.. ఇంట్లో వారికి బియ్యం డబ్బులు లేకపోయినా, గంజికి దిక్కు లేకపోయినా బెంజ్.. బీఎండబ్ల్యూ కావాలి అనుకొంటుంది.
డిజిటల్ యుగంలో ఇదే అసలు మహమ్మారి..!
అయినా.. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు మాస్టారు!
చంద్రగుప్త మౌర్యుడు.. బింబిసారుడు.. అశోకుడు. అంతే.. మూడో తరానికి అవుట్. మౌర్యులు.. గుప్తులు.. హుణులు.. కుషాణులు.. ఖిల్జీ.. తుగ్లక్.. మొఘల్.. మొత్తం భారత దేశ చరిత్ర చెప్పే సారం ఇదే. మూడో తరానికి మించి.. ఏ రాజ వంశంలో హీరోలు పుట్టలేదు. నాలుగో తరం నుంచి జీరోలే.. సన్నాసులే. ఆధునిక కాలంలో కూడా అంతే.
జూబిలీ హిల్స్.. బంజారా హిల్స్.. మాదాపూర్.. రాజవంశాల చరిత్ర చూడండి.. తాత గారు గొప్పోడు. మెట్టు మెట్టు ఎక్కి బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. రెండో తరం ఓకే. మూడు కష్టం. నాలుగు ఇంపాజిబుల్. నేను చెబుతున్నది పిల్లల్ని పెంచి పెద్ద చేసే పద్ధతి గురించి మాస్టారు! లోకనాయకుడు కృష్ణుడు అంతటి వాడే కొడుకుల పెంపకంపై దృష్టి పెట్టలేనంత బిజీ అయిపోయి తన తర్వాత తన వంశ నాశనానికి పరోక్షంగా కారణమయ్యాడు.
ఆస్తులు సంపాదించొద్దు అనడం లేదు. కానీ పిల్లలతో సమయం గడపండి. మంచి చెడు తెలియచెప్పండి. ఇవేమీ లేకుండా కేవలం ఆస్తులు సంపాదిస్తే బతుకులో.. మంచు తుపాను ఖాయం. ముసలి వయసులో మనశ్శాంతి కరువవుతుంది. అర్థమయ్యిందా ?
డబ్బున్నా.. పిల్లల్ని పెంచడం ఒక కళ. వారి ఆటను వారిని ఆడనివ్వండి. అపార సంపద ఉన్నా మార్వాడీ.. పార్సీ యూత్ దుకాణానికి ఫ్యాక్టరీకు ఉదయం పదింటికే ఎందుకు పోతున్నారో.. వారి పెంపకం ఏంటో ఒక్కసారి లుక్ వెయ్యండి.
గుర్తుంచుకోండి .. మన పిల్లలు మన జీన్స్ పంచుకొని పుడతారు. అంతకు మించి మనల్ని చూసి నేర్చుకొంటారు. ఆవు / ఎద్దు చేలో పడి మేస్తుంటే.. దూడలు గట్టున మేస్తాయా? పిల్లల్ని పెంచడం ఒక కళ!
- వాసిరెడ్డి అమర్నాథ్










Comments