అసద్ ఆశ ఆకాశంలో.. వారి మహిళలు పాతాళంలో!
- DV RAMANA

- 3 days ago
- 3 min read

మనది సెక్యూలర్ దేశం. మెజారిటీలు, మైనారిటీలు అన్న తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో.. అందరికీ సమానావకాశాలు ఇవ్వాలన్నది రాజ్యాంగం సాక్షిగా భారతదేశ స్ఫూర్తిమంత్రం. ఇప్పటివరకు అదే జరుగుతోంది. కులమతవర్గాలకు అతీతంగా వ్యవహరిస్తున్నందునే ఆదివాసీవర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవినధిష్టించగలిగారు. దేశ ప్రథమ పౌరురాలిగా గౌరవమర్యాదలు అందుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర మైనారిటీ వర్గాల మహిళలు కూడా ఉన్నత రాజ్యాంగ పదవులు అధిష్టించడం మనదేశంలో అసాధ్యమేమీ కాదు. దానికి అడ్డుచెప్పేవారు కూడా ఎవరూ ఉండరు. కానీ ఇదే అంశంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌కు గురవుతున్నాయి. గురివింద గింజ తన నలుపు ఎరగదన్నట్లు ఒవైసీ మాటల తీరు ఉందని ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి చర్చించే ముందు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ భారత్, పాక్ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ‘పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారే ప్రధాని కావాల్సి ఉంటుందని.. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందిన మన రాజ్యాంగం మాత్రం ఏ భారత పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చని చెబుతోందని అదే మన దేశ విశిష్టత అని ఒవైసీ అభివర్ణించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తన ప్రసంగానికి కొనసాగింపుగా ‘ఈ దేశానికి హిజాబ్ ధరించిన కూతురు ప్రధాన మంత్రి అయ్యే రోజు వస్తుందని.. రావాలనేది నా కల’ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తే.. దేశవ్యాప్తంగా ఖండన మండనలతో దుమారం చెలరేగుతోంది. బీజేపీ తదితర హిందుత్వ పార్టీలు, ప్రతినిధులు అసదుద్దీన్‌పై విరుచుకుపడుతుంటే.. ఇతరులు కూడా ఆయన వ్యాఖ్యలను మరోవిధంగా తప్పుపడుతున్నారు. ఎవరైనా ప్రధాని వంటి అత్యున్నత పదవులు చేపట్టవచ్చని భారత రాజ్యాంగం చెబుతుంటే.. ఇంకా హిజాబ్ ధరించిన కూతురు ఆ పదవి చేపట్టాలన్నది తన కల అని అసదుద్దీన్ నొక్కి చెప్పడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వ్యాఖ్యల వెనుక ఆయనగారి అంతరార్థం ముస్లిం మహిళలు అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో కూర్చోవాలని చెప్పడమే. కానీ ఇక్కడే ఆయన అడ్డంగా దొరికిపోయారు. విమర్శకులకు పని కల్పించారు. భారత్‌లో హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావాలని తెగ ఆరాటపడుతున్న ఒవైసీ ఒకసారి తమకు చెందిన ఇస్లామిక్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో చూసి మాట్లాడాలని సోషల్ మీడియా ద్వారా అనేకమంది సూచిస్తున్నారు. అసలు హిజాబ్ అంటే ఏమిటో తెలియని, ఎప్పుడూ బురఖా ధరించని బెనజీర్ బుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, బేగం ఖలీదాజియా ప్రధాని పదవులు చేపట్టారు. కాగా ప్రపంచంలో ముస్లిం జనాభాశాతం అధికంగా ఉన్న ఇండోనేషియాకు ప్రధానిగా వ్యవహరించిన మేగావతి సుకర్ణోపుత్రి అసలు ఈ పేర్లే తెలియదు. మరో ప్రముఖ ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో మతచాంధస పాలనను, మహిళలపై ఆంక్షలను గత కొన్నేళ్లుగా అక్కడి మహిళలు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. హిజాబ్‌లను తీసి విసిరికొడుతున్నారు. తమ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫొటోలనే చుట్టలుగా చుట్టి సిగరెట్ల మాదిరిగా కాలుస్తున్నారు. వీటన్నింటితో పోలిస్తే మనదేశంలోనే ముస్లిం మహిళలు ఎంతో స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. కానీ వారందరికీ ప్రతినిధిగా చెప్పుకొంటున్న అసదుద్దీన్ ఒవైసీ ఇంకా తమ మతచాంధసవాదాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఆయన ఆకాంక్ష సమంజసమే. కానీ హిజాబ్ ధరించిన మహిళ అనకుండా ముస్లిం మైనారిటీ మహిళ కూడా ప్రధాని కావాలన్నది తన ఆశ అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. అయితే ఆయన్నుంచి, ఆయన పార్టీ నుంచి అలాంటివి కోరుకోవడం కూడా అత్యాశేనని చెప్పాలి. ఎందుకంటే.. ఎంఐఎం రాజ్యంగా భావించే, అసదుద్దీన్ పార్టీ ఏకఛత్రాధిపత్యం వహించే హైదరాబాద్ పాతబస్తీలో కనీస హక్కులకు నోచుకోని మహిళల దుస్థితి చూస్తే జాలేస్తుంది. పాతబస్తీలో ముస్లిం మహిళలు బురఖా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటరు జాబితాలో ఉన్న ఫోటోకు ఓటు వేసేందుకు వచ్చిన వారికి పోలిక ఉందో లేదో చూస్తారు. కానీ అక్కడ కూడా మహిళలను బురఖా తీసేందుకు ఎంఐఎం ఇతర ముస్లిం ప్రతినిధులు అంగీకరించని పరిస్థితి ఉంది. పాతబస్తీతో పాటు హైదరాబాద్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం కొన్ని దశాబ్దాలుగా గెలుస్తూ తన ఆధక్యతను చాటుకుంటూ వస్తోంది. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల సంగతి అటుంచి కనీసం హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లకైనా అసదుద్దీన్ పార్టీ మహిళలను నిలబెట్టాలన్న ఆలోచన చేయడం లేదు. అందువల్లే ఎంఐఎం చరిత్రలో ఇంతవరకు ఒక్క మహిళా కార్పొరేటర్ గానీ, మహిళా ఎమ్మెల్యే గానీ లేరు. అసలు పురుషులు ముస్లిం మహిళ మొహం చూడటమే నేరంగా భావిస్తారు. అంతెందుకు అసద్ సతీమణి ఎలా ఉంటుందో ఇంతవరకు పాతబస్తీవాసులకే తెలియదంటే మహిళల పట్ల వారి ఆలోచనలు ఎంత పాతాళంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయనే ఇప్పుడు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావాలని కలలు గంటున్నానని చెప్పడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ హిజాబ్ ధరించే మహిళలకు తమ ఇంట్లోనూ తమ వర్గంలోనే సాటి మనుషులన్న కనీస గుర్తింపు, అవకాశాలు కూడా లేనప్పుడు వారు బయటకు వచ్చి దేశాన్ని, ప్రపంచాన్ని ఎలా ఏలగలుగుతారన్నది అసదుద్దీన్ వంటి ఆ వర్గ ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఆశలు, ఆలోచనలను మాటల్లో కాకుండా తమ మహిళకు ఆచరణలో వర్తింపజేసినప్పుడు ముస్లిం మహిళ దేశ ప్రధాని కావడం పెద్ద కష్టం కాబోదు.










Comments