రెండోసారి ఆదివారం బడ్జెట్!
- DV RAMANA

- 16 hours ago
- 3 min read

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు అనేక మార్పులకు ఆహ్వానం పలకాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ప్రభుత్వపరంగానూ ఈ మార్పులు ఉంటాయి. వాటికి అనుగుణంగా మన నిర్ణయాలను, కార్యాచరణను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. వీటన్నింటిలోనూ అత్యంత కీలకమైనవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లు. ఈ బడ్జెట్లలో ప్రతిపాదించే కొత్త పన్నులు, మినహాయింపులు, ఇతర అంశాలు కుటుంబ బడ్జెట్‌పైనా ప్రభావం చూపుతాయి కనుక బడ్జెట్ సమయానికి నెలా రెండు నెలల ముందు నుంచే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో? పన్ను వడ్డింపులు, ఊరటలు ఎలా ఉంటాయో?? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయోనన్న చర్చలు, తమకు మినహాయింపులు ఇవ్వాలని పలు రంగాలకు చెందిన ప్రతినిధుల వినతులు షరామామూలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అటువంటి చర్చలతో పాటు అదనంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీపైనా కొంత చర్చ జరిగింది. సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడం చర్చనీయాంశమైంది. పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవు. అందువల్ల సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి ఒకటి ఆదివారంనాడే సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమర్పిస్తారా లేక ఆరోజు సెలవు అయినందున ముందురోజుకు గానీ.. తర్వాత రోజుకు గానీ మారుస్తారా? అన్న చర్చ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఫుల్‌స్టాప్ పెట్టింది. సంప్రదాయానికే పెద్దపీట వేస్తూ సెలవు రోజైనప్పటికీ ఫిబ్రవరి ఒకటినే(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ అధికారిక ప్రకటన చేసింది. బడ్జెట్ సెషన్ షెడ్యూల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. ఈ నెల(జనవరి) 28న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 29న ఆర్థిక సర్వేను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. అనంతరం ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2026`27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అరుదైన సంఘటనగా నిపుణులు భావిస్తున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుండటం కూడా ఒక విశేషమే. ఆ ఘనత సాధించిన ఏకైక మహిళా మంత్రి ఆమె మాత్రమే. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 88వ కేంద్ర బడ్జెట్ కాగా.. గతంలో మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్లు ప్రవేశపెట్టి టాప్‌లో ఉండగా, ఆయన తర్వాత పి.చిదంబరం తొమ్మిది బడ్జెట్లతో రెండో స్థానంలో, ప్రణబ్‌ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ కూడా ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లు సమర్పించి ప్రణబ్‌తో సమానంగా ఉన్నారు. తొమ్మిదోసారి కూడా ప్రవేశపెట్టనున్న ఆమె తద్వారా చిదంబరంతో కలిసి రెండో స్థానాన్ని పంచుకోనున్నారు. వాస్తవానికి కేంద్రబడ్జెట్‌ను గతంలో ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి రోజు అంటే ఆ నెల 28న లేదా లీప్ ఇయర్ అయితే 29న సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఇది 1998 వరకు కొనసాగింది. అయితే 1999 నుంచి బడ్జెట్ సమర్పించే సమయాన్ని అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి నెలాఖరు రోజు సాయంత్రం ఐదు గంటలకు కాకుండా ఉదయం 11 గంటలకు మార్చారు. 2016 వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ సమర్పించే తేదీన ఫిబ్రవరి చివరి రోజు నుంచి మొదటి తేదీకి మార్చింది. ఆ మేరకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తొలిసారి ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. అరుణ్‌జైట్లీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్లు సమర్పిస్తూ రికార్డు సృష్టించారు. వరుసగా మూడు ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా ఉండటం ఆమె మరో ప్రత్యేకత. సెలవు రోజుల్లో బడ్జెట్ సమర్పించడం కూడా అరుదైన విషయంగానే చెప్పాలి. సాధారణంగా పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవు. సమావేశాలు ఉండవు. కానీ 2025 బడ్జెట్‌ను సెలవు రోజైన శనివారం ప్రవేశపెట్టారు. అలాగే ఆదివారం బడ్జెట్ సమర్పించిన ఉదంతం గతంలో ఒక్కటే ఉంది. 2016లో యూనియన్ బడ్జెట్‌ను సమర్పించిన రోజు ఆదివారమే(ఫిబ్రవరి 28). ఈసారి కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఆదివారం బడ్జెట్ సమర్పించిన రెండో ఘట్టంగా ఇది నిలుస్తుంది. వాస్తవానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో కేంద్ర బడ్జెట్‌ను వార్షిక ఆర్థిక ప్రకటన అని పేర్కొన్నారు. కానీ బడ్జెట్‌గానే అది ప్రాచుర్యం పొందింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆలోపే అవసరమైన మార్పులు చేర్పులతో వ్యవస్థలను సిద్ధం చేయడానికి వీలుగా రెండు నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పించి, ఆమోదం పొందడం సంప్రదాయంగా వస్తోంది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె.షణ్ముగం చెట్టి 1947 నవంబర్ 26న సమర్పించారు. ఆ బడ్జెట్ పరిమాణం రూ.197.29 కోట్లు మాత్రమే. మొతం ఆదాయం అంచనా రూ.171.15 కోట్లుగా చూపించారు. ఆర్థిక లోటు 24.59 కోట్లు. ఆ బడ్జెట్‌లో రక్షణ రంగానికే రూ.92.74 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక నిపుణులు, అధికారులతో కూడిన బృందం చాలా రహస్యంగా నిర్వహిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధం చేసి ముద్రణకు ఇచ్చేవరకు వారందరూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. ముద్రణకు పంపిన తర్వాత హల్వా వేడుకతో వారికి విముక్తి లభిస్తుంది.










Comments