కుక్కకాటుకు ‘సుప్రీం’ చెప్పుదెబ్బ!
- DV RAMANA

- 11 hours ago
- 2 min read

వీధికుక్కల విషయంలో మరోసారి సుప్రీంకోర్టు కొరడా రaుళింపించడం ప్రభుత్వాలకు, సోకాల్డ్ జంతు ప్రేమికులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. దీనిపై గతంలోనే తాము ఇచ్చిన డైరెక్షన్స్‌ను ఆయా వర్గాలు పట్టించుకోకపోడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. కుక్కలవే ప్రాణాలా? మనుషులవి ప్రాణాలు కావా?? అని నిలదీసింది. వీధికుక్కలు పాదచారులు, పిల్లలపై పడి కండలు పీకేస్తూ మరణాలకు కారణమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా కుక్కలపై సానుభూతి చూపించాలా అని నిలదీసింది. తనకుమాలిన ధర్మం అవసరం లేదని చెప్పకనే చెప్పింది. వీధికుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లను కొంతకాలంగా విచారణ జరుపుతున్న జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు మరోసారి ఈ కేసు వచ్చినప్పుడు వాదప్రతివాదనల సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల భద్రత, ప్రభుత్వాల జవాబుదారీతనం, జంతు ప్రేమికుల సంస్థల పాత్రలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులకు సంబంధించి ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలంటూ గత ఏడాది ఆగస్టులో తాము ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ ‘తొమ్మిదేళ్ల చిన్నారిపై కుక్క దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలా?.. దానికి బాధ్యులెవరు? ? వీధికుక్కలకు తిండి పెడుతున్న సంస్థా? ఈ సమస్యను మేం కళ్లు మూసుకుని పట్టించుకోకుండా వదిలేయాలని మీరు కోరుకుంటున్నారా?’ అని జస్టిస్ సందీప్ మెహతా తీవ్రంగా ప్రశ్నించారు. వీధికుక్కలను సంరక్షిస్తున్న, వాటికి తిండిపెడుతున్న మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఫిర్యాదును పరిశీలించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తిరస్కరించింది. కావాలంటే వారు పోలీసు స్టేషన్లలో కేసు పెట్టుకోవచ్చని సూచించింది. జంతు సంరక్షణ సంస్థలు, కుక్కల ప్రేమికులు వీధికుక్కలపై ఆపారమైన ప్రేమ కనబరుస్తూ ఆహారం పెట్టి వాటిని పోషిస్తున్నారని, అవి వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ రోడ్లపై సంచరించేవారిని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని, వాటి వల్ల గాయాలపాలైనవారు, చాలా సందర్భాల్లో సంభవిస్తున్న మరణాలకు వాటిని పెంచి పోషిస్తున్నవారే భరించాలని, బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించక తప్పదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కుక్కల విషయంలో భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నవారు వాటి వల్ల బాధితులవుతున్న మనుషుల పట్ల కాస్తయిన సానుభూతి చూపించడం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కుక్క కాటు మరణం లేదా తీవ్రమైన గాయం సంభవించినప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని పేర్కొంది. వీధికుక్కలను తరలించి వాటికోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేసి సంరక్షించాలని, అక్కడే వాటికి కు.ని. ఆపరేషన్లు చేయించాలని.. అయితే కు.ని. చేసిన కుక్కలను తిరిగి తీసుకొచ్చి వదిలేయకుండా షెల్టర్లలోనే వాటిని కొనసాగించాలని గత ఏడాది ఆగస్టులో జరిపిన విచారణ సందర్భంగా న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అప్పగిస్తూ.. మూడు నెలల్లో తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదికలు సమర్పించాలని కూడా ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢల్లీిలో సుమారు 200 వీధికుక్కలకు ఆహారం పెడుతూ.. ‘డాగ్ అమ్మ’గా పేరొందిన ప్రతిమాదేవి అనే 80 ఏళ్ల వృద్ధురాలి తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వీధికుక్కల దత్తతపై ఒక విధానాన్ని ప్రకటించాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన సూచించారు. దీనికి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ.. ‘నేను పదోన్నతిపై 2011లో ఇక్కడికి వచ్చా. అప్పట్నుంచీ ఇప్పటిదాకా నేను విన్న అతి సుదీర్ఘమైన వాదనలు ఇవే. కుక్కల కోసం ఇంత సుదీర్ఘ వాదనలు వినిపిస్తున్నారు.. కానీ మనుషుల గురించి, అనాథ పిల్లల దత్తత గురించి ఎవరూ ఇంతలా వాదించలేదు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. వీధికుక్కలకు సంబంధించిన అంశాలు భావోద్వేగపూరితమైనవని మరో సీనియర్ న్యాయవాది మేనక పేర్కొనగా ఆ భావోద్వేగాలు కేవలం కుక్కల విషయంలో మాత్రమే కనిపిస్తున్నాయని ధర్మాసనం ఎత్తిపొడిచింది. కుక్కలకు తిండి పెడుతున్నామని ప్రచారం చేసుకునేవారు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఆ పని చేయాలని సూచించింది. ఇక నుంచి ప్రతి కుక్క కాటుకు, ప్రతి ప్రాణనష్టానికి రాష్ట్రప్రభుత్వాలే బాధ్యత వహించి భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. వీధికుక్కల తరపున చాలమంది న్యాయవాదులు వాదిస్తున్నారని, కానీ మనషుల తరపున వాదించేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. కుక్కకాటు వల్ల పిల్లలు, వృద్ధులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని తీవ్రంగా ప్రశ్నించింది. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారిలో 95 శాతం మందికి ఇష్టం లేకపోయినా కేవలం ఐదు శాతం మేరకే ఉన్న కుక్కల ప్రేమికుల కోసం అందరూ భయపడుతూ బతకాలా? అని కోర్టు నిలదీసింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర జనసమ్మర్థ ప్రాంగణాల్లో కుక్కల బెడద లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని.. కుక్కలకు స్టెరిలైజ్ చేసి, టీకాలు వేసిన తర్వాత షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఈ బాధ్యత అప్పగించి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించి తమ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాని సూచించింది. తదుపరి విచారణలో వీటిలో ప్రగతిని సమీక్షిస్తామని స్పష్టం చేసింది.










Comments