top of page

అసలు కంటే నకిలీ కిక్‌ గురూ..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Sep 4, 2025
  • 4 min read
  • ఇద్దరు సేల్స్‌మెన్లు అరెస్ట్‌

  • పరారీలో నీలకంఠు

  • పక్క రాష్ట్రాల నుంచి కన్జ్యూమబుల్‌ లిక్కర్‌

  • ఇక్కడ కేరామెల్‌ మిక్సింగ్‌

  • 158 లీటర్లు, 1700 సీసాలు లభ్యం

  • బెల్టుషాపులకు సరఫరా

  • షాపుల్లో అడల్ట్రేషన్‌

వాస్తవం కంటే భ్రాంతి హాయిగా ఉంటుంది.. అలాగే అసలు కంటే కల్తీ ఎక్కువసేపు నరాల్లో విద్యుత్‌లా ప్రవహిస్తూవుంటుంది.. ప్రభుత్వం అమ్మినదానికంటే నకిలీవి అమ్మడమే యజమానుల కిక్‌.. అవి తాగడమే తాగుబోతులకు మహా కిక్కు.
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యమే దొరకలేదు. అస్సలు తాగుదామంటే బ్రాండ్‌లే ఉండేవి కావు. కానీ మా ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన మందు, అన్ని రకాల బ్రాండ్‌ను అందిస్తున్నాం’’

- ఇదీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకుల ఉవాచ.

‘‘ఎక్కడా బెల్ట్‌ అనే పదం వినబడటానికి వీళ్లేదు.. కల్తీ మద్యానికి తావులేకుండా పాలసీని రూపొందించాం..’’

- ఇదీ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొత్త మద్యం పాలసీ వచ్చినప్పుడు పత్రికల్లో ఇచ్చిన ప్రకటన.

కట్‌చేస్తే.. గడిచిన ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం 40 శాతం ఓట్లు సంపాదించుకొని 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడానికి ప్రధాన కారణం మద్యం ప్రియులే. కల్తీ మాట దేవుడెరుగు.. కనీసం తాగుదామంటే బ్రాండ్‌లు ఉండేవికావు. తల్లుల పేరిట ఎన్ని స్కీములిచ్చినా, తండ్రులకు మాత్రం సరైన బ్రాండ్‌ దొరక్కపోవడంతో మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు గుద్దేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. కూటమి ప్రభుత్వంలో కూడా నాణ్యమైన మద్యం దొరుకుతుందా? అంటే.. సమాధానం చెప్పడం కష్టం. గత ప్రభుత్వ హయాంలో చీప్‌లిక్కర్‌ తాగి వందలాది మంది మరణించారంటూ ప్రభుత్వం ఆరోపించింది. ఇందుకు అనేక కేస్‌ స్టడీలను పత్రికాముఖంగా బయటపెట్టింది. నిజమే కావచ్చు.. నిత్యం తాగినోడు ఎప్పటికైనా తాగడం వల్లే చస్తాడు. కల్తీ మద్యం తాగితే మరికొంచెం ముందుగా చస్తాడు. గడిచిన ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ తప్పతాగి రోడ్ల మీద దొర్లుతున్నవారు కనిపిస్తునే ఉన్నారు. ఇటువంటి వారిని చూసి కల్తీ లిక్కర్‌ తాగడం వల్లే ఇలా పడిపోతున్నారంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడూ అదే జరుగుతోంది. విచిత్రమేమిటంటే.. జిల్లాలో వైకాపా ప్రభుత్వంలో కల్తీ మద్యానికి పాల్పడినవారే కూటమి ప్రభుత్వంలో కూడా కల్తీకి పాల్పడటం.

వివరాల్లోకి వెళ్తే.. సారవకోట మండలం అవలంగి గ్రామంలో కల్తీ మద్యం తయారీ, వాటి అమ్మకాల గుట్టు రట్టయింది. గడిచిన వారం రోజుల నుంచి ఎక్సైజ్‌ అధికారులు చేస్తున్న స్టింగ్‌ ఆపరేషన్‌లో ఎట్టకేలకు ఈ మాఫియా బయటపడిరది. దీనికి సూత్రధారి గతంలో వైకాపా ప్రభుత్వంలో కోటబొమ్మాళి షాపులకు సూపర్‌వైజర్‌గా పని చేసిన సకలాబత్తుల నీలకంఠే కావడం గమనార్హం. గతంలో షాప్‌ నెంబరు 01991లో కల్తీ మద్యంను ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది. దీనికి సూత్రధారిగా ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్న నీలకంఠు మాత్రం ఆ రోజు తాను సెలవులో ఉన్నానని తప్పించుకున్నాడు. అందుకు అప్పటి ఎక్సైజ్‌ అధికారులు కూడా సహకరించారు. ఎందుకంటే వీరి మధ్య క్విడ్‌ప్రో కో ఉండేది. ప్రభుత్వ మద్యం షాపులు కావడం వల్ల ఎక్సైజ్‌ అధికారులకు డబ్బులిచ్చేవాడు కరువైపోయాడు. దీంతో నీలకంఠే కల్తీ మద్యం, కార్కింగ్‌, అడల్ట్రేషన్‌ వంటివి చేసి, చేయించి ప్రతీ షాపు నుంచి మామూళ్లు వసూలుచేసి ఎక్సైజ్‌ అధికారులకు ఇచ్చేవాడు. ఈ సమయంలోనే నీలకంఠు చేసిన అనేక అక్రమాలు వెలుగులోకి తెచ్చినా ఎక్సైజ్‌ అధికారులు తప్పించారే తప్ప ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే నీలకంఠు ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ డీసీ డి.శ్రీకాంత్‌రెడ్డి అవలంగిలో ఉన్న దుర్గావైన్స్‌ షాపును తనిఖీ చేయగా, నకిలీ మద్యం పట్టుబడిరది. ఈ షాపులో రాయల్‌ లాన్సర్‌ క్వార్టర్‌ బాటిళ్లు, ఆఫీసర్స్‌ ఛాయిస్‌ శాంపిల్‌ బాటిళ్లు, క్వార్టర్‌ బాటిళ్లు మొత్తం 54 బాటిళ్లు దొరికాయి. ఈమేరకు షాపులో పని చేస్తున్న తంగుడు మణికంఠ, ఎస్‌.సుందరరావులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో సకలాబత్తుల నీలకంఠం, షాపు నిర్వాహకుడు పిట్ట పైడిరాజు ఈ నకిలీ మద్యాన్ని విక్రయించమని తమకు అప్పగించినట్టు వారు తెలిపారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు అవలంగిలోనే మోణింగివీధిలోని ఒక ఇంటిలో సోదాలు చేయగా, నకిలీ మద్యం తయారవుతున్నట్టు తేలింది. ఇక్కడ కూడా ఆఫీసర్స్‌ ఛాయిస్‌, ఏపీ బ్లాక్‌, సిల్వర్‌స్టిక్‌ బ్రాండ్లతో నకిలీ మద్యం తయారుచేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 158 లీటర్ల నకిలీ మద్యం ఇక్కడ దొరికింది. అలాగే 1700 ఖాళీ సీసాలు, వెయ్యి నకిలీ మూతలు, బ్యాచ్‌ నెంబరు స్టాంపింగ్‌ మిషిన్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. ఇందులో నీలకంఠు, షాపు నిర్వాహకుడు పరారీలో ఉన్నారు.

అసలు కల్తీ మద్యం ఎలా తయారవుతుంది?

జిల్లాలో గాని, రాష్ట్రంలో గానీ ఇంతవరకు అడల్ట్రేషన్‌ మాత్రమే అందరికీ తెలుసు. అంటే కాస్ట్‌లీ లిక్కర్‌లో చీప్‌ను కలపడం, చీప్‌ లిక్కర్‌లో నీరును కలపడం. ఇది ఎక్కడా ఎప్పుడూ జరిగే పనే. అది ప్రభుత్వం నిర్వహించినా, ప్రైవేటు చేతిలో ఉన్నా జరిగేదిదే. దీనికి తోడు కొత్త ప్రభుత్వం పెద్ద ఎత్తున లైసెన్స్‌ ఫీజులు వసూలు చేసి, తక్కువ మార్జిన్‌ ఇస్తుండటంతో చేసేదిలేక అడల్ట్రేషన్‌కు దిగుతున్నామంటూ షాపు నిర్వాహకులు ఎక్సైజ్‌ అధికారులకు చెబుతున్నారు. అలాగే కార్కింగ్‌ కూడా కామనే. ఎలా అంటే.. ఏపీబీసీఎల్‌ మూత మీద వేసిన స్టిక్కర్‌ అలాగే ఉంటూ సీల్‌ ఏమాత్రం తెగకుండా సీసా మూతను లేపేసి అందులో వేరే బ్రాండ్లు కలిపేసి మళ్లీ అనుమానం రాకుండా సీల్‌తో సహా క్యాప్‌ను బిగించడం. పెద్ద తలకాయలు ఫిర్యాదు చేస్తే తప్ప సహజంగానే ఎక్సైజ్‌ అధికారులు దీనికోసం పట్టించుకోరు. ఎందుకంటే.. మంత్లీలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు శ్రీకాకుళంతో పాటు మరో నియోజకవర్గం తప్ప అన్నిచోట్లా ఎమ్మెల్యేలే మద్యం షాపులు చేస్తుండటం వల్ల ఎక్సైజ్‌ అధికారులు మరింత నిగడదన్నేశారు. కానీ నకిలీ మద్యం మాత్రం క్షమించరాని నేరం. మన రాష్ట్రంలో సారా తాగడం వల్ల చనిపోతున్నారని, తమిళనాడులో అయితే స్పూరియస్‌ లిక్కర్‌ తాగడం వల్ల అనేకమంది చనిపోయి ప్రభుత్వాలు కూలిపోయాయని తేలడంతో సారాను నిషేధించారు. కానీ మన పక్క రాష్ట్రం ఒడిశాలో సారా ఇప్పటికీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రానికి బోర్డర్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో కన్జ్యూమబుల్‌ ఆల్కహాల్‌ అని దొరుకుతుంది. ఇది మన దగ్గర నిషేదం గానీ, కొన్ని రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఉమర్‌కోట్‌కు వెళితే.. ఈ కన్జ్యూమబుల్‌ ఆల్కహాల్‌ దొరుకుతుంది. ఇది మన సారాకంటే ఘోరంగా ఉంటుంది. దాన్ని పెద్ద ఎత్తున జిల్లాకు తరలించి, ఆ వాసనను డైల్యూట్‌ చేయడం కోసం అందులో నీరు కలుపుతారు. అలాగే మందు రంగు రావడం కోసం కేరామెల్‌ (కలర్‌) కలుపుతారు. దీంతో ఇది అచ్చం లిక్కర్‌ రంగులోకి వస్తుంది. మొలాలిస్‌ కర్మాగారాల నుంచి వేస్టేజ్‌ను తీసుకొని కూడా కేరామెల్‌ను కలిపి ఈ నకిలీ మద్యం తయారుచేస్తున్నారు. ఈ కన్జ్యూమబుల్‌ ఆల్కహాల్‌ను నేరుగా తాగితే చస్తారు. అందుకే దీన్ని డైల్యూట్‌ చేస్తారు. 20 లీటర్ల కన్జ్యూమబుల్‌ ఆల్కహాల్‌ తెస్తే 100 లీటర్ల స్పూరియస్‌ లిక్కర్‌ తయారవుతుంది. ఇప్పుడు అవలంగిలో తయారవుతున్నదదే. అయితే ఈ మందును ఎక్కడికి సరఫరా చేస్తారనేదే ప్రశ్న. జిల్లాలో షాపులన్నీ కొందరు సిండికేట్‌ల చేతుల్లో ఉన్నాయి. వారితో ఉన్న పరిచయాలతో బాట్లింగ్‌ కంపెనీ అమ్మే ధర కంటే తక్కువకు అమ్ముతారు. దీనివల్ల పెద్ద మార్జిన్‌ వస్తుంది. ఇప్పుడు షాపులకు వచ్చిన ఈ సరుకు అక్కడే ఉంటే ప్రమాదం కాబట్టి బెల్టులకు తరలిస్తారు. సాధారణంగా ప్రభుత్వం సరఫరా చేసే మద్యాన్నే క్వార్టర్‌ మీద రూ.20 అధికానికి బెల్టులకు షాపులు అమ్ముతాయి. బెల్టు షాపు స్థానికంగా మరో రూ.20 కలిపి రూ.40 అధిక ధరకు అమ్ముతుంది. ఇప్పుడు ఆఫీసర్స్‌ ఛాయిస్‌ వంటి లేబుళ్లతో నకిలీ మద్యం తయారవడం వల్ల రూపాయికి రూపాయి మిగులుతుంది. బెల్టు షాపులకు మాత్రం ఏ నకిలీ అయినా రూ.20 అధికానికే విక్రయిస్తారు. అదీ కాకుండా ఇప్పుడు షాపులో నకిలీ మద్యం దొరికిందంటే.. వాటిని అక్కడున్న సేల్స్‌మెన్‌లు ఫాస్ట్‌ మూమెంట్‌ ఉన్న కాస్ట్‌లీ లిక్కర్‌లో కలపడానికి సిద్ధంగా ఉంచినట్టు అర్థమవుతుంది.

అసలు నరసన్నపేట నియోజకవర్గంలో బెల్టు షాపులు మొత్తం నడుపుతున్న మంత్రి మాజీ పీఏ, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కొడుకును అరచేతిలో పెట్టుకొని ఆడిస్తున్న వ్యక్తి పాత్ర ఇందులో ఎంతుంది? అసలు కల్తీ లిక్కర్‌ తయారీకి పెట్టుబడి ఎవరిది? వంటి విషయాలతో మళ్లీ కలుద్దాం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page