ఆంక్షల అమెరికాను లొంగదీశారట!
- DV RAMANA

- Sep 27, 2025
- 2 min read

ఏది జరిగినా అది మా ఘనతే అని డప్పు కొట్టుకోవడంలో కాషాయాధారులకు మించినవారు లేరేమో! కొందరిని మోసగించవచ్చేమో గానీ.. అందరినీ మభ్యపెట్టి మాయ చేయలేమన్న విషయం తెలిసినా.. తమ హెచ్చులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నా.. నవ్విపోదురుగాక మాకేంటి? అన్నట్లు అదే పంథాను కొనసాగిస్తున్నారు. రష్యా, అమెరికాలతో సంబంధాల విషయంలో నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, చెప్పుకొంటున్న గొప్పలే దీనికి నిదర్శనం. ఎన్డీయే సర్కారు విదేశాంగ విధానాల్లో వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ఉక్కు మనిషి మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యం అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ మెడలు వంచేస్తున్నామని, దాని ఆంక్షలను బేఖాతరు చేసి మన సత్తాను చాటుతున్నామని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు పరిస్థితి ఇంతవరకు రావడానికి కారణమెవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా మోదీ సర్కారు వైపే చూపించాల్సి ఉంటుంది. స్వతంత్ర భారతదేశం తొలినుంచి అలీన విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది. అలాగే ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచీ రష్యాతో చిరకాల మైత్రి కొనసాగిస్తూ.. మరో అగ్రరాజ్యం అమెరికాతో అవసరం మేరకే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం భారత విదేశాంగ విధానంలో కీలక అంశం. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత.. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా మన విదేశాంగ విధానం కొంత మార్పు సంతరించుకున్నదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్న మాట. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అనేక అపసవ్య నిర్ణయాలతో అందరినీ అసంతృప్తికి గురిచేశారు. అయినాగానీ ట్రంప్‌ను తన ప్రియమిత్రుడిగానే మోదీ అమెరికా టారిఫ్‌ల కొరడా రaుళిపించకముందు వరకు పరిగణించారు. 2019లో తన అమెరికా పర్యటన సందర్భంగా హూస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలోనూ.. ఆ తర్వాత ఏడాది అంటే 2020లో అహ్మదాబాద్‌లో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నా ముందుజాగ్రత్తలన్నింటినీ గాలికొదిలేసి కోట్లాది రూపాయల ఖర్చుతో లక్షలాదిమందిని తరలించి ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించి ట్రంప్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నది మోదీ సారధ్యంలోని కమలదళాలే. ఇక ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత దౌత్య విధానాలన్నింటినీ పక్కనపెట్టి మరీ తన ప్రియమిత్రుడు ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ట్రంప్‌ను కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. తరతరాలుగా కొనసాగుతున్న భారత్`సోవియట్ మైత్రిని కాలదన్నే నిర్ణయాలు తీసుకున్నారు. వికసిత భారత్ అంటూ ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకుని కాలపరీక్షకు నిలబడిన భారత విదేశాంగ విధానాన్ని మంటగలిపి ఇండియా మొత్తాన్ని అమెరికా వైపు తిప్పేసింది మన కమలం పువ్వుల దళాలే. ట్రంప్ గెలిచినందుకు ఉత్సాహంతో ఊగిపోతూ వీధివీధినా సంబరాలు చేసుకున్నదీ మన బీజేపీ బాబులే. అంతగా భుజాలకెత్తుకుని మోసిన సదరు ట్రంపే వీరికి జెల్ల కొట్టేలా భారత్‌ను హెచ్చరించి ఆపరేషన్ సింధూర్‌ను తానే ఆపేశానని ఏకపక్షంగా ప్రకటించేసి ఆ ప్రత్యేక ఆపరేషన్‌ను అర్ధాంతరంగా ముగించేలా చేసి కమలనాథుల గాలి తీసేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడానికి ఏకంగా భారతదేశమే కారణమన్నట్లు ఆరోపించడం ప్రారంభించిన ట్రంప్.. ఆ యుద్ధం నేపథ్యంలో నాటో, అమెరికా విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి పెద్ద పరిమాణంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు తన ప్రియమిత్రుడి సారధ్యంలో ఉన్న భారత్‌పై ట్రంప్ మహాశయుడు కత్తిగట్టారు. తమ దేశానికి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 సుంకాలు పెంచడంతోపాటు మరో 25 శాతం జరిమానా విధించారు. తాజాగా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై ఏకంగా వంద శాతం టారిఫ్ విధించారు. ఇంత జరిగాక.. ఇంకా ట్రంప్ తన మిత్రుడని చెప్పుకొంటే బాగోదని భావించారేమో.. కమలదళపతుల వాట్సప్ యుద్ధం, మీడియా ప్రచారం హఠాత్తుగా దిశ మార్చేసుకుంది. రష్యాతో చిరకాల మైత్రిని వదులుకోలేకే అమెరికా ఆంక్షలను ఖాతరు చేయడంలేదని సమర్థించుకోవడం మొదలుపెట్టారు. గతంలో అమెరికా వంటి దేశాల నుంచి ఇంతకంటే తీవ్రమైన ఆంక్షలు, ఒత్తిళ్లు వచ్చినా.. అప్పటి మన పాలకులు ఏమాత్రం అమెరికాకు లొంగలేదు. కానీ ప్రస్తుత మోదీ సర్కారు అనుంగు మిత్రుడంటూ మొదట ట్రంప్‌ను ముద్దుచేసి నెత్తికెక్కించుకుంది. అధ్యక్షుడైన తర్వాత ఆ ట్రంపే స్నేహబంధాన్ని తెంచేసేలా ఆంక్షల కొరడా రaుళిపస్తే తప్ప బీజేపీ నేతలకు తత్వం బోధపడలేదు. అదే సమయంలో నాటో ఆంక్షల ఫలితంగా అమ్ముడిపోని తన ముడిచమురును ఎలాగోలా అమ్మేందుకు రష్యా రాయితీల వర్షం కురిపించింది. అదే అదనుగా అక్కడి నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేస్తూ దాన్నే రష్యా కోసం అమెరికాను మోదీ ఎదుర్కొంటున్నారని, అగ్రరాజ్యం కొమ్ములు విరిచేస్తున్నారని జబ్బలు చరుచుకుంటున్నారు. తాజాగా ఒక బీజేపీ నేత తన ఫేస్‌బుక్ వాల్‌పై రాసిన దాని ప్రకారం మోదీని, బీజేపీని అణిచేసి భారత్‌ను విడదీయడానికి అమెరికా కుట్ర పన్నిందట! ఇదెక్కడి చోద్యం అసలు మిత్రత్వం పేరుతో ట్రంప్‌కు కొమ్ము కాసింది మీరు.. తీరా అది బెడిసికొడితే భారత వ్యతిరేక కుట్ర అంటూ వక్రభాష్యం చెప్పడం తగదు.










Comments