top of page

వారి యుద్ధం.. వీరికి అవకాశం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read

రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఆ రెండింటితోపాటు వాటికి మద్దతుగా నిలిచిన దేశాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాయన్నది తెలిసిందే. ఆయా దేశాల్లో వనరులు, మౌలిక వసతులు దెబ్బతినడంతోపాటు జనహననం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వంటి విపరిణామాలకు యుద్ధం దారితీస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ యుద్ధ పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందే పక్షాలు కూడా ఉంటాయని ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం ద్వారా తేటతెల్లం అవుతున్నది. దీనికి రష్యా, ఉక్రెయిన్‌లను ఉదాహరణలుగా చూపవచ్చు. వాస్తవానికి ఈ రెండు దేశాలు గత నాలుగేళ్లకుపైగా పరస్పరం తలపడుతున్నాయి. నిర్విరామంగా యుద్ధం చేస్తున్నాయి. ఫలితంగా దాదాపు అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నమై ఈ దేశాలు గిజగిజలాడిపోతున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుండగా.. తమ మద్దతు ఉన్న ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు ప్రతీకారంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను తట్టుకునేందుకు తన ప్రధాన ఆదాయ వనరు అయిన ముడిచమురు అమ్మకాలపై తన మిత్రులైన భారత్, చైనాలకు రష్యా భారీ రాయితీ(డిస్కౌంట్లు)లు ప్రకటించింది. కానీ ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలుకావడం, గల్ఫ్ నుంచి క్రూడ్ రవాణా స్తంభించిపోయిన పరిస్థితుýను గమనించిన రష్యా ఇప్పటివరకు ఇస్తున్న రాయితీలను గణనీయంగా తగ్గించేసింది. గతంలో ముడిచమురు బ్యారెల్‌పై 13 డాలర్ల వరకు రాయితీ ఇచ్చిన రష్యా ఇప్పుడు నాలుగు డాలర్లకు మించి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర వంద డాలర్లపైకి ఎగబాకడం, లభ్యత తగ్గిపోవడాన్ని అవకాశంగా తీసుకున్న రష్యా తన మిత్రురాలైన భారత్ నుంచే అధికాదాయం పిండుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. క్రూడ్ ధర ఒక డాలర్ పెరిగితే భారత్‌పై సుమారు రూ.16వేల కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే ఆ మేరకు రష్యా ప్రయోజనం పొందుతున్నట్లే. ఇంతకాలం మైత్రీభావంతోనే రష్యా భారీ డిస్కౌంట్‌తో మనకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్నదన్న వాదనలను ఈ పరిణామాలు పటాపంచలు చేస్తున్నాయి. చైనా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నా అది మరో రూపంలో ఆ భారాన్ని భర్తీ చేసుకుంటున్నది. యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు యుద్ధసాంకేతికతను అందిస్తూ బదులుగా ఆ దేశంలో తన పెట్టుబడులు పెంచుకుని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకునే పనిలో నిమగ్నమైంది. మరోవైపు నాలుగేళ్లుగా రష్యా దాడులతో చితికిపోయిన ఉక్రెయిన్ తాను నష్టపోయిన దాంట్లో కొంతైనా ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల నుంచి రాబట్టుకోవాలని యోచిస్తున్నది. రక్షణ రంగానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. రష్యాతో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఉక్రెయిన్ తన వద్ద ఉన్న ‘డ్రోన్ రక్షణ’ అనుభవాన్ని, నైపుణ్యాన్ని గల్ఫ్ దేశాలకు బదిలీ చేస్తామని గల్ఫ్ దేశాలకు ఆఫర్ చేయడం విశేషం. అయితే అది ఉచితం కాదని మాత్రం స్పష్టం చేసింది. డ్రోన్ సాంకేతికత అందించినకు ప్రతిఫలంగా ఆర్థిక, ఇతర సాంకేతిక సహకారాన్ని ఉక్రెయిన్ ఆశించడం పెద్ద చర్చకు తావిచ్చింది. డ్రోన్ల యుద్ధంలో ఉక్రెయిన్‌ను ప్రయోగశాలగా పరిగణించవచ్చు. ఎందుకంటే గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ఇరాన్ తయారీ ‘షాహెద’ వంటి ఆత్మాహుతి డ్రోన్లు ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. వేల సంఖ్యలో వచ్చి పడుతున్న వాటిని ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సైన్యం ప్రపంచంలోనే మరెవరికీ లేని ప్రత్యేక అనుభవాన్ని సంపాదించింది. ఖరీదైన క్షిపణులే కాకుండా తక్కువ ఖర్చుతో తయారైన ఇంటర్సెప్టర్ డ్రోన్లు, జామింగ్ పరికరాలను ఉపయోగించడాన్ని కూడా ఉక్రెయిన్ నేర్చుకుంది. ఇప్పుడు అదే సాంకేతికత, నైపుణ్యం పశ్చిమాసియా (గల్ఫ్) దేశాలకు అత్యవసరంగా మారింది. ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలు ఉక్రెయిన్ సాయాన్ని కోరాయి. వారి వినతులపై జెలెన్‌స్కీ స్పందిస్తూ ‘మేం ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు.. కానీ మానవాళిని కాపాడటానికి డ్రోన్ల నుంచి రక్షణ పొందడానికి మా వద్ద ఉన్న అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ తన రక్షణ నిపుణుల బృందాలను గల్ఫ్ దేశాలకు పంపింది. అయితే ఈ సహాయం ఉచితం కాదని జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, తమ దేశాన్ని రక్షించుకోవడానికి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి నిధులు, ఆధునిక సాంకేతికత అవసరమని జెలెన్‌స్కీ భావిస్తున్నారు. ఆయన ప్రతిపాదన ‘డ్రోన్ డిఫెన్స్ ఎక్స్ఛేంజ’ లాంటిదని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంటే ఉక్రెయిన్ తన మేధస్సును, సాంకేతికతను అందిస్తే ప్రతిఫలంగా గల్ఫ్ దేశాలు ఆర్థిక, ఆయుధ సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేయాలి. అమెరికాలో రాజకీయ వాతావరణం మారుతున్న వేళ ఉక్రెయిన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకం. అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పలువురు ఉక్రెయిన్‌కు సైనిక సాయం తగ్గించాలని సూచిస్తున్న తరుణంలో జెలెన్‌స్కీ గల్ఫ్ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తన దేశ మనుగడకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. యుద్ధం కోసం పూర్తిగా పాశ్చాత్య దేశాల సాయంపైనే ఆధారపడకుండా తనకున్న రక్షణ పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయడం ద్వారా ఉక్రెయిన్ సొంతంగా నిధులు సమకూర్చుకోవాలని, దౌత్య సంబంధాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇది ఒకవైపు రక్షణ పొందుతున్న దేశాలకు మేలు చేస్తుంటే మరోవైపు ఉక్రెయిన్ యుద్ధ యంత్రాంగానికి అవసరమైన ఇంధనాన్ని నిధులు, సాంకేతికత సమకూరుస్తున్నది. ఈ ఒప్పందాలు ఉక్రెయిన్-రష్యా యుద్ధ గతిని ఎలా మారుస్తాయో గానీ.. సొంత ప్రయోజనాల సాధనకు దేన్నయినా ఉపయోగించుకోవచ్చని ఆధునిక పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page