వామపక్షం.. ఎప్పుడూ ఒక పక్షమేనా?!
- DV RAMANA

- 8 hours ago
- 3 min read

మనది సెక్యూలర్ దేశం.. అంతకుమించి సంక్షేమ రాజ్యం. మన దేశానికి, ఇక్కడికి ప్రజలకు ఏది మేలు చేస్తే అదే చేయాలి. ఏ దేశం వద్ద మన ప్రయోజనాలు నెరవేరుతాయో వాటితోనే స్నేహబంధం పెనువేసుకోవాలి.. అలా అని మిగతా దేశాలతో విరోధాలు పెంచుకోవాలని కాదు గానీ.. మన ప్రయోజనాలకు పెద్దపీట వేయాలన్నది దీని ఉద్దేశం. మనకు ప్రాధాన్యత ఇచ్చి కష్టకలాంలో అండగా నిలిచేవారితోనే మనమూ నడవాలి.. వారికే మద్దతు ఇవ్వాలి. అది అమెరికా కావచ్చు.. రష్యా కావచ్చు.. చైనా కావచ్చు.. ఇంకా చెప్పాలంటే మనసు మార్చుకుని భారత్‌తో సఖ్యంగా ఉంటూ అభివృద్ధి చెందాలనుకునే పాకిస్తాన్ అయినా కావచ్చు. మన ప్రయోజనాలను కాపాడేవారు లేదా నెరవేర్చేవారు ఎవరైనా.. ఏ దేశామైనా మనకు ఒకటే అన్నట్లు మన రాజనీతి, వ్యవహార శైలి ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించు ఇదే ధోరణితో రాజకీయాలు చేస్తాయి. వేరే వారి బాగు కోసం ఏ దైశమైనా ఆలోచిస్తుందని అనుకోవడం తెలివితక్కువతనమే అవుతుంది. అది తనకు మాలిన ధర్మమే అవుతుంది. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా మనతో న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏడు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ స్నేహబంధంలో ఏనాడూ భారత్‌కు క్రూడ్ ఆయిల్‌పైన డిస్కౌంట్ ప్రకటించి ఎరుగని రష్యా 2021 తర్వాత భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసినా.. అన్నీ కూడా ఆయా దేశాల అవసరార్థ రాజకీయమే తప్ప మన దేశాన్ని ఉద్ధరించడానికి మాత్రం కానేకాదు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. తదనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ఉండాలి. అంతే తప్ప తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని మంకుపట్టు పట్టకూడదు. కానీ మన దేశ కమ్యూనిస్టులు మాత్రం ఇవేవీ పట్టకుండా పక్కా పిడివాదులుగా మిగిలిపోతున్నారు. ఎప్పుడో కాలం చెల్లిన దశాబ్దాలనాటి విదేశీ భావజాలాన్ని నరనరాల్లో నింపేసుకున్నారు. ప్రపంచ పరిణామాలను మన దేశ శ్రేయస్సు దృక్కోణంలో చూడకుండా తమ విదేశీ వామపక్ష భక్తిభావ త్రాసులో కొలిచి చూస్తూ.. తమలాగే ప్రభుత్వంతో సహా ఈ దేశమంతా స్పందించాలని కమ్యూనిస్టు మేధావులు కోరుకోవడం అత్యంత శోచనీయం. వీరు వీర భక్తితో కొలిచే కమ్యూనిస్టు చైనా, రష్యాలు ఏది చేస్తే అదే రైటు.. కానీ ఆవే పనులను ఇతరులు చేస్తే మాత్రం చాలా తప్పు అని గగ్గోలు పెడుతున్నారు. భారతీయ వామపక్షవాదుల లెక్క ప్రకారం ప్రపంచ శాంతికి మూడే మూడు శక్తులు విఘాతం కలిగిస్తున్నాయి. అవే అమెరికా, ఇజ్రాయెల్, ఆరఎసఎస్. వాటిని ప్రపంచమంతా వెలివేయాలన్నది వారి డిమాండ్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. ఇప్పుడు అమెరికా దాడులు చేస్తున్నట్లుగానే.. గతంలో రష్యా చెకస్లోవేకియా, హంగేరీ, జార్జియా, తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తదితర డజను దేశాల మీద సైనిక దాడులకు పాల్పడింది. చైనా కూడా టిబెట్, భారత్, కొరియా, వియత్నాం వంటి దేశాల మీద దాడులు చేసి ఆయా దేశాల భూభాగాలను లాక్కుంది. మరి ఈ రెండు కమ్యూనిస్టు దేశాలను ఏనాడైనా భారతీయ కమ్యూనిస్టులు వీటిని ఖండించిన దాఖలాలు ఉన్నాయా? చైనా మన పక్కనే ఉన్న టిబెట్‌ను అక్రమించేసి మన పీకల మీద కత్తి పెట్టి ఆక్సయిచిన్‌లో 40వేల చదరపు కిలోమీటర్లు అక్రమిస్తే.. ఈ అంధ కమ్యూనిస్టు భక్తులు దేశ శ్రేయస్సును ఫణంగా పెట్టి చైనాను వెనకేసుకొచ్చారు. అలాంటప్పుడు వీరికి అమెరికానో.. ఇంకో దేశాన్నో విమర్శించే నైతిక హక్కు ఉంటుందా? తన ఉనికిని కాపాడుకోవడానికి యూదు దేశం ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటాన్ని వీరు ఎలా కాదంటారు?? అనేక దాడుల కారణంగా కకావికలమై పోయిన ప్రపంచంలోని అతి చిన్న జనసమూహమైన యూదులు తాము ఉండటానికి తమకే చెందిన భూమి మళ్లీ తమ సొంతం కావాలని కోరుకోవడమే వామపక్ష మేధావుల దృష్టిలో పెద్ద నేరం! తమదైన ఒక చిన్న భూభాగంలో.. తమకు నచ్చినట్లు బతకడానికి ఈ చిన్న యూదుల సమూహానికి అర్హత లేదని చెబుతున్న మత ఆధారిత పాలస్తీనా ప్రపంచంలోని 50కిపైగా అదే మత ఆధారతి దేశాలతో కలిసి యూదు సమూహమన్నదే ప్రపంచంలో లేకుండా శాశ్వతంగా నాశనం చేయాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తుంటే మన కమ్యూనిస్టులు వీరికి మద్దతు తెలుపుతున్నారు. తామెప్పుడూ బలహీనుల పక్షమేనని వామపక్షీయులు చెబుతుంటారు. కానీ చిన్న జనసమూహమైన యూదులా లేదా 50కిపైగా దేశాల్లో వందల కోట్ల మత జనాభానా.. ఏది బలహీనపక్షమో వారే చెప్పాలి. పాలస్తీనియన్లను వారి సొంత దేశంలో ఉండనివ్వకుండా యూదులు ఇబ్బందిపెడుతున్నారని విరుచుకుపడే కమ్యూనిస్టులు బుద్ధిస్టులను తరిమేసి టిబెట్‌ను ఆక్రమించిన చైనాను మాత్రం పల్లెత్తు మాట అనడంలేదు. ఇస్లామిక్ మతమౌఢ్యం, తీవ్రవాదం వల్ల జోరాష్ట్రియన్స్ ఇరాన్ నుంచి, యజాడీలు ఇరాక్ నుంచి, క్రిస్టియన్స్ లెబనాన్, సిరియా నుంచి హిందువులు, సిక్కులు ఆఫ్ఘన్, పాక్, బంగ్లా, కాశ్మీర్‌ల నుంచి తరిమివేతకు గురయ్యారు. పాలస్తీనా గురించి కన్నీరు కార్చే ఈ మేథావులు ఈ సమూహాల గురించి ఒక్క కన్నీటి బొట్టయినా రాల్చలేదు. ఎందుకంటే వామపక్షాల దష్టిలో పైన పేర్కొన్న మూడుశక్తులు తప్ప ప్రపంచంలో మిగతావన్నీ శాంతి కోరుకునేవే! అందుకే భారతీయ కమ్యూనిస్టులు ఆరఎసఎస్ మతతత్వం మీద వేల వ్యాసాలు, వందల పుస్తకాలు అచ్చోసి సెమినార్స్, సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు. చైనా మన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సష్టించి మన ప్రాంతాలను కబళిస్తుంటే.. పాకిస్తాన్‌తో కలిసి ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తూ భారత్‌ను ఇబ్బంది పెడుతుంటే మన దేశ కమ్యూనిస్టులు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోతారు. ప్రపంచ రాజకీయాలపై మాత్రం ఉపన్యాసాలు, విమర్శలు దంచేస్తుంటారు. సిద్ధాంతాల విషయంలో మాటలు, చేతల మధ్య ఇంత గందరగోళం, పక్షపాతంతో వ్యవహరిస్తున్న వీరు సామాన్య ప్రజలకు ఎలా చేరువవుతారు? సామాన్యులు, బలహీనులతోనే ఉంటున్నామని వారు చెప్పడం, భౌతికంగా అలా కనిపించవచ్చు గానీ.. ఆ బలహీనులు, సామాన్యులు వామపక్షవాదులను తమ మనసుల నుంచి ఎప్పుడో దూరం పెట్టేశారని మాత్రం గుర్తించలేకపోతున్నారు.






Comments