ఆ తిరుగుబాటు మంచిదే!
- DV RAMANA

- Dec 6, 2025
- 2 min read

సైనిక సాయం కోసమో.. ఆర్థిక సాయం కోసమో నేడు ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాలాంటి అగ్రదేశాల ముందు మోకరిల్లుతున్నాయి. వారు పెట్టే షరతులన్నింటికీ ‘జీ హుజూర్’ అంటూ తమ దేశాలను వారి సైనిక స్థావరాలుగా, ఖనిజ వనరుల దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. కానీ ఒక చిన్న దేశం ఈ తరహా దేశాలకు కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది. అగ్రదేశాలమంటూ మిడిసిపడేవారికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. సాయం చేస్తామని ముందుకొచ్చిన సౌదీ అరేబియాను తృణీకరించిన ఆ చిన్నదేశం పేరు బుర్కినాఫాసో. ‘మీ దేశంలో మా నిధులతో ఉదారంగా 400 మసీదులు నిర్మిస్తాం’ అంటూ సౌదీ అరేబియా ప్రధాని మహ్మద్ బిన్ సాపోన్ పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినాఫాసో దేశాధ్యక్షుడు ఇబ్రహీం ట్రవొరేకు కొన్ని నెలల క్రితం సందేశం పంపారు. సాధారణంగా పేద దేశాలు ధనిక దేశాలు చేసే ఇటువంటి ప్రతిపాదనలను మహాప్రసాదంగా స్వీకరిస్తాయి. కానీ ట్రవొరే దీనికి భిన్నంగా వ్యవహరించారు. ‘మాకు మసీదులు, ప్రార్థన స్థలాలు అవసరం లేదు. అవి లేకపోయినా ఆకాశం కింద ఎక్కడైనా ప్రార్థనలు చేయగలం. కానీ పాలస్తీనాలో వేలాది నిరాశ్రయులు, ప్రత్యేకించి పిల్లలు ఎటువంటి సహాయం అందకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వారికి సాయం చేయండి.. మాకు ఎవరి ధాతృత్వం అక్కర్లేదు. అయినా మాకు కావలసింది మసీదులు కాదు.. పాఠశాలలు, వైద్యశాలలు, పరిశ్రమలు, రహదారులు, ప్రాజెక్టులు కావాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. తద్వారా తమ దేశ ఆత్మాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడారు. చిన్న దేశమైన బుర్కినాఫాసో సుదీర్ఘకాలం ఫ్రెంచి వలస పాలనలో మగ్గిపోయింది. 1960 ప్రాంతంలో ఫ్రెంచి పాలకుల నుంచి విముక్తి పొందినప్పటికీ పరోక్షంగా ఫ్రెంచి వ్యాపారులు, పెట్టుబడిదారులు బుర్కినాఫాసోను పీల్చిపిప్పి చేసేవారు. అయితే 2022 నుంచి ఆ దేశం నడక, నడత మారాయి. తన చరిత్రను తనే తిరగరాసుకుంది. 36 ఏళ్ల యువకుడైన ఇబ్రహీం ట్రవొరే నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగురవేసింది. సైన్యంలో కెప్టన్‌గా పని చేసిన ట్రవోరే ఆ సైన్యంతోనే తిరుగుబాటు చేసి 2022లో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెంచివారి నుంచి విముక్తి పొందిన తర్వాత బుర్కినాఫాసోకు తిరుగుబాట్లు, అంతర్గత సంక్షోభాలు కొత్త కాదు. వీటి వెనుక ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల పాత్ర కూడా ఉంది. కానీ ట్రవోరే సైన్యం సహాయంతోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ పాలనలో సైన్యం జోక్యానికి అవకాశం ఇవ్వడంలేదు. అధ్యక్షుడిగా దేశాన్ని స్వేచ్ఛాయుతంగా, స్వయం సమృద్ధి సాధించేలా చేసే దిశగా చాలా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. ఇంతకాలం బంగారు నిల్వలను దోచుకుంటూ తమకు దారిద్య్రాన్ని మిగుల్చుతున్న విదేశీ కంపెనీలను దేశం నుంచి వెళ్లగొట్టారు. దేశంలో 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలుండటంతో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దేశాన్ని వ్యవసాయరంగంలో అభివృద్ధి చేసేందుకు 1200 కిలోమీటర్ల నిడివిన పంట కాలువ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైన నిధులు ఇప్పటికే కేటాయించారు. వాస్తవానికి బుర్కినాఫాసోలో ఒక్క నది కూడా లేదు. ఇతరత్రా నీటి వనరులు కూడా పెద్దగా లేవు. ఆ దేశంలో వ్యవసాయరంగం పూర్తిగా వర్షాధారంగానే మనుగడ సాగిస్తోంది. కానీ దేశ జనాభాలో 80 శాతానికిపైగా వ్యవసాయ కుటుంబాలే. పూర్తిగా వాననీటి మీదనే ఆధారపడి అత్తెసరు పంటలతో అర్ధాకలి జీవితాలు సాగిస్తున్నారు. వేలాది ప్రజల దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీం ట్రవొరే ఒక సరికొత్త ఆలోచన చేశారు. దాని ఆధారంగా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా నదులు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వాటిపై ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేస్తారు. వాటిని కాలువలతో అనుసంధానం చేసి నీటిని పంట భూములకు మళ్లిస్తారు. కానీ నదులే లేని బుర్కినాఫాసోలో పర్వతాలపై నుంచి పారి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టి ఒకచోట చేర్చి దాన్నుంచి పంట కాలువలు తవ్వుతున్నారు. ఎండా కాలంలో నీరు ఆవిరై పోకుండా కాలువల వెంబడి విస్తారంగా మొక్కల పెంపకం చేపట్టారు. వర్షాల ద్వారా భూమి మీదికి వచ్చే ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలనేది ట్రవోరే పథకం. ఈ ప్రాజెక్టుకు 500 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని వ్యయాన్ని అంచనా వేశారు. ఈ నిర్మాణాన్ని నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని నిర్ణయించారు. దేశ ప్రజలందరూ ఈ జలయజ్ఞంలో పాల్గొనాలని.. ఇది యుద్ధం కంటే గొప్పదని, దేశ భవిష్యత్తును మార్చగలదని ట్రవోరే పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, రోడ్లు ఆయన ప్రాథమిక లక్ష్యాలుగా ఉన్నాయి. కేవలం బుర్కినాఫాసోనే కాకుండా.. మొత్తం ఆఫ్రికా ఖండాన్ని ఇబ్రహీం ట్రవోరే తన ఆలోచనలతో ప్రభావితం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ట్రవొరే తన దేశ ప్రజలకు ఆరాధ్య నాయకుడయ్యారు. అయితే అదే సమయంలో అమెరికాతో సహా ఐఎంఎఫ్ సభ్య దేశాలన్నీ బుర్కినాఫాసో మీద ఆర్థిక ఆంక్షల యుద్ధం ప్రకటించాయి. బకాయిపడిన 378 మిలియన్ డాలర్ల అప్పును చెల్లించాలని, లేనిపక్షంలో మరిన్ని కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. దానితో అప్రమత్తమైన ట్రవొరేటీ అప్పు ఎప్పుడు ఇచ్చారు? ఎవరెవరు దీన్ని సొంతం చేసుకున్నారు అనే వివరాలు సేకరించి గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, అధికారులను అరెస్టు చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ విధంగా అంతర్జాతీయ బకాయిలను తీర్చేసి.. తమ దేశంలోకి ఐఎంఎఫ్‌తో సహా ఏ విదేశీ సంస్థకూ చోటు లేకుండా స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంలో ఆయన దేశాన్ని ముందుకు నడుపుతున్నారు.










Comments