top of page

ఆందోళనకరంగా అబార్షన్లు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 1, 2025
  • 2 min read

గర్భస్రావం అంటే.. ఒక జీవి ఈ లోకంలోకి రాకుండానే పరలోకానికి వెళ్లిపోవడమే. ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన లోపాలు.. ఇతరత్రా కారణాలతో గర్భస్రావాలు జరుగుతుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులే గర్భస్రావం చేయాల్సి వస్తుంటుంది. బలవంతంగా గర్భస్రావం లేదా గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడం. చేయడం భ్రూణ హత్య కిందకే వస్తుంది. అందుకే ఆరోగ్య కారణాలుంటే తప్ప సాధారణంగా గర్భస్రావం చేయడానికి చట్టాలు అంగీకరించవు. ఆరోగ్య సమస్యల వల్ల కూడా గర్భస్రావం చేయడానికి చట్టాల్లో అనేక కఠిన నిబంధనలు ఉన్నాయి. అందులో భాగంగానే 20 నెలలు దాటిని గర్భిణులకు గర్భస్రావం చేయరాదన్న నిబంధనను ఇటీవల కేంద్రం సవరించి పరిమితి పెంచింది. ఇంకా కారణాల వల్ల దేశంలో గర్భస్రావాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గత ఐదేళ్ల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో గర్భస్రావాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితంతో పోలిస్తే గర్భస్రావాల్లో 367 శాతం పెరుగుదల నమోదైంది. 2020-21లో 2,282 అబార్షన్లు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతుండగా ఆ సంఖ్య 2024-25 నాటికి 10,676కి పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో అబార్షన్లు ఏకంగా 917 శాతం ఎగబాకాయి. 2020-21లో 1,578గా ఉన్న అబార్షన్ల సంఖ్య 2024-25 నాటికి 16,059కి పెరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత భారీస్థాయిలో పెరుగుదల నమోదు కాలేదని కేంద్రం పేర్కొంది. ఇంత భారీగా అబార్షన్లు పెరగడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని వైద్య నిపుణులు, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందుతున్న దశలో ఎదురయ్యే జన్యుపరమైన, క్రోమోజోముల సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు గర్భస్రావాలకు దారితీస్తున్నాయని అంటున్నారు. గర్భనిరోధక పద్ధతులపై అవగాహన లేకపోవడం లేదా పాటించకపోవడం వల్ల కూడా అవాంఛిత అబార్షన్ల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ నియంత్రణపై దంపతులు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, కెరీర్‌కు మహిళలు ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థికంగా స్థిరపడాలనే ఆలోచనలు కూడా అబార్షన్ల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఇవే కాకుండా మరో కీలక సమస్య కూడా అబార్షన్లలో పెరుగుదలకు కారణమవుతోంది. ఆధునిక సమాజంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రేమ పేరుతో క్షణికావేశంలో యువజంటలు లైంగికంగా ఏకమవుతుండటం, అవాంఛిత గర్భాలు కొనితెచ్చుకునే పరిస్థితి కల్పిస్తోంది. అక్రమ సంబంధాల వల్ల కలిగే గర్భాలను తొలగించుకోవడానికి రహస్యంగా వైద్యులను ఆశ్రయిస్తుండటం, ప్రైవేట్‌ వైద్యులు, ఆస్పత్రులు కూడా అదే రీతిలో అబార్షన్లు చేస్తుండటంతో ఇవి రికార్డులకు ఎక్కడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటి కంటే అబార్షన్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్నది వాస్తవం. అయితే గతం కంటే గణాంకాల సేకరణ చాలా మెరుగుపడిరది. అనధికారిక అబార్షన్లను కూడా కట్టడి చేస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నన్సీ చట్టాన్ని 2017లో ప్రభుత్వం సవరించింది. గర్భస్రావానికి గరిష్ట గడువును 20 వారాల నుంచి 24 వారాలకు పెంచడం కూడా అబార్షన్ల సంఖ్య పెరగానికి ఒక కారణంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే.. 25,884 అబార్షన్లతో కేరళ అగ్రస్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లే. అబార్షన్లు మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లైంగిక విద్య, సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదే సమయంలో ప్రజారోగ్యం, కుటుంబ నియంత్రణ పద్ధతులపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీన్ని వైద్యపరమైన అంశంగా కాకుండా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అబార్షన్‌ను ఒక అనైతిక చర్యగా భావిస్తూ.. గోప్యత పాటించడం వల్ల అబార్షన్ల సంఖ్యను తగ్గించడంలో ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page