top of page

ఆంధ్రుల శాపం అమరావతి అందుకు మూలం చంద్రబాబు, జగన్

  • Guest Writer
  • 3 hours ago
  • 4 min read

ప్రత్యామ్నాయ రాజధాని ఏర్పాటు చేయకుండా అప్పటికున్న మహానగరం మొత్తం తెలంగాణాకు అప్పగించేసి కొత్త రాజధాని ఏర్పాటు అంటూ సరిపడిన ఆర్ధిక కేటాయింపు చేయకుండా ఏదో పోలవరాన్ని మీకు వరం కింద ఇచ్చామంటూ సోనియా ఆరోజు ముష్టి విసిరేశారు. 2024లో చంద్రబాబు కూటమి, జగన్ పార్టీ ఎదురెదురు పడ్డాయి. ఆ నేపధ్యంలో రాజధాని ఏర్పాటు అనేది ఒక పెద్ద భవిష్యత్ కార్యక్రమంగా ప్రజలందరికీ కనిపించింది. అప్పటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే తెచ్చాను, సైబరాబాద్‌ను నేనే నిర్మించాను వంటి మాటలతో జనానికి రెండవ పక్క ఆలోచించే అవకాశమే లేకుండా చేసి తానొక నగర నిర్మాతనని జనం ముందు ప్రదర్శించుకోగలిగారు. అది కూడా అంతర్లీనంగా కొంత పని చేసి ఆ పెనుగులాటలో మొత్తానికి విజేతగా నిలిచారు.

గెలిచిన తర్వాత మంగళగిరి పరిసర ప్రాంతాలలో గల 29 గ్రామాల పరిధిలో గల ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ రైతులందరి చేత 33వేల ఎకరాలను రాజధాని నిమిత్తం సేకరించారు. తమ ఒక్కో ఎకరం ఆ రోజుల్లో 15 నుంచి 20 లక్షల రూపాయలు బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతుంటే చంద్రబాబు ఇచ్చిన ఆఫరు వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వ్యాపార స్థలం మొత్తంగా ఎకరానికి 3 లేదా 4 కోట్లు ధర వస్తుందనే ఆశతో రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ‘త్యాగం’ చేశామంటూ అక్కడ రైతులు ప్రభుత్వానికి తమ భూములిచ్చేసి ఎవరు ఎంతెంత ఇచ్చారో లెక్కల్లో రాయించుకున్నారు. ఈ ప్రతిపాదన శాసనసభలో పెట్టినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ‘పద్మూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చిచ్చు పెట్టడం తనకిష్టం లేదంటూ’ రాజధాని ఎక్కడైనా పెట్టండి, కాని ఆ పెట్టె చోట కనీసం 30వేల ఎకరాలు ఉండేలా చూడండంటూ విజయవాడలో, విజయవాడలో రాజధాని పెట్టడానికి తను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు శాసనసభలో చెప్పారు. ప్రభుత్వ భూమి ఖాళీగా 30వేల ఎకరాలు ఒకే చోట ఎక్కడా ఉండదు, లేదు అనే ప్రాధమిక సత్యం ఆయనకు తెలియదని మనం అనుకోనక్కర లేదు. మొత్తానికి విజయవాడ సమీపంలో రాజధాని నిర్మాణానికి ఆయన జెండా ఊపేశారు.

జాతీయ ప్రభుత్వం తలచుకుంటేనే సాధ్యం కాని నగర నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అరకొర నిధులతో ఎలా సాధ్యమవుతుంది అనేది ఎవరూ ఆలోచించలేదు. సాధారణంగా ఇక్కడ జరిగే లేఔట్‌లలో ఎకరానికి 70 నుంచి 80 లక్షలు ఖర్చవుతుంది ప్రస్తుతానికి. చంద్రబాబు లక్ష్యించింది ప్రపంచ స్థాయి నగరం కాబట్టి భారతీయ ఇంజనీర్లు కట్టే మురికివాడలు కాకుండా సింగపూర్ వాళ్లు కట్టేలా చర్యలు తీసుకుంటే ఆయన ప్రకారమే ఒక ఎకరం అభివృద్ధి పరచడానికి అయ్యే ఖర్చు అక్షరాల రెండు కోట్లు. రైతులు త్యాగం చేసింది అప్పటికున్న ప్రభుత్వ భూమి కలిపి 50వేల ఎకరాలు అయితే కావలసిన సొమ్ము లక్ష కోట్లు. 2014-19 వరకు ఆయన ఏవో కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేశారు బడ్జెట్ భారీగా పెట్టినప్పటికీ కూడా. ఆ ఐదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోయింది.

ఈ లోపున జగన్మోహన్ రెడ్డి తనకున్న అనేక భారీ నివాస సముదాయాలకు మరొకటి జత చేర్చి తాడేపల్లిలో కొద్దిపాటి ఎకరాల విస్తీర్ణంలో ఒక గొప్ప నగరు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. ఆ సందర్భంగా రోజా టీవీ మైకుల ముందు నిలబడి సగర్వంగా రాజధాని ప్రాంతంలో తమ నాయకుడు ఇల్లు కట్టుకొని గహ ప్రవేశం చేస్తే చంద్రబాబునాయుడు గన్నవరం, హైదరాబాదు షటిల్ సర్వీస్ ఎయిర్ బస్సు నడుపుకుంటున్నారని గేలి చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చంద్రబాబును ఉద్దేశించి ‘నువ్విక రాజధానిని కదతావనే నమ్మకం ఈ రైతులలో పూర్తిగా పోయింది. నీవల్ల కాదని అందరూ అనుకుంటున్నారు’ అంటూ చురకలు వేశారు. వీటన్నింటి నేపధ్యంలో 2019లో జగన్ మోహన్ రెడ్డి స్కోరు 151.

ప్రభుత్వ పగ్గాలు చేతికొచ్చాక జగన్ ఆలోచన తీరు యూ`టర్న్‌కి వచ్చింది. లక్ష కోట్ల రూపాయలు రాజధాని మీద వెచ్చించడం సాధ్యం కాదంటూ కొత్త వాదన తెచ్చి, విచిత్రంగా రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అంటూ మూడు రాజధానులు వస్తాయేమో, అలా జరగోచ్చేమో అని వసంత రుతువు ఆగమన సమయంలో కోయిల లెక్క పల్లవిని అందుకున్నారు. అది అందుకొని ఆయన అంతేవాసులు తెగ రెచ్చిపోయారు. అప్పటికి నిర్మాణంలో ఉన్న భవనాల పనులు కోసం బీహార్, బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులంతా ఆ వెంటనే విజయవాడ రైల్వే స్టేషనుకొచ్చి దొరికిన బండిని తలో భోగి ఎక్కేసి పారిపోయారు.

మనకున్న జిల్లాలెన్నీ? మన రాష్ట్ర విస్తీర్ణం ఎంత?

వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూల్‌లో న్యాయ రాజధాని పెడితే కోర్టు వ్యవహారాలు చూసే అధికారులు వైజాగ్ నుంచి ఫైళ్లు పట్టుకొని కర్నూల్ ఎలా పోతారనే ఆలోచన లేకుండా అందరిది ఒకటే పాట. రైతులంతా కోర్టుకు పోవడం, అక్కడ వాతావరణం విషమించడంతో జగన్ వెనకడుగు వేసి ఆ బిల్లును ఉపసంహరించుకొని ఆబాసుపాలు కావడం మనం చూశాం. ఆ తర్వాత అనేకనేక కారణాలతో జగన్ 151 అనే భూరి సంఖ్య నుంచి 11 అనే అల్ప సంఖ్యకు పడిపోయారు.

దరిమిలా చంద్రబాబు నాకు ఎదురే లేదు అన్నట్టుగా రాజధాని పనులని, అవేవో టవర్లు, వగైరా వగైరా నిర్మాణాలంటూ దూసుకుపోతున్నారు. పునాదులు తీస్తుంటే వరదలొచ్చి ముంచేస్తుంటే వరద నీటిని మళ్లించడానికి ఒక రిజర్వాయిర్ నిర్మిస్తారట. నీటిని ఎత్తిపోయడానికి కోట్ల వ్యయం. పెరిగిన పిచ్చి మొక్కల్ని పెకలించి, నరికించడానికి మరికొన్ని కోట్లు. వీటికి తోడు ఉన్న 50వేల ఎకరాలు సరిపోదంటూ మరొక 50వేల ఎకరాలు కావాలంటూ సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి దఫాలో మాదిరిగా కాకుండా ఈసారి రైతుల నుంచి తిరుగుబాటు ఎదురయింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. 200 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ, 1500 ఎకరాలలో రైల్వేస్టేషన్, 5వేల ఎకరాలలో విమానాశ్రయం కడతామంటూ అలా ముందుకు పోతున్నారు. అసలక్కడికి వెళ్లి కాపురముండేది ఎవరయ్యా అంటూ వడ్డే శోభనాదీశ్వరరావు వంటి వయసు మళ్లిన రైతు ప్రేమికులు ఆక్రోషిస్తుంటే అలాంటి వాళ్లను ప్రభుత్వ పెద్దలు ఒక పక్క, తమ్ముళ్లు మరోపక్క గేలి చేసి నోరు మూయించేస్తున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ అనే బూచిని తట్టుకొని పెట్టుబడిదారులకు భరోసా కలిపించే ఉద్దేశంతో అమరావతి రాజధాని అనే దానిని పార్లమెంటులో చట్టం చేయించేసుకున్నారు. ఈ లోపున జగన్ ఒక ప్రెస్‌మీట్ పెట్టి మావిగన్ అంటూ ఒక గొప్ప పేరును పరిచయం చేశారు. మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరు కారిడార్‌ను అభివృద్ధి పరుచుకుంటే ఇప్పుడు పెడతానంటున్న ఖర్చులో 10వ వంతు ఖర్చు పెడితే పని పూర్తయిపోతుందంటూ చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పిన దాంట్లో జనం వాస్తవం ఆలోచించారో లేదో తెలియదు గాని అది చెప్పి జగన్ ఉత్త కామెడీ పీసు అయ్యారని జగన్‌ను ఎప్పుడూ వెనకేసుకొచ్చే కేఎస్ ప్రసాద్ లాంటి టీవీ చర్చల్లో పాల్గొనే వాళ్లంటున్నారు. ఇంతకూ జగన్ చేసింది రాజధాని కోసం కాపిటల్ కారిడార్ ఏర్పాటు. రాజధాని కోసం నగరమే అక్కరలేదు అనుకున్నప్పుడు కాపిటల్ కారిడార్ మట్టుకు ఎందుకట?

ఇవన్నీ పక్కన పెడితే 29 గ్రామాల ప్రజలు 29వేల మంది దాదాపు 36వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చేశారు. వాళ్ల ప్రయోజనం మాటేమిటి? వాళ్లకు రాష్ట్ర ప్రజల అందరి సొమ్ము పెడుతున్నారని అనేటప్పుడు వాళ్ల భూములు తాలూకు కనీస ప్రయోజనం వాళ్లకు మిగలాలి కదా. ఆ కోణం కూడా ఆలోచించాలి కదా. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం లక్ష ఎకరాల రాజధానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో అందుకు కేటాయింపు జరిగే మొత్తంతో పోల్చినప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందో ఊహకు అందదు. రాష్ట్రాన్ని ఆనాడు చీల్చి తను చనిపోయిన కాంగ్రెస్ అప్పట్లో ఆ పని కోసం అంతే కొత్త రాజధాని నిర్మాణానికి నిధులేమి కేటాయించలేదు. ఢిల్లీని తలదన్నే నగరాన్ని మీకు నిర్మించి ఇస్తానన్నా మోడీ ఇచ్చిన మట్టీ, నీళ్లు మన కళ్లముందే ఉన్నాయి. రెండుసార్లయితే శంకుస్థాపన చేశారు.. పార్లమెంట్‌లో చట్టమైతే చేశారు.. కానీ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికీ తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు.

ఇంత గందరగోళంలో రాజధాని మీద తన విధానాన్ని మాటమాటకి మార్చి జగన్ నవ్వులు పాలవ్వడం పక్కన పెడితే రాజధాని నిర్మాణం అనేది ఎప్పటికీ అందని ఎండమావిలా అటు రాజధాని రైతులకు, ఇటు రాష్ట్ర ప్రజలకు మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది నిజంగా ఘోరం. అంతటి భూరి పథకాన్ని తలకెత్తుకోవడమే తలకు రోకలి చుట్టుకున్నట్టు. ఈ పద్మవ్యూహం నుంచి ప్రజలు బయటపడే మార్గం మట్టుకు మృగ్యం. ఆంధ్రుడు దురదృష్టవంతుడు.

- పెపకాయల రామకృష్ణ ఫేస్‌బుక్‌వాల్ నుంచి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page