ఆ పనులు చేస్తే.. మీ ఖర్మ!
- NVS PRASAD

- Nov 18
- 3 min read
‘ఉపాధి’ పనులపై హెచ్చరికతో కూడిన సందేశమిస్తున్న డుమా
జిల్లా బడ్జెట్ రూ.241 కోట్లు.. ఆమోదాలు మాత్రం 400 శాతం అధికం
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి
ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణం
కాదని పనులు చేపడితే నాలుగేళ్లు బిల్లుల కోసం ఆగాల్సిందే
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లు సొంతంగా బ్రేకులు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి ఎడతెగకుండా ఉపాధి నిధులతో పనులు చేపట్టడానికి జిల్లావ్యాప్తంగా పునాదిరాళ్లు పడ్డాయి. అయితే ఇవన్నీ బిల్లులు కావాలంటే మరో నాలుగేళ్లు వేచిచూడాలని, ఈలోగా తెచ్చిన సొమ్ముకు వడ్డీలు పోను లాభం రాదు సరికదా.. పొరపాటున ప్రభుత్వం మారితే ఆ బిల్లుల కోసం నానా తిప్పలు పడాలని భావిస్తున్న కాంట్రాక్టర్లు ఈ పనులు చేయలేమంటూ స్వతహాగా తప్పుకుంటున్నారు.

రెండు రోజుల క్రితం ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో ప్రారంభమైన పనులను నిలిపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, కాల్వలు, బ్రిడ్జిలు.. ఇలా అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధిహామీ నిధులతోనే శంకుస్థాపనలు చేశారు. అయితే దీనికీ ఓ లెక్కుంది. ఏడాదికి మన జిల్లాకు రూ.241 కోట్లు విలువైన పనులు మాత్రమే చేయాల్సి ఉంది. 2025`26 ఆర్థిక సంవత్సరానికి ఈ అంకె దాటిపోగా, శాంక్షన్లు వెయ్యి కోట్లకు చేరిపోయింది. ఏడాదికి రూ.241 కోట్లు విలువైన పనులకే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అదీ ఖజానా బలంగా ఉంటే అనేక విడతలుగా విడుదల చేస్తుంది. అంటే.. ఏడాదిలో రావాల్సిన బిల్లు పరిస్థితి అడ్డం తిరిగితే రెండేళ్లు పైబడొచ్చు. అటువంటిది జిల్లాలో 400 శాతం అధిక పనులకు అనుమతులు ఇచ్చేశారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉండటం, వారి దృష్టికి వచ్చిన పనులకు సంబంధించి ఎన్‌ఆర్‌ఈజీఎస్ కోసం సిఫార్సు చేయడం, అత్యవసరంగా భావించి వాటికి శాంక్షన్లు ఇవ్వడంతో ఏడాదికి రూ.241 కోట్ల పనులు కాస్త ఈ ఆర్థిక సంవత్సరానికే వెయ్యి కోట్లకు చేరిపోయింది. రాష్ట్రంలో ఈ విధంగా నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఏడాది బడ్జెట్ రిలీజ్ కావడానికే ఎక్కువ సమయం పడుతుందంటే.. ఇప్పుడు నాలుగేళ్ల బడ్జెట్ ఒకే ఏడాదిలో రిలీజ్ చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే.. ఇవి లేబర్ కాంపొనెంట్‌తో కూడి చేపట్టాల్సిన పనులు. ఒకవైపు కూలీలకు ఉపాధి 60 శాతం చూపిస్తూ, 40 శాతం మెటీరియల్ నిధులతో ఈ పనులు చేపట్టాలి. కానీ 60 శాతం పనులు కూలీలతో చేయించడానికి సరిపడా ఉపాధి దినాలు ఉండవు. దీంతో పనులు చేపట్టినా బిల్లులు ఈ`ఫైలింగ్ చేసినప్పుడు ఈ రెండిరటికీ సరిపోలక కొర్రీ పడుతుందని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. దీంతో ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న పనులన్నింటి నుంచీ తప్పుకోవాలని రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిడితో పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు రాలేదని గగ్గోలు పెడితే తమ పూచీ లేదని అమరావతి వర్గాలు కూడా చెబుతున్నాయి. వాస్తవానికి మన జిల్లాలో ఉపాధి పనుల కింద రూ.241 కోట్లతో చేపట్టే పనుల కోటా ఎప్పుడో అయిపోయింది. మంత్రులు చెబితే ఉపాధి నిధులతో పనులకు మంజూరు ఇస్తున్నారని, తమ నియోజకవర్గాల్లో ఎందుకివ్వరంటూ కొందరు ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో వారికి కూడా ఉపాధి కాంపొనెంట్ నిధులతో పనులు చేపట్టడానికి అనుమతులిచ్చారు. వాస్తవానికి ఇవన్నీ చేపడితే జిల్లాలో వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంది. దీనివల్ల నియోజకవర్గాల్లో అనేక మౌలిక వసతులు ఏర్పడే మాట వాస్తవం. కాకపోతే సకాలంలో బిల్లులు మాత్రం రావు. కనీసం నాలుగేళ్లు ఆగితే గాని వీటికి క్లియరెన్స్ ఉండదు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్లే రోడ్డును వెడల్పు చేస్తే, ఆ బిల్లుల కోసం ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు అనేక పర్యాయాలు అటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు అమరావతిలో ఫైనాన్స్ విభాగం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. వైకాపా ప్రభుత్వంలో చేసిన వైకాపా ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించినా, ఆ తర్వాత కూటమి వచ్చిన తర్వాత చెల్లింపులు లేక పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఇవి కాకుండా అనేక స్కీముల కింద చేపట్టిన పనులకు అప్పుడప్పుడు బిల్లులు పడుతున్నాయి. ఉపాధిహామీ పనులకు సంబంధించి ప్రతీ వారం బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్తాయని చెప్పిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆ విధంగా నాలుగు వారాలు మాత్రమే జరిగేటట్టు చూడగలిగారు. ఆ తర్వాత ఆయన తరం కాలేదు. పవన్‌కల్యాణ్ వేగం చూసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పనులు చేపడితే బిల్లులకు డోకా ఉండదని భావించిన కాంట్రాక్టర్లు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ పనులకు ముందుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పనులు ప్రారంభమైనట్లు కనిపించాయి. కానీ సంవత్సరానికి కేటాయించిన రూ.241 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేసినందున స్థానికంగా పనులు చేపట్టాల్సిన అవసరమే ఉంటే సంబంధిత కలెక్టర్లను వ్యక్తిగతంగా కలిసి ఆ మేరకు ఏదో ఒక హామీ తీసుకుని మాత్రమే పనులు పూర్తిచేయాలని యూనియన్ చెబుతుంది. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో బడ్జెట్ దాటి మరీ అనుమతులు ఇచ్చిన విషయం సంబంధిత కలెక్టర్లకు తెలుసు. అయితే స్వయంగా ఆ జిల్లా నేతలే పనుల కోసం పట్టుపడుతున్నందున బిల్లులు కూడా వారే ఏదో ఒక రూపంలో తెచ్చుకుంటారన్న ధీమాతో కలెక్టర్లు బడ్జెట్‌కు మించి అనుమతులు ఇచ్చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మొదలైన పనుల నుంచి వెనక్కు రావాలని అసోసియేషన్ చెబుతుంది. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితమే ఈ నాలుగు జిల్లాల్లో డ్వామా పీడీలు అన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల అధిపతులకు ఇదే సందేశంతో వాట్సాప్ చేసింది. అంటే ఇకనుంచి ఎవరు పనులు చేసినా బిల్లుల కోసం తమపై ఒత్తిడి తేవద్దని దీనర్థం.










Comments