top of page

ఆ బూటు.. సనాతన పతనానికి ప్రతీక!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 7, 2025
  • 2 min read

ఎవరన్నారు.. మన ప్రజాస్వామ్యం పతనమవుతోందని! ఎవరన్నారు.. మన స్వేచ్ఛకు సంకెళ్లు పడుతున్నాయనీ!! అదే నిజమైతే దేశ సర్వోన్నత న్యాయస్థానం అధిపతి అయిన చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాపైనే చెప్పు విసరగలిగేవారా? విసిరిన తర్వాత బాధ్యుడిని కొట్టడమో, కాల్చి చంపడమో చేయకుండా మర్యాదగా అదుపులోకి తీసుకుని తరలించడం జరిగేదా?? చీఫ్‌ జస్టిస్‌పైనే బూటు విసిరిన అడ్వకేట్‌ రాకేష్‌ కిషోర్‌ను భారత భవిష్యత్తు ముఖచిత్రంగా.. ఈ దేశపు మానసిక స్థితికి అద్దంగా పరిగణించవచ్చు. హత్రాస్‌ హంతకులకు కూడా దండలు వేసి దాండియా ఆడిన దయగల దేశం మనది. అలాగే అత్యున్నతమైన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పదవి కూడా ఇప్పుడు హాయిగా చెప్పు దెబ్బలు తినగలదు. అదే అమిత్‌ షా మీద చిన్న మల్లెపూవు విసిరినా క్షణాల్లో నరకానికి చేర్చగలదు చట్టం. చెప్పులు కుట్టిన చేతులు చరిత్రను తిరగ రాస్తాం అనడమే మనకు తెలుసు. అదే చెప్పు అవతలి వాడి ఆగ్రహ ప్రకటనకు, వెలివేతకు, అవమానాలకు ప్రతీకగా మారింది. ఆ చెప్పు విసిరినవాడు రేపు న్యాయ మంత్రి కాగలడు.. అదే అర్హతతో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా కూడా అవ్వగలడు. ఒకవిధంగా ఇప్పుడు నడుస్తున్నది పరమ చెప్పుల చరిత్ర. సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన చెప్పు ఘటనే దీనికి తార్కాణం. కోర్టు గది అంటే చట్టం మాట్లాడే ప్రదేశం. అక్కడ భావోద్వేగం కాదు.. బుద్ధి కుశలత మాట్లాడాలి, తీర్పులు చెప్పాలి. కానీ వాటిని బయటకు నెట్టి కోర్టు హాలు లోపలికి అసహనం జొరబడిరదని తాజా ఉదంతంతో అర్థమవుతోంది. 2008లో అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌పై ఒక ఇరాక్‌ జర్నలిస్టు చెప్పు విసరాడు. ఆ చెప్పు ప్రపంచమంతా రాజకీయ నిరసనకు చిహ్నంగా మారింది. తర్వాత మన దేశంలో కూడా రాజకీయ నాయకులు, మంత్రులపైకి చెప్పులు ఎగిరాయి. అవి ఆగ్రహ వ్యక్తీకరణలుగా గుర్తింపు పొందాయి. కానీ ఇప్పుడు జరిగింది ఆ ఉద్దేశంతో కాదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలను సహించలేని అసహనం. ఈ తరహా నిరసన, ఆగ్రహం అరుదైనది.. అవాంఛనీయమైనది. అంతటి ఎమర్జెన్సీ కాలంలో కూడా సుప్రీంకోర్టు గౌరవం దెబ్బతినలేదు. జస్టిస్‌ ఖన్నా తన వృత్తి ప్రమాదంలో పడినా, తన విలువలను వదల్లేదు. కానీ నేడు చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌ మీదకు లేచిన బూటు ‘ధర్మ సంస్కృతి’ పతనానికి ప్రతీక. సనాతనం పేరుతో జరుగుతున్న సంస్కృతి హింసకు ప్రతీక. సీజేఐపై బూటు విసిరిన నిందితుడు ‘సనాతన్‌ కా అప్మాన్‌ కో నహీ సహేంగే.. అంటే సనాతనాన్ని కించపరిస్తే సహించం’ అని హెచ్చరించాడు. సనాతన ధర్మం విలువలు నేర్పుతుందంటారు. మన సాంస్కృతిక, ధార్మిక గొప్పతనాన్ని చాటి చెబుతుందంటారు. కానీ తాజా ఘటనను చూస్తే హింసను, అసహనాన్ని నేర్పుతున్నట్లుంది. మానవత్వం కంటే సనాతనం గొప్పదైపోయిందా అన్న బాధ కలుగుతుంది. మతం, ధర్మం, సంస్కృతి.. ఇవే ఇప్పుడు ఆయుధాలయ్యాయి. సనాతనం అంటే నిత్యమైనది. ఎవరైనా చెప్పు విసిరి రక్షించాల్సినంత బలహీనమైనది కాదు. కానీ నేటి సనాతన రక్షకులు సహనం అనే మూలధర్మాన్ని మరచిపోతున్నారు. వారు కాపాడుతున్నది సనాతనం కాదు.. తమ కోపం, తమ భక్తి, తమ రాజకీయ అంధత్వం. తనపై సనాతన అసహనం దాడికి ప్రయత్నించినా చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా బి.ఆర్‌. గవాయ్‌ ఏమాత్రం చలించకుండా ప్రజాస్వామ్య ధర్మం నిలబెట్టే ప్రయత్నం చేయడం సర్వోన్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని, స్థితప్రజ్ఞతను నిలబెట్టింది. ‘లాయర్లు.. మీ వాదనలు వినిపించండి.. ఇవి నన్ను ప్రభావితం చేయవు. లాయర్లు శాంతిని నేర్చుకోవాలి’.. అని ప్రకటించిన సీజేఐ.. ఆ తర్వాత కూడా వాదనలు విన్నారు. ఈ ఒక్క వాక్యం నేటి రాజకీయ భాషపై ఒక తీర్పు లాంటిది. మన కాలంలో కోపం మాట్లాడుతోంది.. చట్టం మౌనంగా వహిస్తోంది. కానీ తాజా ఘటన ‘కోపం అనేది చట్టం ముందు సంయమనంతో ఉండాలి’ అని చెబుతున్నట్లుంది. చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌ ఎన్నో కష్టాలు పడి దళిత కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన న్యాయమూర్తి. అతను దేశ అత్యున్నత స్థానం చేరుకోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన సమానత్వానికి ఉదాహరణ. రాజ్యాంగం ఇచ్చిన అవకాశం. అటువంటి రాజ్యాంగ సంస్థ అధిపతిపై సనాతనం పేరుతో దాడికి పాల్పడటం.. వర్గం, మతం, అసహనం కలగలిసిన ప్రమాదకర ధోరణికి సంకేతం. పౌరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. అదే కోర్టు గౌరవమే సమాజ గౌరవం. దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సుప్రీంకోర్టు కేవలం న్యాయస్థానం కాదు. అది భారతదేశ నైతికతకు కేంద్రస్థానం. దాని అధిపతిపై బూటు విసిరే ప్రయత్నం చేయడమంటే.. అది వ్యక్తిపై దాడి చేసినట్లు కాదు. గౌరవప్రదమైన, పవిత్రమైన సుప్రీంకోర్టు అధిపతి పదవిపైకి విసిరే ప్రయత్నంగానే పరిగణించాల్సి ఉంటుంది. అది మన భరత జాతికే తీరని అవమానం. ఇలాంటి సంఘటనలను చిన్నవి భావించి వదిలేయకూడదు. ఇవి సమాజంలో పెరుగుతున్న అవిశ్వాసం, అసహనం, అవగాహన లేని, విచక్షణ కోల్పోయిన ఆవేశానికి ఉదాహరణలు. మనం విసిరింది చెప్పు కాదు.. చట్టాన్ని నిరాకరించే మనసు. ఇటువంటి దుందుడుకు చేష్టల వల్ల ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. హింస, అసహనంతో దేన్నీ సాధించలేమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పైగా వాటి వల్ల ఉన్న గౌరవం పోతుంది. న్యాయస్థానాలే కాదు.. ఇతర రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవంతో వ్యవహరించడమంటే మనలో మనం ఇంకా మనుషులమని నిరూపణ. చెప్పు విసరడం అంటే మన అభిప్రాయాలను కాపాడుకోవడం కాదు.. మన చేతులతో మనమే అత్యున్నత వ్యవస్థలను పతనావస్థకు చేర్చడం!

1 Comment


Ranku Mogudu
Ranku Mogudu
Oct 08, 2025

అత్యున్నత న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు సమర్ధనీయం కానప్పుడు అసహనం పెరుగుతుంది. దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే న్యాయ వ్యవస్థలే అసహనానికి గురైతే సామాన్యులు అసహనికి గురి కాకుండా ఉంటారా? సనాతన ధర్మంలో సహనం లేకపోతే సనాతన ధర్మం సహనం నేర్పించక పోతే ఈ దేశంలో అన్య మతస్తులు ఎలా ఉండేవారు? కొంచెం విజ్ఞతతో సంపాదకీయాలు వ్రాయండి.

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page