ఆ బిల్లుతో ‘చీల్చడం.. కూల్చడం’.. రాజ్యాంగబద్ధం!
- DV RAMANA

- Aug 25, 2025
- 2 min read
130వ రాజ్యాంగ సవరణతో తీవ్ర అనర్థాలు
ప్రాంతీయ పార్టీల మనుగడకే ముప్పు
వాటిని పడగొట్టేందుకే ఎన్డీయే సర్కారు పన్నాగం
రాహుల్ నేతృత్వంలో సామూహికంగా అడ్డుకోవాలి
కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పార్లమెంటులో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రాంతీయ పార్టీల పాలిట మరణ శాసనమని, అది గనుక ఆమోదం పొందితే ఆ పార్టీలను పాతరేసినట్లేనని కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అభివర్ణించారు. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపినప్పటికీ.. దానికి ఏదోవిధంగా ఆమోదముద్ర వేయించి, ముఖ్యమంత్రులను పడగొట్టే విశృంఖల అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు కుట్రపన్నుతోందని ఆమె విమర్శించారు. సీఎం, పీఎం వంటి కీలక పదవుల్లో నేరచరితులు ఉండకూడదన్న ఉద్దేశంతో రాజ్యాంగా సవరణ బిల్లును తీసుకొచ్చామని, ఇది రాజకీయాలను శుద్ధి చేసే బిల్లు అని బీజేపీ అభివర్ణించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేసులు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులకు మించి జైల్లో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తమ పదవులను నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా వారిని తప్పించాలని చెబుతున్న ఈ సవరణ సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని కృపారాణి స్పష్టం చేశారు. అలాగే దేశపౌరులకు రాజ్యాంగం కల్పించే న్యాయం పొందే హక్కును ఇది హరిస్తుందన్నారు. కేసుల విచారణ పూర్తి అయ్యి, నేరాలు నిరూపతమయ్యే వరకు దోషులు కారని, శిక్షకు పాత్రులు కారని మన చట్టాలు, న్యాయస్థానాలు ఘోషిస్తున్నాయి. అలాగే వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్యాలేదు గానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని న్యాయసూత్రాలు చెబుతున్నాయంటూ.. మరి సీఎం పదవుల్లో ఉండి కేసుల్లో 30 రోజులు జైలుకెళ్లిన వారిని విచారణ పూర్తికాకముందే.. దోషులుగా తేలకముందే పదవులు లాక్కోవడం ద్వారా శిక్షించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఇకవేళ సదరు కేసుల్లో వారు నిర్దోషులుగా తేలి, బయటకొస్తే.. అంతకుముందే వారిని పదవుల నుంచి తప్పించిన తప్పిదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని కృపారాణి నిలదీశారు.
పార్టీలకు ముప్పు
ఈ సవరణ బిల్లు వల్ల ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రమాదమని కృపారాణి అభిప్రాయపడ్డారు. తమకు నచ్చని సీఎంలను కూల్చడానికి, వారి పార్టీలను చీల్చడానికి.. చీలక ముక్కలతో కలసి ఆయా రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను కూర్చోబెట్టడానికి కేంద్రం రాజ్యాంగబద్ధంగా పన్నుతున్న కుట్రే.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అని ఆమె వివరించారు. ఇప్పటికే దేశంలోని గోవా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ , మహారాష్ట్ర తదితర సుమారు పది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చీల్చి, ఆ ప్రభుత్వాలను కూల్చి.. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీకి, మోదీ సర్కారుకు ఉందన్నారు. ఇప్పుడు దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా సాధికారికం చేసేందుకే సవరణ బిల్లు ఎత్తుగడ వేసిందని విమర్శించారు. ఇది అమల్లోకి వస్తే ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రమాదంలో పడుతుందని, వాటిని పాతర వేస్తారని హెచ్చరించారు. ఎన్డీయే కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం దీనికి మినహాయింపు కాదని ఆమె అన్నారు. అందువల్ల దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ అప్రమత్తమై జేపీసీలో ఈ సవరణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగే సవరణ బిల్లు వ్యతిరేక పోరాటం మూకుమ్మడిగా పాల్గొనాలని కృపారాణి కోరారు.










Comments