ఆ మూడు తిరుగుబాట్లు.. కావాలి గుణపాఠాలు
- DV RAMANA

- Sep 13, 2025
- 2 min read

ఏప్రిల్ 2022.. శ్రీలంకలో విరుచుకుపడిన ప్రజాసమూహం. సాక్షాత్తు ఆ దేశాధ్యక్షుడి ఇంటి పైన.. పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రులు, అధికారుల ఇళ్లు, ఆస్తులు, కార్యాలయాలపై ప్రజల మూకుమ్మడి దాడులు. ప్రజాగ్రహానికి వెరచి చివరకు రాజీనామా చేసి కుటుంబంతో సహా దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు. మరో ఘటన చూస్తే.. ఆగస్టు 2024.. మనకు మరోవైపు ఉన్న బంగ్లాదేశ్‌లో ఎగసిన నిరసన జ్వాలలు. ఆ దేశ ప్రధానమంత్రి ఇంటి మీద, అధికారంలో ఉన్న మంత్రులు, అధికారుల మీద సామూహిక దాడులకు తెగబడిన ఆందోళనకారులు. పార్లమెంటు, ప్రధానమంత్రి నివాసం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తుల నిరసనకారుల ఆగ్రహజ్వాలల్లో నామరూపాలు లేకుండా పోయాయి. నిరసనలకు తలవంచి చివరకు ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి రాత్రికిరాత్రే దేశం వదిలి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. తాజాగా ఈ నెలలోనే హిమాలయ సానువుల్లో ఉన్న మరో పొరుగు దేశం నేపాల్ ఆగ్రహజ్వాలల్లో చిక్కుకుంది. జెన్‌జెడ్‌గా పిలిచే యువతరం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై తిరస్కారగళం వినిపిస్తూ ప్రధానమంత్రితో సహా ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులపై ప్రజాసమూహం దాడులు చేసింది. పార్లమెంటు భవనం సహా, అనేక ప్రభుత్వ ఆస్తులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. చివరికి ఒత్తిడి తట్టుకోలేక ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక చోట ధరల పెరుగుదల, మరోచోట అవినీతి విశృంఖలత, ఇంకోచోట సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపే నిర్ణయాలు.. మన చుట్టూ ఉన్న దేశాల్లో అశాంతి, అలజడి, తిరుగుబాట్లకు కారణమయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం ట్రిగ్గర్ చేసిన పైకి కనిపిస్తున్న కారణాలు మాత్రమే. పొయ్యిపై గిన్నెలో పెట్టిన పాలు మరిగి మరిగి.. చివరికి ఒక్కసారి ఎలా పొంగుతూ బయటకొచ్చేస్తాయో.. అలాగే ఆయా దేశాల్లో పాలకవర్గాలు, వాటి నిర్ణయాలు, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టడం, బతుకులు దుర్భరం కావడం వంటి అనేక సమస్యలు చాలా కాలంగా తిష్ట వేసిన సమస్యలు ప్రభుత్వాలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసి.. ఆగ్రహాన్ని రగిలించడమే ఆ మూడు దేశాల్లో చెలరేగిన అశాంతికి, తిరుగుబాట్లకు కారణమన్నది సుస్పష్టం. వాటి ఫలితంగానే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు పతనమయ్యాయి. అంతే తప్ప ఈ తిరుగుబాట్లలో ప్రతిపక్షం పాత్ర లేశమాత్రమైన లేదు.. రాజకీయం అసలే లేదు.. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయామన్న ప్రజల ఒకే ఒక్క ఆవేదన తప్ప. ప్రజలను తక్కువ అంచనా వేసి పాలకులు మీడియాను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే ప్రతి సంస్థను, వ్యక్తినీ తొక్కేశామని ఇన్నాళ్లూ అక్కడి పాలకులు సంబరపడ్డారు. కానీ ప్రజలు తలచుకుంటే ఎంతటి నియంతలనైనా పడగొట్టడానికి ఎంతో సమయం పట్టదు. సమాజంలో 90 శాతం సామాన్యులు బతకడానికి కూడా ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఒక పక్క.. మిగతా పది శాతం పెద్దలు మొత్తం అన్ని రంగాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజల, ప్రభుత్వ ఆస్తులను కబళించి మరింత సంపన్నులు అవుతుంటే పొయ్యిపై పెట్టిన గిన్నెలోని పాల మాదిరిగా నిశ్శబ్దంగా కుతకుతలాడిపోయిన ప్రజలు ఒక్కసారి సలసల మరుగుతున్న పొంగులా విరుచుకుపడ్డారు. ఆ మూడు దేశాలే కాదు.. మనదేశంలోనూ ఇంచుమించు అవే పరిస్థితులు ఉన్నాయి. సుమారు పదిహేనేళ్ల క్రితంనాటి సర్వే ప్రకారం మన దేశంలో కేవలం ఏడు శాతం ప్రజలే 47 శాతం భూమిని అనుభవిస్తున్నారు. ఈ పదిహేనేళ్లలో దీనిలో మార్పు తీసుకు రావటానికి మన ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకున్నాయా? అంటే తప్పకుండా తీసుకున్నాయనే చెప్పవచ్చు. ఆ ఏడు శాతం జనాభా చేతిలోకే ఇప్పుడు 50 నుంచి 60 శాతం భూమి చేరి ఉంటుందనడంలో సందేహం లేదు. అదే మన పాలకులు తెచ్చిన మార్పు! దశాబ్దాలుగా ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్ల నుంచి పరిశ్రమల వరకు.. పరిశ్రమల నుంచి వ్యవస్థల వరకు.. ఒక్క కలం పోటుతో ఆ ఏడు శాతం ప్రజలకు కట్టబెడుతున్న కుటిల రాజనీతి ఓ పక్క.. భూమి, ఉపాధి లేక రోజువారీ అవసరాల కోసమే సామాన్యులు అను నిత్యం చేస్తున్న పోరాటం మరోపక్క! సామాన్యుల్లో ఐకమత్యం లేకుండా చేశాం.. ప్రశ్నించేతత్వాన్ని చంపేశాం.. మనం చెప్పింది వినటం తప్ప వారికేమీ తెలియదు.. ఇంకేమీ చేయలేరు అనే భ్రమల్లో ఉన్న పాలకులకు ఈ మూడు దేశాల్లోని తిరుగుబాట్లు గుణపాఠాలు అవ్వాలి. వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోనంత వరకే పాలకుల ఆటలు సాగుతాయి. ఒక్కసారి వారు నమ్మకం కోల్పోతే..ఇక అంతే సంగతులు!










Comments