top of page

ఆ ‘మందు’ పోస్తేనే.. ఈ మందులు ఇస్తాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 4 min read
  • టెక్కలి ఏఆర్టీ సెంటర్‌లో ఆ ఇద్దరిదే పెత్తనం

  • మెడికల్‌ ఆఫీసర్‌ను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యం

  • రోగులపై రుబాబు.. వ్యక్తిగతంగా వేధింపులు

  • ఉచితంగా ఇవ్వాల్సిన ఔషధాలకు వసూళ్లు

  • అప్పుడు వైకాపా చెంతన.. ఇప్పుడ టీడీపీ పంచన

మీ ప్రాణాలను రక్షించే మందులు కావాలంటే మాకు ఆ మందు పోయించండి లేదా రూ.వెయ్యి రూపాయలు ఇవ్వండి.

మరో మంచి ఆఫర్‌ ఉందండోయ్‌!.. పేషెంట్‌ రాకపోయినా, అసలు ఈ ఊరివారు కాకపోయినా ఫర్వాలేదు. వారి చేతులు తడిపితే చాలు.. పోస్టులోనో కొరియర్‌లోనో అవసరమైన ఔషధాలు పేషెంట్ల చెంతకు చేరిపోతాయి.

ఇదీ టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించాల్సిన ఏఆర్టీ(యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ) సెంటర్‌లో జరుగుతున్న దందా. కౌన్సెలర్ల ముసుగులో ఉన్న ఓ ఇద్దరు సాగిస్తున్న ఈ వసూళ్ల పర్వం మొత్తం సెంటర్‌కు చెడ్డపేరు తెస్తోంది. ఇదే కాదు.. మద్యం సేవించి రావడం, మెడికల్‌ ఆఫీసర్‌నే ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వీరికి నిత్యకృత్యం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

‘నేను ఒక రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగిని. హెచ్‌ఐవీ సోకి ప్రతినెలా టెక్కలి ఏఆర్టీ సెంటర్‌కు వెళ్తున్నాను. అయితే ప్రతి నెలా మద్యం బాటిల్‌ ఇస్తే తప్ప మందులు ఇచ్చేదిలేదంటూ అక్కడి కౌన్సెలర్లు ఇబ్బంది పెడుతున్నారు. మద్యం బాటిల్‌ తీసుకురాకపోతే రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌’ చేస్తున్నారు’. టెక్కలి ఏఆర్టీ సెంటర్‌పై ఒక బాధితుడి ఫిర్యాదు, ఆవేదన ఇది. ఆయనొక్కరే కాదు చాలామంది పేషెంట్లు ఇలాగే బాధితులుగా మారుతున్నారు. వ్యాధితో బాధపడుతూ మందుల కోసం వెళితే.. ఆ కేంద్రంలోని ఇద్దరు కౌన్సెలర్లు దోపిడీకి పాల్పడుతూ మరింతగా బాధపెడుతున్నారని అనేకమంది రోగులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే హెచ్‌ఐవీ బాధితులు. చాలామంది అవగాహన లేక వారిని చిన్నచూపు చూస్తుంటారు. దాంతో కొత్తవారి వద్దకు వెళ్లడానికి వారు జంకుతుంటారు. అందుకే కౌన్సెలర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నా అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు ఉండవేమోనన్న అనుమానం కూడా వారిని వెనక్కి లాగుతోంది. తమను ఇబ్బంది పెడుతున్నవారికి రాజకీయ, అధికరపరంగా పరిచయాలు ఉండటమే దీనికి కారణం.

1870 మంది పేషెంట్లకు సేవలు

ఎయిడ్స్‌ నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా టెక్కలి ప్రభుత్వ జనరల్‌ఆస్పత్రి ఆవరణలోనే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగులకు సేవలందించేందుకు ఏఆర్టీ సెంటర్‌ పని చేస్తోంది. రోగులకు కౌన్సెలింగ్‌ చేయడం, టెస్టు చేయించడం, మందులు ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వర్తించే ఈ కేంద్రం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 1870 మంది సేవలు పొందుతున్నారు. వీరిలో వందమంది వరకు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ఉన్నారు. రోగులకు నెలకోసారి మందులు ఇస్తుంటారు. అలాగే రెండు నెలలకోసారి టెస్టులు చేస్తుంటారు. పరిస్థితిని బట్టి కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఆ విధంగా ప్రతిరోజు ఈ కేంద్రానికి 80 మంది వరకు రోగులు వస్తుంటారు. కేంద్రంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, నలుగురు కౌన్సెలర్లు, ఒక స్టాఫ్‌ నర్సు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు. ఒక ఫార్మాసిస్ట్‌ ఉండాల్సి ఉండగా, ఆ పోస్టు ఖాళీగా ఉంది. వీరిలో పైలా వెంకటరమణ అలియాస్‌ నేతాజీ అనే ఏఆర్టీ కౌన్సెలర్‌, సురేష్‌ అనే పీపీటీసీటీ అంటే.. చిన్నపిల్లలు, బాలింతలకు సేవలు అందించే కౌన్సెలర్‌ కలిసి ఈ కేంద్రాన్ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేంద్రానికి వచ్చే పేషెంట్లను మందులు ఇచ్చే విషయంలో ఇబ్బందిపెడుతున్నారు. డబ్బులు దండుకుంటున్నారు. అలాగే వారి కుటుంబ, వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారి బలహీనతలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మందులివ్వాలంటే డబ్బులు ముట్టాలి

కేంద్రానికి వైద్యసేవల కోసం వచ్చే రోగులకు డబ్బులివ్వనిదే మందులు ఇవ్వడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కౌన్సెలర్లే కుమ్మక్కై ఇతర ఉద్యోగులను సైడ్‌ చేసేసి పెత్తనం చెలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మందుల కోసం వచ్చే ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ను వారికి మిలటరీ కోటాలో అందే మద్యం బాటిల్‌ ఇవ్వాలని అది కాకపోతే రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌ చేసి మరీ వసూలు చేస్తున్నారని తెలిసింది. అలా ఇవ్వకపోతే ప్రతి నెలా ఇవ్వకుండా రెండు మూడు నెలలకోసారి మొక్కుబడిగా మందులు ఇస్తున్నారు. ప్రతినెలా ఇస్తున్నట్లు చూపించి వాటిని బయట పేషెంట్లకు అమ్ముకుంటున్నారని తెలిసింది. కొన్ని సందర్భాల్లో మెడిసిన్‌ స్టాక్‌ ఉన్నా లేదని చెప్పి మూడు నాలుగు వేలు వసూలు చేసిన తర్వాత ఇస్తున్నారు. ఈ మందులు చాలా ఖరీదైనవి కావడంతో బయట మార్కెట్‌లో కొనలేక ఈ ఇద్దరు చెప్పినట్లు డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఇక కొందరు ఇక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుంటారు. కానీ మందులు, కౌన్సెలింగ్‌ కోసం వారు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. అటువంటి రోగులతో వీరు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వారి నుంచి ప్రతినెలా రూ.రెండు వేలు చొప్పున తీసుకుని అవసరమైన మందులను ఈ కౌన్సెలర్లే పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపిస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న ఒక పేషెంట్‌ గత జనవరిలో కేంద్రానికి వచ్చి మందులు తీసుకున్నారు. మళ్లీ ఆయన ఫిబ్రవరిలో రావాలని అతని అటెండెన్స్‌ కార్డులో వైద్యాధికారి నమోదు చేశారు. కానీ ఆరు నెలలుగా సదరు పేషెంట్‌ రాలేదు. అయినా ఆయనకు ప్రతినెలా ఠంచనుగా మందులు చేరిపోతున్నాయి. రోగులు ఇచ్చే రోగుల నుంచి ఎక్కువ బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుని.. దానిలో కొంత కేంద్రానికి రాకుండా తమ ద్వారా మందులు పొందుతున్నవారి బ్లడ్‌ శాంపిల్‌గా నమోదు చేసి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని తెలిసింది.

ఆగడాలకు అంతులేదు

మందుల పంపిణీలోనే కాకుండా చాలా విషయాల్లో ఆ ఇద్దరు కౌన్సెలర్లు రెచ్చిపోతున్నారు. తమకంటే తక్కువ సర్వీసు ఉన్న కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ను లెక్కచేయకుండా ఆయన్ను వేధిస్తున్నట్లు తెలిసింది. ఆయనుకు తెలియకుండా మందులు ఇవ్వడం, రక్తం శాంపిల్స్‌ మర్చేడం వంటివి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మద్యం సేవించి వచ్చి రోగులను దూషిస్తుంటారు. ఉచితంగా ఇవ్వాల్సిన మందులను తమ లంచ్‌ బ్యాగుల్లో పెట్టి అక్రమంగా బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. ఏఆర్టీ కేంద్రానికి ఒంటరిగా వచ్చే మహిళలతో పరాచకాలాడుతూ, హేళన చేయడంతోపాటు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని తెలిసింది. అలాగే రోగుల్లో ఎవరికైనా హైవే, పట్టణ ప్రాంతాల్లో స్థలాలు, భూములు ఉన్నాయని తెలిస్తే వారిని బెదిరించి తక్కువ ధరకు వాటిని కొట్టేస్తున్నారు. దానికి అంగీకరించకపోతే గోప్యంగా ఉంచాల్సిన వారి వ్యాధి వివరాలను బయటపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిసింది. కేంద్రానికి వచ్చే హెచ్‌ఐవీ పెషెంట్లను మేనేజ్‌ చేసి బయట డాక్టర్ల వద్దకు పంపుతూ వారి నుంచి కూడా కమీషన్లు తీసుకుంటున్నారని తెలిసింది. గతంలో నేతాజీ శ్రీకాకుళం ఏఆర్టీలో పని చేసినప్పుడు వైజాగ్‌ నుంచి ఆయుర్వేద మందులు తెప్పించి రోగులకు బలవంతంగా అంటగట్టి వేల రూపాయలు వెనకేసుకున్నారు.

ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరి..

చాలా ఏళ్లుగా జిల్లాలోనే పని చేస్తున్న ఈ ఇద్దరు కౌన్సెలర్లు ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయం మర్చిపోయి రాజకీయంగానూ ఆటలాడుకుంటున్నారు. గతంలో శ్రీకాకుళం ఏఆర్టీలో పని చేసిన పైలా వెంకటరమణ(నేతాజీ) 2022 జూలైలో టెక్కలి ఏఆర్టీకి బదిలీ అయ్యి అక్కడే కొనసాగుతున్నారు. టెక్కలిలోనే నిన్నటి వరకు పని చేసిన పీపీటీసీటీ కౌన్సెలర్‌ సురేస్‌ గత నెలే తాత్కాలిక ప్రాతిపదికన కోటబొమ్మాళి ఐసీటీసీకి బదిలీ అయ్యారు. దీరిద్దరూ రాజకీయాలను కూడా తమకు అనువుగా వాడేసుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కణితి విశ్వనాథం అనుచరులుగా ఉన్న వీరు వైకాపా హయాంలో ఆ పార్టీతో అంటకాగారు. ఆ ప్రభుత్వం అచ్చెన్నాయుడును అరెస్టు చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రెచ్చిపోయారు. సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ పంచన చేరిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడు వెంట తిరుగుతూ నాడు దూషించిన నోటితోనే ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మంత్రితో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొంటూ రెచ్చిపోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఏపీ శాక్స్‌) ఇన్‌ఛార్జీ ఏపీడీగా ఉన్న కామేశ్వరప్రసాద్‌ ప్రాపకం కూడా వీరికి లభించింది. గతంలో ఇక్కడ డీపీఎంగా ఉండి అవినీతి ఆరోపణలతో వెళ్లిపోయిన ఉమామహేశ్వరరావును మళ్లీ ఇక్కడికి తీసుకువచ్చేందుకు అలాగే ఊస్టింగ్‌ పొందిన ఛైల్డ్‌ ఫండ్‌ ఇండియా డీఆర్పీ హనుమంతు నాగభూషణరావును మంత్రి అచ్చెన్న, ఏపీడీ కామేశ్వర ప్రసాద్‌ల ద్వారా మళ్లీ వెనక్కి రప్పించి, ఆయా పోస్టుల్లో కూర్చుబెట్టేందుకు కూడా వీరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వీరి పరపతిని చూసి ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులు భయపడుతున్నారు. ఒక బాధితుడు ధైర్యం చేసి సుమారు ఏడాది క్రితం ఏపీశాక్స్‌కు ఫిర్యాదు చేస్తూ మెయిల్‌ పంపినా దానిపై ఇంతవరకు చర్యలు లేకపోవడం కూడా బాధితుల వెనుకంజకు కారణం.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page