top of page

ఆ రోడ్డు.. అడుగేయడానికి కూడా అడ్డు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 25, 2025
  • 2 min read
  • కమిషనర్‌ బంగ్లా పక్కనే కార్ల షెడ్డు

  • చిన్నబరాటంవీధి, టౌన్‌హాల్‌ రోడ్డు, కళింగ రోడ్డుల్లో ట్రాఫిక్‌జామ్‌

  • పాడైపోయిన కార్లకు ఈ రోడ్డే యార్డు

  • పోలీసులొచ్చినా స్పందించని యాజమాన్యం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మీరుంటున్న ఇళ్ల మధ్యలో ఒక డంపింగ్‌ యార్డు ఉంటే ఎలా ఉంటుంది? మీ వీధి మొదట్లో ఐరన్‌ స్క్రాప్‌ గొడౌన్‌ రోడ్డుపైనే స్టాక్‌ పెడితే ఎలా ఉంటుంది? కానీ మున్సిపల్‌ కమిషనర్‌ బంగ్లాకు ఆనుకొని ఎంహెచ్‌వో క్వార్టర్స్‌ వరకు మున్సిపాలిటీ రోడ్డును పూర్తిగా స్క్రాప్‌ కార్ల కోసం, బ్యాటరీ రిపేర్ల కోసం, ఏసీ మరమ్మతుల కోసం వాడుకుంటే మాత్రం మున్సిపల్‌ యంత్రాంగానికి, మన ట్రాఫిక్‌ పోలీసులకు ఏమాత్రం ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే.. ఈ రోడ్డు నుంచి మున్సిపల్‌ అధికారులెవరూ ప్రయాణం చేయరు. పోలీసులు కూడా ఈ రోడ్డు మీదే తమ వాహనాలను రిపేరు చేయిస్తుంటారు.

ఎక్కడో ఊరి శివారున ఉండాల్సిన ఒక కార్‌ గ్యారేజ్‌ నగరం నడిబొడ్డులో ఉంది. మున్సిపల్‌ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకొని కార్ల రిపేర్ల సెంటర్‌ను నడుపుతున్నారు. ఒకటో రెండో కార్లయితే ఇబ్బందిలేదు. కానీ ఈ రోడ్డంతా ఇక్కడ రిపేర్లకు వచ్చిన కార్లతోనే నిండిపోతుంది. మరోవైపు ఇక్కడే ఎరువుల దుకాణాలు, పెయింటింగ్‌, ఫర్నిచర్‌ షాపులు, గేట్లు, గ్రిల్స్‌ తయారుచేసే దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద వాహనాలు వచ్చి నిల్చుంటున్నాయి. అన్నిటికీ మించి మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలంటే వాటిని ఇక్కడే నిలిపి నింపాలి. వీటన్నింటి వల్ల మున్సిపల్‌ కార్యాలయం వెనుక, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో టౌన్‌హాల్‌కు వెళ్లే మార్గం పూర్తిగా మూతబడిపోయింది. మూడు వేల రూపాయల అద్దెకు దిగిన ఒక ఆసామి ఆ తర్వాత అదే షాపును రూ.15వేలకు దక్కించుకొని కార్లు బాగుచేసే వ్యాపారాన్ని పెట్టుకున్నాడు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే బాగుచేసినా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న కార్లను కూడా ఈ రోడ్డు మీదే నిలిపేయడం, కొత్తగా రిపేర్లకు వచ్చిన కార్లను ఆ పక్కన పార్క్‌ చేయడం వల్ల ఇక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయిపోతోంది. మొదట్లో వీరు కార్లలో ఉండే బ్యాటరీ బలహీనపడిపోయి కారు ఆగిపోతే దానికి బూస్టింగ్‌ ఇచ్చే పనిని చేసేవారు. ఆ తర్వాత కారుల్లో ఉన్న ఏసీని కూడా బాగుచేయడం ప్రారంభించాక ఇక్కడ కార్ల సంఖ్య పెరిగింది. అన్నిటికీ రోడ్డే ఆధారం కావడం వల్ల ఎలా వచ్చిన కారును అలా నిలిపేసి బాగుచేస్తున్నారు. దీనివల్ల ఆ రోడ్డు మీద మరో వాహనం వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే అప్పటికే ఎరువుల లోడిరగ్‌ కోసం ఏదో ఒక వ్యాన్‌ అక్కడ ఉంటుంది. పెయింట్లు అన్‌లోడ్‌ కోసం మరో వ్యాన్‌ నిలుపుదల చేసివుంటుంది. నీటి సరఫరా కోసం ట్యాంకర్లు ఉంటున్నాయి. అడపాదడపా ఫర్నిచర్‌ షాప్‌ కోసం వచ్చే వాహనాలకూ తక్కువలేదు. కార్ల రిపేర్ల కోసం ఆక్రమించిన రోడ్డు మినహాయించి ఇవన్నీ పార్క్‌ చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక చిన్నబరాటంవీధిలో చెప్పుల షాపులు ఎక్కువగా ఉండటం వల్ల, అందులోనూ ఇది పాఠశాలలు తెరిచే సీజన్‌ కావడంతో రోడ్డు మీదే కార్లు పెట్టేస్తున్నారు. రెండువైపులా వచ్చీపోయే వాహనాల వల్ల ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. చిన్నబరాటంవీధిలో చిక్కుకుపోయే బదులు కమిషనర్‌ బంగ్లా మీదుగా టౌన్‌హాల్‌ రోడ్డు నుంచి జీటీ రోడ్డు చేరుకోవాలని చూసినవారికి ఇక్కడ కూడా దారిచ్చే నాధుడు కనిపించడంలేదు. ఆమధ్య వన్‌టౌన్‌ సీఐకి ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐని పంపించి సుదీర్ఘ కాలంగా అక్కడే నిలిచిపోయిన వాహనాలను ముందుగా తీసేయాలని ఆదేశించారు. అది ఏమేరకు జరిగిందో తెలియదుగానీ ఇక్కడ ఎప్పటిలాగానే మళ్లీ కార్లు వచ్చి చేరుతున్నాయి. అటు చిన్నబరాటంవీధి వైపు వెళ్లలేక, ఇటు టౌన్‌హాల్‌ రోడ్డుకు మళ్లలేక కళింగ రోడ్డును మాత్రమే టూవీలర్‌ నడిపేవారు ఆశ్రయించడం వల్ల ఒకసారి సిగ్నల్‌ పడితే సెవెన్‌రోడ్‌ జంక్షన్‌ నుంచి పందుంపుల్లల జంక్షన్‌ వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనివల్ల మార్కెట్‌ రోడ్డు నుంచి వచ్చేవారు కళింగ రోడ్డు మీదకు వెళ్లలేకపోవడం వల్ల మార్కెట్‌ రోడ్డు కూడా జామ్‌ అవుతోంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నవారు పెద్దపాడు వైపు షిప్ట్‌ కావాల్సివున్నా ఎంహెచ్‌వో బంగ్లాకు ఆనుకొనే ఈ పనులు చేస్తుండటం పట్ల మున్సిపల్‌ యంత్రాంగం కూడా ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. పోలీసులు కూడా అడపాదడపా తమ వాహనాలకూ వీరి నుంచి సహకారం అందుతుందన్న కోణంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page