ఆ వీడియోతో ఫిట్‌నెస్‌కు లంకె!
- DV RAMANA

- 1 day ago
- 3 min read

పాత వాహనాలు నిర్ణీత కాలపరిమితి తర్వాత కూడా రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను అమలు చేయడంలో రవాణా శాఖ అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు కొత్త కాదు. రవాణా శాఖ అంటేనే అవినీతి పుట్ట. అక్కడ దళారులదే రాజ్యం. వాహనాల రిజిస్ట్రేషన్లు చేయడం నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రెన్యూవల్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ వంటివన్నీ ఈ కార్యాలయాలే చేయాల్సి ఉంటుంది. అధికారులు స్వయం తనిఖీలు, పరిశీలనలు జరిపి, భౌతిక పరీక్షలు నిర్వహించి నిబంధన ల ప్రకారం అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని నిర్థారించుకున్న తర్వాతే సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క పనీ అక్కడ నేరుగా జరగదన్నది బహిరంగ రహస్యం. దళారులే ప్రజలు, అధికారుల మధ్య అనధికారిక సంధానకర్తలుగా వ్యవహరిస్తూ డబ్బులు పుచ్చుకుని అన్ని తతంగాలు నడిపించేస్తుంటారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి.. ఆర్టీవో కార్యాలయాల పరిసర ప్రాంతాలనే తమ అడ్డాలుగా చేసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎవరైనా నేరుగా కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిస్తే పని జరగదు. అదే ఆ పరిసరాల్లో ఉండే బ్రోకర్‌ను ఆశ్రయించి వారి చెప్పిన రేటు ముట్టజెబితే చాలు.. అర్హత లేకపోయినా, తగిన పత్రాలు లేకపోయినా, వాహనం కండీషన్‌లో లేకపోయినా మనం కోరుకున్న సర్టిఫికెట్లు వచ్చేస్తాయి. రవాణా కార్యాలయాలు అవినీతి కూపాలుగా మారిపోయాయన్న ఫిర్యాదులు, విమర్శల నేపథ్యంలో వీటి పని విధానాన్ని ఆన్‌లైన్ చేసి పారదర్శకత కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో భాగంగానే ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసినా అవినీతికి అడ్డుకట్ట పడకపోవడంతో ఈమధ్యే కేంద్ర రవాణా శాఖ మరికొన్ని కఠినమైన ఆంక్షలు విధిం చింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ రూల్స్ నుంచి ఎటువంటి వారైనా తప్పించుకోవడం కష్టమని అంటున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు సంబంధించి నిబంధనల్లో ప్రస్తావించిన ఒక వీడియో ఇప్పుడు అవినీతిపరులకు ప్రధాన అవరోధంగా మారిందంటున్నారు. ఈ వీడియో నిబంధన కారణం గా అటు దరఖాస్తుదారుడు, ఇటు సంబంధిత అధికారి తప్పనిసరిగా భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ విధంగా మేనేజ్ చేసే రోజులు పోయాయని అంటున్నారు. స్వయంగా హాజరుకాకుండా, తగిన పత్రాలు లేకుండానే దొడ్డిదారిన సర్టిఫికెట్లు పొందే అక్రమ చర్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభు త్వం వాహనాల ఫిట్‌నెస్ విషయంలో మరింత కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దొడ్డిదారిన సర్టిఫికెట్ల జారీ, లైసెన్సుల మంజూరు వంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయ డానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ప్రైవేట్ వాహనాలు కూడా కమర్షియల్ వెహికల్స్ తరహాలోనే అధికారిక ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్లలో (ఏటీఎస్) వాహనాలకు భౌతిక, సాంకేతిక పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బండిని ఫిజికల్‌గా అక్కడికి తీసుకెళ్తేనే టెస్ట్ చేస్తారు, లేదంటే కుదరదు. ఆటోమేటెడ్ టెస్టింగ్ కొత్త నిబంధనల ప్రకారం వాహనం వయసు 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం కచ్చితంగా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మన దేశంలో ఇప్పటికే 160కి పైగా ఇలాంటి టెస్ట్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కంప్యూటరైజ్డ్ మిషన్ల ద్వారా ఫిట్‌నెస్, ఎమిషన్ చెక్స్ చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రతి ఐదేళ్లకోసారి ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల ఏజెంట్ల ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించే మార్గాలు పూర్తిగా మూసుకుపోతాయి. ఈ మొత్తం ప్రోసెస్‌లో అత్యంత కీలకమైన మార్పు పది సెకండ్ల వీడియో చిత్రీకరణ. టెస్ట్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్షన్ నిజంగానే జరిగిందా లేదా అని క్రాస్ చెక్ చేయడానికి ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసే ముందు టెస్టింగ్ స్టేషన్ లేదా రవాణా అధికారి వాహనానికి సంబంధించిన కనీసం పది సెకన్ల వీడియోను చిత్రీకరించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణ వీడియో కాదు.. జియోట్యాగ్ (లొకేషన్‌తో కూడిన)తో అనుసంధానించిన వీడియో అయి ఉండాలి. ఇందులో వాహనం ముందు, వెనుక, ఎడమ, కుడి వైపు భాగాల (360 డిగ్రీలు) దృశ్యాలు కవర్ అవ్వాలి. అంతే కాకుండా నంబర్‌ప్లేట్, ఛాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. ఇలా చేయడం వల్ల ఇన్‌స్పెక్షన్ చేయకుండానే సర్టిఫికెట్లు ఇచ్చే పాత పద్ధతులకు శాశ్వతంగా పుల్‌స్టాప్ పడుతుంది. ఒకవేళ మీ వాహనం ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయితే మళ్లీ వెంటనే టెస్ట్ అటెంప్ట్ చేసి సర్టిఫికెట్ పొందే అవ కాశం కూడా లేదు. దానికి కూడా కొంత కాలపరిమితిని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ డెడ్ లైన్‌ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ టెస్టులో వాహనం ఫెయిల్ అయిన రోజు నుంచి, దాన్ని రిపేర్ చేయించుకుని మళ్లీ టెస్ట్ పాస్ అవ్వడానికి మధ్య గరిష్టంగా 180 రోజుల (ఆరు నెలలు) గడువు ఉంటుంది. ఈ గడువులోగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందలేకపోతే ఆ వాహనాన్ని ‘ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్(ఈఎల్‌వీ)గా ప్రకటిస్తారు. జాతీయ వాహన డేటాబేస్‌లో వెంటనే ఆ బండిని ఈఎల్‌వీగా నమోదు చేస్తారు. అంతే.. ఇక ఆ బండి జీవితంలో రోడ్డెక్కడానికి పనికిరాదు. దాన్ని స్క్రాప్ కింద అమ్ముకోవాల్సిందే. గతంలో ఫీజులు కట్టి 180 రోజుల గడువును పదే పదే పొడిగించుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేస్తున్నారు. బండిని కండిషన్‌లో ఉంచుకోవడం లేదా స్క్రాప్ చేయడం.. రెండే ఆప్షన్లు ఉంటాయి. టెస్టింగ్ స్టేషన్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వ కుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అవినీతిని అరికట్టడమే కాకుండా దేశంలో రోడ్డు భద్రత ను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాక్ష్యలతో కూడిన ఈ విధానం వల్ల డొక్కు వాహనాలు ప్రమాదాలు తగ్గుతాయింటున్నారు. వెహికల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ప్రక్షాళనలో ఇదో పెద్ద ముందడుగు.










Comments