top of page

ఆ సెక్షన్లు.. సోషల్‌ మీడియాకు సంకెళ్లు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 29, 2025
  • 2 min read

ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చి సమాచార రంగ విస్తృతికి దోహదం చేసింది. ఒకప్పుడు ఒకటీ అరా పత్రికలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో రేడియా.. ఆ తర్వాత టీవీలు మాత్రమే సమాచార స్రవంతిగా ఉండేవి. వాటిలోనూ చాలా వడపోతల అనంతరం పరిమిత సమాచారం మాత్రమే ప్రజలకు చేరేది. కానీ ఆధునిక సాంకేతిక సమాచార రంగ ద్వారాలను బార్లా తెరిచింది. పత్రికలు, టీవీ న్యూస్‌ఛానళ్లకు తోడు వెబ్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌కు తోడు వాట్సప్‌, ట్విటర్‌(ఎక్స్‌), ఇన్‌స్టాగ్రామ్‌ వంటి అనేకానేక సమాచార సాధనాలు సోషల్‌ మీడియా పేరుతో అందుబాటులోకి వచ్చేశాయి. వీటి ద్వారా ఏదైనా సంఘటన లేదా సమాచారం క్షణాల్లో విశ్వవ్యాప్తం అవుతోంది. ఇవి ఎంతవేగంగా వ్యాప్తిలోకి వచ్చాయో.. అంతే వేగంగా వాటిపై నియంత్రణ అమల్లోకి వస్తోంది. సోషల్‌ మీడియాకు పగ్గాలు వేయడాన్ని మొదట కేంద్ర ప్రభుత్వం మొదలుపెడితే.. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకున్నాయి. కేంద్ర రూపొందించి ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బి) సోషల్‌ మీడియాకు అనుచితంగా కళ్లెం వేసేతందుకు ఉపయోగపడుతోంది. ఇది సుప్రీంకోర్టు షరతులను తప్పించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని, వాక్‌ స్వాతంత్య్ర హక్కుకు సవాల్‌ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టంలోని ఈ అధికరణలే పౌరులు, జర్నలిస్టులు తమ అభిప్రాయాలు చెప్పడానికి వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. అందుకే దీనిపౖౖె మరింత న్యాయపరమైన స్పష్టత అవసరం. రాజకీయ పార్టీలకు సామాజిక మాధ్యమాలు సమస్యగా మారిన క్రమంలోనే యూట్యూబర్లు, జర్నలిస్టులు, సామాజిక, స్వచ్ఛంద కార్యకర్తలపై ప్రభుత్వాలు ఐటీ చట్టాన్ని చూపించి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జర్నలిస్ట్‌ సిద్ధిక్‌ కప్పన్‌ లాంటి వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. మన రాష్ట్రంలో అయితే మీడియాపై పదేళ్లుగా అనధికార అణచివేత కొనసాగుతోంది. వైకాపా సర్కారు హయాంలో కేబుల్‌ ప్రసారాల్లో ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి ఛానళ్లను నిలిపివేశారు. ఇక చంద్రబాబు సీఎం అయ్యాక.. సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ ఛానళ్ల ప్రసారాలు కేబుల్‌ నెట్‌వర్క్‌లలో కనిపించడం లేదు. దీంతో తమకు సంబంధం లేదని మంత్రులు, అధికారులు తప్పించుకోవచ్చు. కానీ వాస్తవం ఏమిటో అందరికీ తెలుసు. కాగా సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేయడంలో ఒక కొత్త పద్ధతి కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలే కాకుండా ప్రభుత్వాలు నేరుగా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాజ్యాంగం పౌరులకు వాక్‌ స్వాతంత్య్ర హక్కు కల్పించింది. ఇది ఆన్‌లైన్‌ వ్యాఖ్యలకు కూడా వర్తిస్తుంది. అయితే దీనికి పరిమితులు ఉన్నాయి. జాతీయ భద్రత, ప్రజా శాంతి, నైతికత వంటి వాటికి భంగం వాటిల్లేలా ఉంటే ఐటీ చట్టం 2000 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్‌ 69ఏ పై అంశాలకు విరుద్ధంగా ఉన్న సమాచారాన్ని బ్లాక్‌ చేసే అధికారం ఇస్తుంది. దీన్ని సుప్రీం కోర్టు సమర్థించినా కొన్ని షరతులు పెట్టింది. సరైన కారణాలు చూపకుండా ఏకపక్షంగా సమాచారాన్ని బ్లాక్‌ చేయడానికి ఈ సెక్షన్‌ను వాడకూడదు. గతంలో సెక్షన్‌ 69ఏ కింద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారికి మాత్రమే ఉండేది. అయితే సెక్షన్‌ 79(3)(బి) ఆధారంగా ఈ అధికారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు, పోలీసులకు కూడా విస్తరించారు. సెక్షన్‌ 69ఏ అమలుకు సుప్రీం కోర్టు కొన్ని పరిమితులు విధిస్తే.. ఆ పరిమితులను తప్పించుకునేందుకు సెక్షన్‌ 79(3)(బి) ప్రభుత్వాలు అవకాశం ఇస్తోంది. ఈ కొత్త సెక్షన్‌ ద్వారా తీసుకునే చర్యలకు జవాబుదారీతనం ఉండదు. సమాచారం చట్టవిరుద్ధమని ఏకపక్షంగా నిర్ణయించి దాన్ని తొలగించాలని ఆదేశించవచ్చు. వాక్‌ స్వాతంత్య్రాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఒక వ్యూహాత్మక మార్పు ఇది. దీనికితోడు సామాజిక మాధ్యమాల నియంత్రణ కు సహయోగ్‌ అనే ప్లాట్‌ఫారాన్ని కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు, జిల్లా అధికారులు, పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అల్‌ జజీరా నివేదిక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారం ద్వారా సుమారు 3,465 యూఆర్‌ఎల్‌లు తొలగించాలని ఇప్పటివరకు ఆదేశించారు. కేంద్రం చేపట్టిన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కర్ణాటకలో బెంగుళూరు సివిల్‌ కోర్ట్‌ ధర్మస్థల ‘సామూహిక అంత్యక్రియలు’ కేసుపై మీడియాకు నిషేధాజ్ఞలు జారీ చేయడం, తెలంగాణలో ఒక బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై నమోదైన క్రిమినల్‌ కేసులను హైకోర్టు కొట్టివేయడం దీనికి ఉదాహరణలు. ఆన్‌లైన్‌ విమర్శలకు క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేరళలో కూడా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. ఇవి చూస్తే అధికారంలో ఏ పార్టీ ఉన్నా, నియంత్రణ పద్ధతులు ఒకేలా ఉన్నాయి. రాజకీయ నాయకులు వ్యక్తిగత అంశాల్లోనూ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందువల్ల దీన్ని వ్యవస్థాగత సమస్యగా పరిగణించాలి. ఒకపక్క కొన్ని కోర్టులు వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తుంటే.. మరికొన్ని కోర్టులు ప్రభుత్వ నియంత్రణను సమర్థిస్తున్నాయి. ఈ వైరుధ్యం వల్లే సామాజిక మాధ్యమాల నియంత్రణపై స్పష్టత కొరవడి, ఒకరకైన భయం ఏర్పడుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page