ఆ సవరణ.. ప్రజాస్వామ్యానికి మరణ శాసనం!
- DV RAMANA

- Aug 21, 2025
- 2 min read

ఏ పదవిలో ఉన్నవారైనా సరే.. ఏదైనా కేసులో ఏకధాటిగా 30 రోజులు పోలీసు కస్టడీలో ఉంటే ఆటోమేటిక్‌గా వారి పదవి రద్దయిపోతుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ సర్కారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. చెప్పుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. రాజకీయ అవినీతిని నియంత్రించేందుకు ఉపకరిస్తుందని అనిపించవచ్చు. పాలక బీజేపీ, ఎన్డీయే కూటమి సర్కారు కూడా అదే చెబుతున్నాయి. కానీ యావత్తు ప్రతిపక్షం దీన్నో దుర్మార్గపు, నియంతృత్వ ప్రతిపాదనగా అభి వర్ణిస్తూ.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు ఏకంగా ప్రజాసామ్యానికే మరణ శాసనం రాస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇంతకూ సదరు సవరణ బిల్లులో ఏముంది? దాని వల్ల తలెత్తే ఉత్పాతాలు ఏ స్థాయిలో ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. బుధవారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తర క్షణమే సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ మొత్తం ప్రతిపక్షాల ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. రాజ్యాంగంలోని 75, 164, 239ఏఏ అధికరణలకు సవరణలు చేస్తూ ప్రతిపాదించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో తీవ్ర నేరారోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహా కేంద్ర, రాష్ట్ర మంత్రు లు వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే వారి పదవి దానంతట అదే రద్దవుతుందన్నది ఈ సవరణ సారాంశం. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులకు ఇది వర్తిస్తుందని ప్రభు త్వం ప్రతిపాదించింది. అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగుగా కేంద్రం చెప్పుకొంటోంది. తీవ్రమైన ఆరోపణలతో జైల్లో ఉన్న నేతలు పదవుల్లో కొనసాగడం అనైతికమంటూ ఢల్లీి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ వంటి వారి ఉదంతాలను ప్రస్తావిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఒక ప్రజాప్రతినిధిపై నేరం రుజువై.. రెండేళ్లకు పైగా శిక్ష పడితేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. కానీ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు నేరం రుజువు కాకముందే అరెస్ట్ ఆధా రంగా పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ చేతిలో ఉన్న అధికారాన్ని కార్యనిర్వాహకవర్గం లాక్కోవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సహజ న్యాయసూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం కూడా. నేరం నిరూపితం కాకుండా నిందితులను దోషిగా పరిగణించరాదని మన రాజ్యాంగం, చట్టాలు ఘోషిస్తున్నాయి. కానీ కొత్త సవరణ వల్ల కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారినే విచారణ జరగకముందే, దోషిగా తేలకముందే పదవుల నుంచి ఊస్ట్ చేయడమంటే.. శిక్షించి నట్లే లెక్క. దీన్ని న్యాయవ్యవస్థ అసలు అంగీకరించదు. న్యాయపరమైన అభ్యంతరాలు ఇలా ఉంటే.. ఈ సవరణ గనుక అందుబాటులోకి వస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు అధికార పక్షం చేతికి ఆయుధం ఇచ్చినట్లేనని రాజకీయ పక్షాలు వ్యాఖ్యనిస్తున్నాయి. ఈ బిల్లుతో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తుందని ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టని విమర్శిస్తున్నాయి. దీన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెర లేపుతారని ఆరోపిస్తున్నారు. ఈ భయాందోళనల్లో వాస్తవం లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణ లపైనే రాజకీయ నేతలను విచారణ పేరుతో నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్న ఉదంతాలను ప్రతి పక్షాలు ప్రస్తావిస్తున్నాయి. 130వ సవరణతో ఆ దుర్మార్గపు ప్రక్రియకు రాజ్యాంగబద్ధత కల్పించడమే అవుతుందన్నది ప్రతిపక్షాల ఆందోళన. తమకు ఇష్టం లేని ఏ ముఖ్యమంత్రి పైనైనా తప్పుడు కేసు పెట్టి.. 30 రోజులు జైల్లో ఉంచి, ఆనక పదవి నుంచి తొలగించే ప్రమాదం ఉందంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా కేసు వేసిన సంస్థే నిందితుడు తప్పు చేశాడని నిరూపించాలి. కానీ ఈడీ కేసు పెడితే మాత్రం కేసు ఎదుర్కొనేవారే తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. అలాగే ఈడీ కేసుల్లో బెయిల్ ఎన్ని రోజులైనా జైలులో ఉంచొచ్చు. 2014 నుంచి రాజకీయ నేతలపై ఈడీ పెట్టిన 193 కేసుల్లో నేరం నిరూపితమైనవి రెండంటే రెండు కేసులో. అంటే మిగతావన్నీ రాజకీయ వేధింపులకు ఉద్దేశించినవే. ఈ లెక్కన ఈడీ, కొత్త చట్టాన్ని కలిపి ప్రయోగిస్తే ఎవరినైనా కారణం లేకుండా 30 రోజులు రిమాండ్‌లో ఉంచి, పదవి లాగేయవచ్చన్నమాట. అందుకే ప్రతిపక్షాలు దీన్ని అంతగా వ్యతిరేకిస్తున్నాయి.










Comments