ఆగ్నేయాసియాపై క్షయ పడగ!
- DV RAMANA

- Nov 29, 2025
- 2 min read

మానవ సమాజంపై ఒకవైపు కొత్త వ్యాధులు దాడి చేస్తుంటే.. మరోవైపు ఉన్న వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొత్త చికిత్సా విధానాలు, టీకాలు కనుగొంటున్నా.. పాత వ్యాధులు ఒకపట్టాన అదుపులోకి రాకపోగా.. మరింత విస్తృతమవున్నాయి. క్షయ(టీబీ`ట్యూబర్‌క్యులోసిస్) వ్యాధి కూడా ప్రపంచానికి అటువంటి సవాలే విసురుతోంది. ఈ కేసుల పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సౌత్‌ఈస్ట్ అసియా అంటే ఆగ్నేయాసియాలో వ్యాధి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షయ సోకితే ఊపిరితిత్తులతో పాటు మెదడు, వెన్నెముక, కిడ్నీలు, ఎముకలు, ఇతర శరీర భాగాలపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఆగ్నేయాసియా దేశాల ఆరోగ్య భద్రత, అభివృద్ధికి ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా పేద వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ రిపోర్ట్`2025లో ఆగ్నేయాసియా దేశాల్లో వ్యాధి పరిస్థితిపై ఆందోళనకరమైన వాస్తవాలు వెల్లడిరచింది. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు అంటే 25 శాతం ప్రజలు నివసిస్తున్న ఈ దేశాల్లోనే జనాభా నిష్పత్తికి మించి ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొత్త టీబీ కేసుల్లో మూడో వంతు అంటే దాదాపు 33 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షయ నియంత్రణ, నివారణకు ఆయా దేశాల ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా భారత్‌లోనే నమోదవుతాయని అంచనా. సుమారు 2.71 మిలియన్ల కేసులో భారత్‌లో ఉండగా ఆ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ (3.84 లక్షలు), మయన్మార్ (2.63 లక్షలు), థాయిలాండ్ (1.04 లక్షలు), నేపాల్ (67 వేలు) ఉన్నాయని సర్వేలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని టీబీ ఇన్సిడెన్స్ రేటు ప్రతి లక్ష జనాభాకు 201 కేసులుగా ఉంది. ఇది ప్రపంచ సగటు 131 కంటే చాలా ఎక్కువ. మయన్మార్, తిమోర్-లెస్టే దేశాల్లో 480 నుంచి 500 కేసులు, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, థాయిలాండ్‌లలో 146 నుంచి 269 కేసుల ఇన్సిడెన్స్ రేటు ఉండగా శీలంక, మాల్దీవుల్లో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ సోకుతుంది. ఇది సాంక్రమిక వ్యాధుల జాబితాలోకి వస్తుంది. టీబీ లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే గాలి, తుంపర్ల ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే అనుమానించాలి. మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగే పొడి దగ్గు లేదా కఫంతో కూడిన దగ్గు, దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం పడటం, ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తక్కువ స్థాయి జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, శరీర బరువు కోల్పోవడం, ఆకలి మందగించడం, నిరంతరం అలసటగా, బలహీనంగా అనిపించడం, శ్వాస తీసుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటాయి. ఇతర భాగాలకు టీబీ సోకినప్పుడు వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి. మెదడు పొరల వాపు, ఎముకలు, కీళ్ల నొప్పి, శోష వంటి వాటిని టీబీ శరీరభాగాలకు వ్యాపించిదనడానికి సంకేతాలు. ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. అదే సమయంలో దాని నిర్మూలన విషయంలోనూ అనేక అడ్డంకులు, సవాళ్లు ఉన్నాయి. ఇదే ఆందోళనకర విషయమని నివేదిక పేర్కొంది. ఇటీవలి కాలంలో డ్రగ్ రెసిస్టెంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రకమైన టీబీకి ప్రామాణిక యాంటీ బయాటిక్స్ పనిచేయవు. దీనికి చికిత్సా విధానం సంక్లిష్టంగా ఉంటుంది. నివారణకు ఎక్కువ సమయం పడుతుంది.. ఖరీదైనది కూడా. పేదరికం, బలహీనమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు టీబీ నివారణ, చికిత్స సేవలను మెజారిటీ ప్రజలకు దూరం చేస్తున్నాయి. హెచ్‌ఐవీ బాధితులకు టీబీ సోకే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి సోకిన వారందరినీ గుర్తించలేని పరిస్థితి ఉన్నప్పటికీ బంగ్లాదేశ్, భారత్, థాయిలాండ్‌లలో కేసుల గుర్తింపు కాస్త మెరుగైందని నివేదిక పేర్కొంది. కాగా 2015 నాటి కంటే ఆగ్నేయాసియాలో టీబీ ఇన్ఫెక్షన్ రేటులో 16 శాతం క్షీణత కనిపిస్తోంది. అలాగే చికిత్స కవరేజ్ 85 శాతం దాటింది. అయితే జనాభా పెరుగుదల వేగం ఈ విజయాలను వెనక్కి నెట్టేస్తోంది. టీబీ చికిత్సకు నిర్దిష్ట కాలంపాటు యాంటీబయోటిక్స్ కోర్సు తప్పనిసరిగా తీసుకోవాలి. చికిత్స వ్యవధి సాధారణంగా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుంది. డ్రగ్-రెసిస్టెంట్ టీబీ అయితే మరింత పడుతుంది. వైద్యులు సూచించిన పూర్తి కోర్సును ఏ కారణంతోనైనా మధ్యలో ఆపేస్తే టీబీ బ్యాక్టీరియా మందుల నిరోధకతను మించి మరింత శక్తి పుంజుకుని డ్రగ్-రెసిస్టెంట్ టీబీగా మారే ప్రమాదం ఉంది. ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి టీబీ మహమ్మారిని పూర్తిగా పారదోలాలంటే కొన్ని అంశాల్లో శరవేగంగా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. పేదలవాడలు, గ్రామీణ ప్రాంతాల్లో టీబీ పరీక్షలు, చికిత్స సేవలను సులభతరం చేయాలి. రోగ నిర్ధారణ గ్యాప్‌ను తగ్గించడానికి చురుకైన వ్యాధి గుర్తింపు విధానాలు అనుసరించాలి. టీబీ రోగుల కుటుంబ సభ్యులకు, సమీప ప్రాంతాలకు ముందస్తు నివారణ చర్యలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. డ్రగ్ రెసిస్టెన్స్ పరీక్షలు, చికిత్సలను మరింత విస్తృతం చేయాలి. సంఖ్యాపరమైన పురోగతిపైనే కాకుండా టీబీ రోగుల మరణాలను మరింతగా తగ్గించడానికి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉండేలా కార్యాచరణ అమలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సూచిస్తున్నారు.










Comments