ఆగ్రహావళికి తలొగ్గిన కేంద్రం
- DV RAMANA

- Dec 26, 2025
- 2 min read

తమకు కావాలనుకున్నప్పుడు పరిమితులు, పరిధులు మార్చేయడం ప్రభుత్వాలకు కొత్త కాదు. నిబంధనలు సడలించడం, అంతేవాసులకు అగ్రాసనం వేయడం ఇటీవలి కాలంలో మితిమీరిపోయింది. కోర్టులు అభ్యంతరం చెప్పినా.. వేరే మార్గాల్లో తాము అనుకున్నది సాధించుకోవడం ప్రభుత్వాలకు కరతలామలకం. కానీ అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించునేలా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఒక వ్యతిరేకత చేయగలగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎన్ని అభ్యంతరాలు ఎదైనా లెక్కచేయకుండా తాను అనుకున్నది చేసేస్తుందని పేరుపొందింది. కానీ ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ విషయంలో తొలిసారి ప్రజాగ్రహానికి తలొగ్గింది. దేశానికి పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో సమున్నతంగా నిలబడి వాతావరణపరంగా, రక్షణపరంగా పెట్టని కోటల్లో ఉన్న ఆరావళి పర్వత శ్రేణిని మైనింగ్ మాఫియాకు ధారాదత్తం చేసే కుట్రను విశాల ప్రజాందోళన ఛేదించింది. కేంద్రం మెడలు వంచి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసింది. ఆరావళి పర్వత శ్రేణి హిమాలయాలకంటే పురాతనమైన ప్రకృతి సంపద. 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఆవిర్భవించినట్లు చరిత్ర చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆ ప్రకృతి సంపద ప్రమాదంలో పడటాన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తట్టుకోలేకపోయారు. సేవ్ ఆరావళి అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో కేంద్రం దిగిరాకతప్పలేదు. హిమాలయాలు, తూర్పు కనుమలు, హిందూకుష్ పర్వతాల మాదిరిగా ఆరావళి పర్వతాలు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢల్లీి వరకు విస్తరించి భారత్ రక్షణగా పెట్టని గోడలా ఉన్నాయి. ఈ పర్వతశ్రేణి లేకుంటే ఉత్తర భారతదేశం ఏడారిలా మారిపోయి ఉండేది. ఇప్పుడు అవి డేంజర్ జోన్‌లో పడటంతో రాజస్తాన్‌లో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన వాయిస్‌ను బలంగా వినిపిస్తోంది. పటిష్టమైన ఆరావళి పర్వతాల్లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా మైనింగ్ జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా కేంద్రం తన వాదనలతో మాయలో పడేసి అనుకూల నిర్ణయం వెలువడేలా చేసింది. ఆరావళి పర్వతాలకు నిర్వచనాన్నే కేంద్రం మార్చేసింది. దాన్నే సుప్రీంకోర్టు అంగీకరించింది. వంద మీటర్ల(328 అడుగులు) ఎత్తు వరకు ఉన్న కొండ గుట్టలను ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. ఆ వాదనను అంగీకరిస్తున్నట్లు 2025 నవంబర్ 20న సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే పర్వత శ్రేణి స్వరూపాన్ని మార్చడానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కేంద్రం వాదన, సుప్రీంకోర్టు నిర్ణయంతో పర్యావరణవేత్తలు విభేదిస్తున్నారు. వారి వాదన ప్రకారం ఆరావళి పర్వతశ్రేణులు భారతదేశానికి సహజ రక్షణ కవచాలు. పర్యావరణ చట్టాల ప్రకారం ఈ శ్రేణిలోని వంద మీటర్లకు ఎగువన ఉన్న పర్వతాలు అసలు టచ్ చేయకూడని నిషేధిత జోన్‌లో ఉన్నాయి. అలాగే 20 మీటర్ల నుంచి 100 మీటర్ల రేంజ్‌లో ఉన్న గుట్టలు సున్నితమైన జోన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం పర్యావరణపరంగా నేరమని, వీటిని పరిరక్షించే విషయంలో రాజీ పడేదిలేదని ఆరావళి పరిరక్షణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి నవోదయ జనకల్యాణ్ వంటి పార్టీలు, ప్రజాసంఘాలు స్పష్టం చేశాయి. దీనికి విరుద్ధంగా సుప్రీంకోర్టు భాష్యం చెప్పడం ఉద్యమకారుల్లో మరింత పట్టుదల పెంచి ఉద్యమం ఉధృతరూపం దాల్చేలా చేసింది. ఇప్పటికే ఢల్లీి పొగమంచు, కాలుష్యం బారిన పడి విలవిల్లాడుతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే ఆరావళిని అంతం చేయాలనుకోవడం దారణమని అంటూ రాజస్థాన్, ఢల్లీి వంటి రాష్ట్రాల్లో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలిపారు. మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున గళమెత్తారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం నిరసనకారులతో గొంతు కలిపింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మైనింగ్, అక్రమ కట్టడాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది.. మైనింగ్‌తో వచ్చే ధూళితో ఎడారి రాష్ట్ర రాజస్థాన్ మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఇది క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఉత్తర భారతదేశమంతటా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేశారు. ఆరావళి పర్వతాల్లో అరుదైన ఖనిజాలు వనరులు ఉన్నాయి. వాటికోసం ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తవ్వకాలకు కూడా అనుమతిస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుంది. మొత్తంగా ఇది పర్యావరణానికి మరణశాసనమేనని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ కేంద్రాన్ని హెచ్చరించారు. అయితే కేంద్రం వాదన మరోలా ఉంది. ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న ఆరోపణలను ఖండిరచింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19 శాతం పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు విధించిన కఠినమైన షరతుల ప్రకారమే మైనింగ్ లీజులు ఇస్తామని, ఢల్లీి ప్రాంతంలో మైనింగ్‌పై పూర్తి నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్‌లోని థార్ ఎడారి గాలిని, ఇసుకను తూర్పు వైపు (ఢల్లీి, హర్యానా, పంజాబ్ వైపు) రాకుండా ఒక సహజ గోడలా అడ్డుకుంటున్నాయి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం ఇసుక మేటలతో ఎడారిగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనతో కూడిన ప్రజాగ్రహానికి కేంద్రం తలవంచక తప్పలేదు.










Comments