ఆధార్ మార్చి.. అందరినీ ఏమార్చి..!
- BAGADI NARAYANARAO

- Jun 27, 2025
- 3 min read
సొంతదారుకు తెలియకుండా స్థలాన్ని అమ్మేశారు
అనపర్తికి చెందిన వ్యక్తి ఆధార్ ఇతని పేరుతో ట్యాంపర్
దాన్ని చూపించి అక్రమంగా స్థలం రిజిస్ట్రేషన్
విషయం తెలిసి జేసీకి స్థల యజమాని ఫిర్యాదు
దాంతో కుట్రంతా బట్టబయలు.. కొనసాగుతున్న విచారణ
అజంతా లే అవుట్‌లో ఇటువంటి వివాదాలు ఎన్నో

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
స్థలం యజమాని ఒకరు.. చూపించిన ఆధార్ వేరొకరిది.. ఆధార్‌లో జత చేసిన ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరివి.. రిజిస్ట్రేషన్ జరిగింది మరోచోట. ఇన్ని మాయలు చేసి.. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని ఒక స్థలాన్ని అమ్మేసి దాన్ని ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాయంలో రిజిస్టర్ చేయించేశారు. దానికి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడేసుకున్నారు. తన స్థలాన్ని కాజేశారని ఆలస్యంగా గుర్తించిన అసలు యజమాని లబోదిబోమంటూ పరిగెత్తుకుంటూ వచ్చి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో భూకబ్జా కాండకు చెందిన డొంకంతా కదిలింది. అంతే జేసీ ఆదేశాలతో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కార్యకలాపాలపై వేటు పడిరది.
ఒడిశా రాష్ట్రంలో నివాసం ఉంటున్న పువ్వాడ సన్యాసిరావు అనే వ్యక్తి జనవరి నెలలో శ్రీకాకుళానికి వచ్చి జేసీని కలసి తన స్థలాన్ని ఆక్రమించి అమ్మేశారని ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన అనుసూరి వెంకటరమణను స్థల యజమానిగా చూపించి శ్రీకాకుళం బలగలో నివాసం ఉంటున్న వాకలవలసకు చెందిన తారకేశ్వరరావు తన పేరుతో 2024 జూలై 4న డాక్యుమెంట్ నెంబర్ 4962/2024 ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్వయంగా విచారణ జరిపిన జేసీ ఫర్మాన్ ఖాన్.. జిల్లా రిజిస్ట్రార్, ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్, ఆరోపణలు ఎదుర్కొంటున్న తారకేశ్వరరావు, బాధితుడు సన్యాసిరావు తదితరులను పిలిపించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. దాన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌గా తేల్చారు. తక్షణమే వాకలవలస వద్ద వేసి అజంతా లే అవుట్‌లో లావాదేవీలు నిలిపేయాలని ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ పాటు జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆధార్‌ను ట్యాంపరింగ్ చేయడాన్ని తీవ్రంగా నేరంగా పరిగణించి, బాధితుడు సన్యాసిరావు ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేయించారు. ఆ మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడు తారకేశ్వరరావును పిలిపించి విచారించగా అసలు యజమాని ఎవరో తెలియదని తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే జేసీ, పోలీసులు చేసిన హెచ్చరికలతో దిగివచ్చి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవడానికి అంగీకరించాడు. దీంతో రిజిస్ట్రేషన్ రద్దుకు జేసీ ఆదేశాలు జారీచేశారు. అయితే విక్రేత, కొనుగోలుదారుడు ఇద్దరూ ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి వీలు కాదని తెలియడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి డిక్రీ పొందాలని బాధితుడికి జేసీ సూచించినట్టు తెలిసింది. ఆ మేరకు బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
మోసం జరిగిందిలా..
వాకలవలసలో శ్రీకాకుళానికి చెందిన నటుకుల వెంకట విఠల్ నేతాజీ 1996లో ఉడా అప్రూవల్‌తో అజంతా రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో లే అవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లు అమ్మకానికి పెట్టారు. ఈ వెంచర్‌లో సర్వే నెంబర్ 32/5,7లలో 231 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 202వ నెంబర్ ప్లాట్‌ను 1997 నవంబర్ 24న నెం.2804/1997 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా పువ్వాడ సన్యాసిరావు కొనుగోలు చేశారు. విజయనగరానికి చెందిన సన్యాసిరావు చాలా ఏళ్ల క్రితం కటక్‌లో స్థిరపడ్డారు. అందువల్ల ఆయన ఎలా ఉంటారో.. ఎక్కడ ఉంటారో ఇక్కడివారెవరికీ తెలియదు. ఇదే అదనుగా సన్యాసిరావు కొనుగోలు చేసిన ప్లాట్‌ను ఏదో విధంగా సొంతం చేసుకోవాలని కుట్ర పన్నారు. అందులో భాగంగానే అనపర్తికి చెందిన అనుసూరి వెంకటరమణకు చెందిన ఆధార్ నెంబర్‌కు పువ్వాడ సన్యాసిరావు వివరాలు జోడిరచారు. ఆధార్‌లో ఆనుసూరి వెంకటరమణ ఫోటో అలాగే ఉంచి పేరు, చిరునామాలను మాత్రం బాధితుడు సన్యాసిరావు వివరాలు చేర్చి ఆధార్ అప్‌డేట్ చేయించారు. దాన్నే చూపించి పువ్వాడ సన్యాసిరావే స్థలం అమ్ముతున్నట్లుగా రిజిస్ట్రేషన్ అధికారులను మాయ చేసి రిజిస్ట్రేషన్ చేయించేశారు. అని నమ్మించి స్థలాన్ని కొట్టేశారు. వాస్తవానికి కటక్‌లో ఉంటున్న బాధితుడు సన్యాసిరావు అక్కడే 2012 మార్చి 29న 6626 5179 5747 నెంబర్‌తో ఆధార్ కార్డు పొందాడు. కానీ రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆధార్ నెంబర్ 4439 1243 6933 అనపర్తికి చెందిన సన్యాసిరావుదని విచారణలో గుర్తించారు.
దాన్ని గుర్తించారు ఇలా..
అజంతా లే అవుట్‌లో అక్రమంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని తెలుసుకున్న బాధితుడు సన్యాసిరావు కుమారుడు ఆ లే అవుట్‌లో ఉన్న తమ స్థలానికి ఈ ఏడాది జనవరిలో ఈసీ తీయించగా అందులో వేరొకరి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. ఆమదాలవలస సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేల్ డీడ్‌కు చెందిన సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకుని పరిశీలించగా అందులో ఉన్న ఆధార్‌లో ఫోటో తేడా ఉండడంతో ఈ`ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేశారు. ఫోన్ నెంబర్‌తో సహా అన్ని వివరాలు మారిపోయినట్లు గుర్తించారు. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి అది అనపర్తికి చెందిన వెంకటరమణదిగా నిర్థారించారు. ఆయన్ని సంప్రదించగా, తాను ఇటీవల ఆధార్ ఆప్‌డేట్‌కి ఇచ్చినప్పుడు తన వివరాలు తప్పుగా నమోదైనట్లు తెలిసిందని చెప్పాడు. అలాగే వెంకటరమణ ఆధార్‌లో ఫింగర్ ప్రింట్స్ (బయోమెట్రిక్)ను కూడా వేరేవారివి జత చేసినట్టు తెలిసింది. వెంకటరమణ ఫోటోతో సన్యాసిరావు చిరునామాతో మూడో వ్యక్తికి చెందిన ఫింగర్ ప్రింట్స్‌తో ఉన్న ఆధార్‌ను తీసుకువచ్చి తారకేశ్వరరావుకు స్థలం విక్రయించినట్టు రిజిస్టర్ చేయించారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించాలని కోరుతూ బాధితుడు సన్యాసిరావు మార్చి 29న ఎస్పీకి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఒకటో పట్టణ సర్కిల్ కార్యాలయంలో కేసు నమోదైంది. ఆధార్ ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులు వాకలవలస, రాగోలుకు చెందినవారేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
60 ప్లాట్లపై వివాదాలు
అజంతా లే అవుట్‌లో 495 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో సుమారు 60 ప్లాట్లపై వివాదాలు ఉన్నాయి. పలు ప్లాట్లను అసలు యజమానులకు తెలియకుండా ఆధార్ ట్యాంపరింగ్ చేసి అమ్మేసినట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్నింటిని రాజీ మార్గం ద్వారా కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ఒకే ప్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలు చేసి ఉదంతాలు కూడా ఉన్నాయంటున్నారు. కొన్ని వివాదాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు కొంతకాలం ఫ్రీజ్ చేశారు. దీనిపై ఆ ప్రాంత రైతులు ఉన్నతాధికారులను కలిసి తాము నష్టపోతున్నామని విన్నవించడంతో మొదటి డాక్యుమెంట్‌లో ఉన్నవారే అసలైన పత్రాలు కలిగి ఉన్నవారిగా గుర్తించి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. 60 ప్లాట్లు వివాదాల్లో ఉన్నాయంటే ఈ లే అవుట్‌లో రియల్ బ్రోకర్ల ప్రమేయం ఏ మేరకు ఉందో అర్ధమవుతుంది. రాగోలు పరిధిలో ఉన్న దాదాపు అన్ని లే అవుట్స్‌లోనూ ఇదే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అక్రమాల్లో రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.










Comments