ఆమె దర్శనం దుర్లభం!
- BAGADI NARAYANARAO
- Aug 8
- 2 min read
ఏడాదిగా జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ
విజయనగరం డీఐజీకి అదనపు బాధ్యతలు
ఎప్పుడు వస్తారో సిబ్బందే చెప్పలేని దుస్థితి
ఫైల్స్, కార్యకలాపాలన్నీ పెండిరగ్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉంది. అంతకుముందు సుమారు ఏడాది క్రితం జిల్లా రిజిస్ట్రార్‌ను ఇక్కడినుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఆ స్థానాన్ని భర్తీ చేయకుండా విజయనగరంలో డీఐజీగా ఉన్న నాగలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ఆ మేరకు ప్రతి మంగళవారం ఆమె విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి విధులు నిర్వస్తున్నట్టు స్థానిక అధికారులు చెబుతున్నా నెలలో ఒకటి రెండు మంగళవారాల్లో మిగతా రోజుల్లో ఆమె అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మంగళవారం కాకుండా వేరే రోజుల్లో వస్తున్నారు. ఈ విషయం తెలియక జిల్లా రిజిస్ట్రార్‌తో పనులు ఉన్న ప్రజలు ఆమె కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డీఐజీ నాగలక్ష్మి ఇక్కడికి రాలేని రోజుల్లో శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్`1 సురేష్ ఇన్‌ఛార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్‌ఛార్జి హోదాలో ఆయనకు పరిమిత అధికారాలే ఉంటాయి. కొన్ని ఫైల్స్‌పై జిల్లా రిజిస్ట్రార్ మాత్రమే సంతకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అటువంటి అవసరాలు ఉన్న దరఖాస్తుదారులు ఆమె కోసం ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయని, జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణను గాలికొదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
భూమి, భవనాలు వంటి భారీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను పరిశీలించి నిర్థారించడం, నమోదు చేయడం వంటి పనులను జిల్లా రిజిస్ట్రారే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చట్టాల ప్రకారం నోటరీ, సొసైటీ, ట్రస్టు, ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఆడిట్‌లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్పాట్ తదితర విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా రిజిస్ట్రార్ పైనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చట్టాలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనే అధికారం జిల్లా రిజిస్ట్రార్‌కు ఉంటుంది. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరును పర్యవేక్షించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి ఉంటుంది. జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఒక్కో పనికి ఒక్కో అకౌంట్ ఉంటుంది. వీటన్నింటినీ రిజిస్ట్రార్ ప్రతిరోజూ పరిశీలించి నివేదికలు తయారుచేసి భద్రపరచాల్సి ఉంటుంది. అయితే ఎఫ్‌ఏసీ రిజిస్ట్రార్‌గా ఉన్న నాగలక్ష్మి ఇక్కడికి రాకుండానే ఈ పనులన్నింటినీ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందే చక్కబెట్టేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో చాలా ఫైల్స్ పెండిరగ్‌లో ఉండిపోతున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి పలుమార్లు వెళ్లినా ఎవరూ పెద్దగా స్పందించడం లేదని జిల్లా రిజిస్ట్రార్ ఎప్పుడు వస్తారో కచ్చితంగా చెప్పలేమని చేతులెత్తేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Comments