top of page

ఆయన ఆస్పత్రి వద్దన్నారు.. వీరు ‘మాల్‌’ ముద్దంటున్నారు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 9, 2025
  • 3 min read
  • నగరంలోని పోరంబోకు చెరువును కొట్టేసే ఎత్తుగడ

  • ఇతర అవసరాలకు నీటి వనరుల కేటాయింపు నిషేధం

  • ఆ కారణంతోనే గతంలో ఆస్పత్రి దరఖాస్తు తిరస్కరణ

  • కానీ షాపింగ్‌ మాల్‌కు కట్టబెట్టేందుకు మున్సిపల్‌ మంత్రాంగం

  • తెర వెనుక టీడీపీ పెద్దల హస్తమున్నట్లు ప్రచారం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇన్నాళ్లూ రెవెన్యూ అధికారులు ఏదోవిధంగా కాపాడుకుంటూ వస్తున్న రూ.కోట్లు విలువ చేసే చెరువు(పొరంబోకు)ను నగరపాలక సంస్థ అధికారులు ఒక మాల్‌ నిర్మాణదారులకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఇదే భూమిని వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని పీవీపీ అనే సంస్థ జిల్లా కలెక్టర్‌కు ఈ ఏడాది జూన్‌లో దరఖాస్తు చేసింది. దీన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని శ్రీకాకుళం తహసీల్దారును కలెక్టర్‌ ఆదేశించారు. సదరు భూమి రెవెన్యూ రికార్డులు, ఎస్‌ఎల్‌ఆర్‌ ప్రకారం పొరంబోకు చెరువుగా నమోదై ఉందని.. నిబంధనల ప్రకారం వాటర్‌ బాడీలు (నీటి వనరులు) ఉన్న భూములను ఇతర వినియోగానికి కేటాయించకూడదని తహసీల్దార్‌ ఇచ్చిన నివేదిక మేరకు గత నెలలోనే ఆస్పత్రి నిర్మాణ ప్రతిపాదనను కలెక్టర్‌ తిరస్కరించారు. ఆస్పత్రికి ఇవ్వడానికే తిరస్కరించిన భూమిని ఫక్తు వ్యాపార లక్ష్యంతో నిర్మించే మాల్‌కు కేటాయించాలని కోరుతూ ఇటీవలే మరో దరఖాస్తు అందగా.. వారికి ఎలాగైనా భూమిని ధారాదత్తం చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. టీడీపీకి చెందిన కొందరు పెద్దలు మంత్రాంగం నెరుపుతూ చెరువు చెరువు భూమిని కొట్టేయాలన్న ప్లాన్‌తోనే ప్రైవేట్‌ వ్యక్తులతో దరఖాస్తు చేయించినట్లు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కమర్షియల్‌గా అత్యంత విలువైన ప్రాంతంలో ఈ చెరువు భూమి ఉండటంతోపాటు ఒకేచోట ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమి అందుబాటులో ఉండటంతో దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పోరంబోకు చెరువుకు ఆయకట్టు లేకపోవడం, దాని చుట్టూ ఉన్న జిరాయితీ పొలాలు నివాస ప్రాంతాలుగా మారడం, అన్నింటికీ మించి అభివృద్ధి చెందుతున్న కొత్త బ్రిడ్జ్‌ (కిమ్స్‌) రోడ్డుకు ఆనుకుని ఉండడంతో అందరి దృష్టి ఈ భూమిపై పడిరది.

డీ పట్టాల దందాతో వెలుగులోకి

ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూ పరిధిలో కిమ్స్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్‌ 84లో 1.18 ఎకరాల విస్తీర్ణంలో పోరంబోకు చెరువు ఉంది. మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. కొన్ని దశాబ్దాల క్రితం కొత్త బ్రిడ్జ్‌ రోడ్డు నిర్మాణ సమయంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న చెరువు ఆ తర్వాత నామరూపాలు లేకుండా పోయింది. ఇదే అదనుగా పలుకుబడి కలిగిన సీపాన కృష్ణ (25 సెంట్లు), సీపాన అప్పారావు (25 సెంట్లు), సీపాన గడ్డెయ్య (15 సెంట్లు), కిల్లంశెట్టి సాంబమూర్తి (63 సెంట్లు) అనే వ్యక్తులు రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి డీ పట్టాలు మంజూరు చేయించుకున్నారు. కొన్నేళ్ల తర్వాత కిల్లంశెట్టి సాంబమూర్తి తన పేరిట ఉన్న డీ పట్టా భూమిని పీఎన్‌ కాలనీకి చెందిన మావూరి కుటుంబానికి విక్రయించేశారు. అయితే పట్టా మాత్రం మావూరి కుటుంబం పేరుతో కాకుండా ఫాజుల్‌బాగ్‌పేటకు చెందిన కనకం కామరాజు పేరుతో రాయించారు. తన చేతికి వచ్చిన చెరువు భూమి చుట్టూ కామరాజు ప్రహరీ గోడ కట్టించి మట్టి నింపి హద్దులు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వివాదం ంగడంతో డీ పట్టాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన రెవెన్యూ యంత్రాంగం పోరంబోకు చెరువులో ఎటువంటి నిర్మాణాలు జరపకూడదంటూ 2021లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే పొరంబోకు చెరువు తన స్వభావాన్ని కోల్పోవడం వల్లే అందులో డీ పట్టాలు మంజూరు చేశామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. అయితే నిబంధనల ప్రకారం సాగు కోసమే వినియోగించాల్సి ఉండగా చెరువు చుట్టూ ప్రహరీ కట్టి, మట్టి నింపి, నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుండంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు 2021లో రెవెన్యూ అధికారులు తెలిపారు. వాస్తవానికి పోరంబోకు చెరువులో డీ పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదని మరికొందరు రెవెన్యూ అధికారులు చెబుతుండగా, డీ పట్టాలు పొందిన నలుగురు ఒక్క రోజు కూడా ఆ భూమిలో వ్యవసాయం చేయలేదని స్థానికులు చెబుతున్నారు.

అంతా రెవెన్యూ చేతిలోనే..

కట్‌ చేస్తే.. ఇటీవల మళ్లీ ఆ చెరువు భూమిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు రావడంతో స్పందించిన తహసీల్దారు రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. ఆస్పత్రి నిర్మాణాలకు కూడా ఇవ్వకూడదని కలెక్టర్‌కు కూడా నివేదిక ఇచ్చారు. అయితే 1.18 ఎకరాల ప్రభుత్వ పోరంబోకును దక్కించుకోవడానికి షాపింగ్‌ మాల్‌ పేరుతో దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. జీవో 187 ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులు పంచాయతీ కార్యదర్శి, నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న చెరువులు కమిషనర్‌ పరిధిలో ఉంటాయి. అయితే వీటిని క్లాసిఫికేషన్‌ చేసి, హద్దులు నిర్ణయించాల్సింది మాత్రం రెవెన్యూ అధికారులే. అందువల్ల నగరపాలక సంస్థ అధికారులు చెరువును షాపింగ్‌ మాల్‌కు కేటాయించాలన్నా రెవెన్యూ అధికారులే క్లాసిఫికేషన్‌ ఇవ్వాలి. అలా ఇస్తే తప్ప ఈ వ్యవహారంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇప్పటికే వంద పడకల ఆస్పత్రి కోసం వచ్చిన లీజు దరఖాస్తును రెవెన్యూ అధికారులు నివేదిక మేరకు కలెక్టర్‌ తిరస్కరించారు. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ పెద్దల జోక్యం ఉన్నందున జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు డీ పట్టాలు పొందిన నలుగురు వ్యక్తులు భూములు చేజారిపోకుండా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page