ఆయనంటేనే భావోద్వేగం..!
- Prasad Satyam
- Jan 13
- 4 min read

‘అప్పలసూర్యనారాయణ ఈజ్ నథింగ్ బట్ ఏన్ ఎమోషన్..’ ఈ మాటన్నది నేను కాదు.. సాక్ష్యాత్తు తాను జీవితాంతం కొనసాగిన పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ అన్న మాటలివి. అప్పలసూర్యనారాయణ అంటేనే భావోద్వేగాల పుట్ట. ఆయన ప్రేమను, కోపాన్ని.. దేన్నీ దాచుకోలేరు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలుసు. కానీ తాను పిలిచి మరీ మంత్రి పదవి ఇస్తే.. ఓ చిన్న విషయానికి రాజీనామా చేసిన అప్పలసూర్యనారాయణను ఉద్దేశించి 1988లో ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యలివి. నిజమే.. అప్పలసూర్యనారాయణంటేనే భావోద్వేగం. 1988లో శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఒక వార్డుకు ఉపఎన్నిక జరిగినప్పుడు మంత్రిగా అప్పలసూర్యనారాయణ ఉన్నారు. కాంగ్రెస్ తరఫున బలగ గణపతి పట్నాయిక్ పోటీలో ఉండగా, టీడీపీ తరఫున బలగ ఆనందరావును బరిలో నిలిపారు. గణపతి పట్నాయిక్ తండ్రి చనిపోవడం వల్ల ఖాళీ ఏర్పడటంతో జరిగిన ఉపఎన్నికలో సహజంగానే గణపతి పట్నాయిక్ గెలిచారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పలసూర్యనారాయణ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తూ ఎన్టీఆర్‌కు లేఖ పంపారు. ఆ సందర్భంలో నథింగ్ బట్ ఎమోషన్ అనే పదాన్ని వాడారు. రైలుప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి కాలం గడిచిపోయి కలియుగ రాజకీయాలు నడిస్తున్న రోజులవి. కేవలం బైఎలక్షన్‌లో ఒక వార్డులో టీడీపీ ఓడిపోయినందుకు అప్పలసూర్యనారాయణ రాజీనామా చేయడాన్ని చూసి ఎన్టీఆర్ చలించిపోయారు. దేశంలో ఏ మూల ప్రజాస్వామ్యబద్ధంగా ఏం జరిగినా దానికి స్పందించడం, దానికి విరుద్ధంగా ఏం చేసినా నిర్ద్వందంగా ఖండిరచడం ఆయన భావోద్వేగంలో భాగమే. ఎన్టీఆర్ ఈ రాజీనామాను ఆమోదించలేదు. అది వేరే విషయం. ఏదో రాష్ట్రంలోని అంశంపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పలసూర్యనారాయణ ఇక్కడ ప్రెస్‌మీట్ పెడితే.. అందరూ నవ్వుకునేవారు. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యేగా ఆయన నిరంతరం మీడియాలో ఉండాలని చూస్తున్నారన్న భ్రమ అందరిలోనూ ఉండేది. కానీ ఒక ప్రజాస్వామ్య ప్రేమికుడిగా అన్ని విషయాల మీద స్పందించడాన్ని రానురాను అందరూ అర్థం చేసుకున్నారు. 2004 నుంచి 2014 సమయంలో ఆయన మాజీ అయిన తర్వాత కూడా ఎక్కడా నియోజకవర్గంలో అప్పటి కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పోరాటం ఆపలేదు. ఇందులో ఎర్రన్నాయుడు లాంటి నేతలు కలిసొస్తే.. అది ఉద్యమమైంది. లేదన్నప్పుడు అది అప్పలసూర్యనారాయణ పోరాటమైంది. తన వెనుక ఎవరు ఉన్నా, లేకపోయినా ఆయన మాత్రం చేయాలనుకున్నది, చెప్పాలనుకున్న విషయంలో మొహమాటపడేవారు కాదు. అవతలి వ్యక్తి ఎంతటివారైనా ఆయనకు అనవసరం. అప్పలసూర్యనారాయణ అనగానే నిజాయితీ, విలువల కోసం అందరూ మాట్లాడుతారు. అంతకు మించి ఆయన మహా మొండిమనిషి. విజయం తన ముంగిట్లో నిల్చుందని, కాస్త తలుపు తీస్తే లోనికి వస్తుందని తెలిసినా కూడా తన సిద్ధాంతాన్ని మార్చుకోనంతటి మొండిమనిషి. అప్పలసూర్యనారాయణ 2004 నాటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికే ఆయన మీద పార్టీ కేడర్‌లో అనేకమంది అలిగి ఉన్నారు. అదే ఎన్నికలో ధర్మాన ప్రసాదరావు గెలుపు కోసం టీడీపీలో ఉంటూనే దాదాపు 60 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు పని చేశారన్న విషయం అప్పలసూర్యనారాయణకు తెలుసు. కానీ, 2009 ఎన్నికల నాటికి సైతం ఆయన వారితో రాజీపడలేదు. వాస్తవానికి ఈ 60 మంది టీడీపీ సీనియర్లూ అప్పలసూర్యనారాయణను ఒకసారి ఓడిస్తే, వచ్చే ఎన్నికల నాటికి తాము చెప్పినట్టు వింటారన్న భావనతోనే 2004లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు. 2009 నాటికి అప్పలసూర్యనారాయణ తన కోసం పని చేయాలని పిలుపునిస్తారని వారు ఎదురుచూశారు. అయినా ఆయన ఓటమికైనా సిద్ధపడ్డారు గానీ, ఈ సీనియర్లను మాత్రం చేరదీయలేదు. గెలవడానికి దిగజారలేదు. ఇది నిజాయితీ కంటే, నిబద్ధత కంటే పెద్ద విషయం. జిల్లాకు టీడీపీ పెద్దగా మారిపోయిన ఎర్రన్నాయుడుతో శత్రుత్వం తనకు నష్టం కలిగిస్తుందని అప్పలసూర్యనారాయణకు తెలియక కాదు.. తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టలేక ఆయన చివరకంటూ నిలబడ్డారు. వాస్తవానికి ఎర్రన్నాయుడుకు, అప్పలసూర్యనారాయణకు మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవు. కానీ ఇంతింతై వటుడిరతై అన్నట్టు కింజరాపు ఎర్రన్నాయుడు ఢల్లీి వరకు ఎదిగిపోవడంతో జిల్లాలో ఆయనకు చెక్ పెట్టడానికి స్వయంగా ఆ పార్టీ అధిష్టానం వేసిన ఉచ్చులో అప్పలసూర్యనారాయణ చిక్కుకున్నారా..? అంటే అవుననే అప్పటి రాజకీయాలను ప్రత్యక్షంగా చూసినవారు చెబుతుంటారు. అప్పలసూర్యనారాయణను రెచ్చగొట్టి సీతారాంకు ఎక్సైజ్ వంటి పవర్‌ఫుల్ మంత్రిత్వ శాఖను ఇచ్చి ఎర్రన్నాయుడును బలహీనపర్చాలని స్వయంగా పార్టీయే చూసిందన్నవారు లేకపోలేదు. ఇందులో చివరకంటూ వచ్చేసరికి తన ముక్కుసూటితనం వల్ల అప్పలసూర్యనారాయణ నష్టపోయారు. అయితే జిల్లాలో బలమైన కింజరాపు కుటుంబాన్ని ఎదిరించడంలో ధీటైన వ్యక్తిగా నిలబడగలిగారు. ప్రస్తుతం గుండ, కింజరాపు అచ్చెన్నాయుడులది రెండు గ్రూపులని మనం చెప్పుకుంటున్నాం. వాస్తవానికి 1996లో ఉపఎన్నిక జరిగినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సూచన మేరకు అప్పలసూర్యనారాయణే ఇప్పటి మంత్రి అచ్చెన్నాయుడును టీడీపీ జనరల్ బాడీ సమావేశం పెట్టి పరిచయం చేశారు. ఆ తర్వాత 2014, 2024ల్లో అచ్చెన్నాయుడు మంత్రిగా పని చేయడం మనకు తెలుసు. 2014 ఎన్నికల్లో అప్పలసూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి ఎమ్మెల్యే అయినా, పార్టీ అధినేత చంద్రబాబును మాత్రం ఆయన ఏరోజూ కలవాలనుకోలేదు. చివరకు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వచ్చి అప్పలసూర్యనారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలిగిన అప్పలసూర్యనారాయణ ఇంటికి ముఖ్యమంత్రి దిగొచ్చారన్న ప్రచారం జరగకుండా అరసవల్లి టెంపుల్‌కు వచ్చినట్లు, అదే వీధిలో ఉన్న అప్పలసూర్యనారాయణ ఇంటికి వెళ్లినట్లు పార్టీ ప్రకటించుకుంది. కానీ అప్పల సూర్యనారాయణను బుజ్జగించడం కోసమే చంద్రబాబు వచ్చారన్న విషయం జిల్లా టీడీపీకి తెలుసు. 2019లో మళ్లీ గుండ అప్పలసూర్యనారాయణకే టిక్కెటివ్వాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. పార్టీ నుంచి ఎర్రన్నాయుడు, శివాజీ బయటకు వచ్చి ఇండిపెండెంట్లుగా గెలిచిన తర్వాత 1993లో జిల్లా అధ్యక్షుడిగా అప్పలసూర్యనారాయణే వీరిద్దరినీ చంద్రబాబు ద్వారా ఎన్టీఆర్‌ను ఒప్పించి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే దీన్ని ఎక్కడా చరిత్ర గుర్తించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాంతీయ పార్టీల్లో తక్కువ మంది ఉంటే, అందులో అప్పలసూర్యనారాయణ ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. సోమవారం ఆయన మరణించారని మీడియాలో వచ్చిన తర్వాత ఇన్నిసార్లు వరుసగా గెలిచిన అప్పలసూర్యనారాయణ ఎవరంటూ ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేశారు. అప్పలసూర్యనారాయణ ఇంటిలో నలుగురు కౌన్సిలర్లు అయ్యారు. తండ్రి గుండ శిమ్మన్న, తల్లి అప్పన్నమ్మ, భార్య లక్ష్మీదేవితో పాటు అప్పలసూర్యనారాయణ కూడా కౌన్సిలర్‌గా పని చేశారు. అలాగే శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఈ ఇంటి నుంచే ముగ్గురు వైస్‌చైర్మన్లయ్యారు. అందులో అప్పలసూర్యనారాయణతో పాటు ఆయన తండ్రి శిమ్మన్న, ఆయన భార్య లక్ష్మీదేవి ఉన్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి జరిగిన పరోక్ష ఎన్నికల్లో అప్పలసూర్యనారాయణ తెలుగు అప్పారావుపైన 1126 ఓట్లతో గెలుపొందారు. ఇది అప్పట్లో స్టేట్ రికార్డ్. ప్రతీ ఎన్నికలకు అప్పలసూర్యనారాయణ తన తండ్రి పంచిన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి రంగంలోకి దిగుతారని నియోజకవర్గంలో చెప్పుకుంటారు. కానీ అప్పలసూర్యనారాయణ తన కుటుంబంలో ఒక పెళ్లి విషయంలో తండ్రితో విభేదించడం వల్ల ఇప్పుడు జీటీ రోడ్డు నడిబొడ్డులో ఉన్న కోట్లు విలువ చేసే ఆస్తిని తండ్రి శిమ్మన్న కేవలం రూ.10వేలకు అమ్మేశారు. తనకు చెందాల్సిన ఆస్తి తండ్రి మాట విననందుకు అమ్మేస్తున్నా పెళ్లి విషయంలో ఇచ్చిన మాట కోసం అప్పలసూర్యనారాయణ కట్టుబడిపోయారు. ఇప్పుడదే జీటీ రోడ్డులో డాక్టర్ విశ్వనాధం హాస్పిటల్. అందుకేనేమో ‘సత్యం టీవీ’ ఇంటర్వ్యూలో బాధ్యత కాని విషయంలో బాధ్యత పడకూడదంటూ చెప్పుకొచ్చారు. 1948 జనవరి 16న అప్పలసూర్యనారాయణ పుట్టడం, ఆయన బాల్యం, రాజకీయ పదవులు అన్నీ ఇక్కడ అందరికీ తెలుసు. ఆయన చేసిన అభివృద్ధి పనుల కోసం నేటి ఉదయం పత్రికలు రాసుకొచ్చాయి. ఆజాత శత్రువుగా మిగిలిపోవాలని అప్పలసూర్యనారాయణ నిరంతరం భావించేవారు. అయితే ఆయన భావోద్వేగాలను మాత్రం ఆపుకోలేకపోయారు. నవ్వినా బిగ్గరగా ఉండేది. ఎవరినైనా తూర్పారబడితే అంతే పెద్ద గొంతుతో విరుచుకుపడేవారు. ఆ తర్వాత ఆయన చేసింది తప్పో ఒప్పో తెలుసుకోడానికి మాత్రం ప్రయత్నించేవారు. 1994లో అప్పలసూర్యనారాయణ మీద అంధవరపు వరహానరసింహం పోటీ చేస్తే, 1996 అక్టోబర్‌లో అదే వరంను పాతపట్నం ఉపఎన్నిక సందర్భంలో పార్టీలో చేర్చుకున్నారు. అప్పలసూర్యనారాయణ సై అంటేనే ఎర్రన్నాయుడు ఈ మంత్రాంగం నడపగలిగారు. వరం కూడా టీడీపీలోకి వచ్చేస్తే, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉండదని ఆయన భావించారు. కానీ వీరిద్దరూ చివరి వరకు సఖ్యంగా మాత్రం ఉండలేకపోయారు. 2024లో టీడీపీ ఆయన కుటుంబానికి టిక్కెటివ్వనప్పుడు వైకాపా నుంచి మంచి రాయభారమే ఆయనకు అందింది. కానీ, అందుకు ఆయన సమ్మతించలేదు. ఇండిపెండెంట్‌గా పోటీలో ఉందామంటూ కేడర్ ఒత్తిడి తెచ్చినా, ఓట్ల చీలిక ద్వారా వైకాపా లాభపడుతుందన్న భావనతో ఆయన దాన్నీ తిరస్కరించారు. అలా అని ఆయన తన ఆత్మాభిమాన్ని మాత్రం చంపుకోలేకపోయారు. తాను ఓటింగ్‌లో పాల్గోలేదని నిష్కర్షగా చెప్పిన నేత మరొకరుండరేమో?!










Comments