ఆయన వేగం.. ఈయనకు శరాఘాతం!
- Prasad Satyam
- Jan 10
- 3 min read
అంచనాలను అందుకోలేకపోతున్నారని కలెక్టర్ అసంతృప్తి
అదే మున్సిపల్ కమిషనర్ బదిలీకి కారణం
వీరిద్దరి మధ్య తొలినుంచీ కొనసాగుతున్న విభేదాలు
వాటిని సర్దుబాటు చేయలేక నలిగిపోయిన ఎమ్మెల్యే శంకర్
రథసప్తమి ముంగిట దుర్గాప్రసాద్ వెళ్లిపోవడం ఇబ్బందే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నది నానుడి. కానీ శ్రీకాకుళంలో ఆ పోరు తీర్చలేక లోకల్ ఎమ్మెల్యే గొండు శంకర్ నలిగిపోయారు. మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్ బదిలీ కావడం ఆశ్చర్యం కలిగించకపోయినా రథసప్తమి ఏర్పాట్లు ఒకపక్క జరుగుతున్న తరుణంలో వేరే చోట పోస్టింగ్ ఇవ్వడానికి ఖాళీ లేకపోయినా ఇక్కడి నుంచి తప్పించి మున్సిపల్ డైరెక్టరేట్‌లో రిపోర్టు చేయాలంటూ వచ్చిన ఉత్తర్వులే ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమయ్యాయి. కార్పొరేషన్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్ అంతకు ముందు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన చల్లా ఓబులేసు లేని లోటును బాగానే తీర్చగలిగారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గొండు శంకర్ వేగానికి తగినట్లు కాలంతో పోటీ పడుతూ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. కానీ ఎక్కడో కమిషనర్ దుర్గాప్రసాద్‌కు, కలెక్టర్ దినకర్ పుండ్కర్‌కు మధ్య మొదట్నుంచీ పొరపొచ్ఛాలు ఏర్పడ్డాయి. ఒకానొక సమయంలో కమిషనర్ తనకు చెప్పకుండా సెలవు పెట్టారంటూ ఆయన్ను మాతృశాఖకు సరెండర్ చేయాలని కలెక్టర్ భావించారు. అలాగే ఆయన విధుల్లో చేరుతున్నట్టు సంతకం పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ కమిషనర్ ఇక్కడే కొనసాగారు. ఉన్నంతలో బాగానే పని చేశారు. అయితే ఆయన వేగం తన అంచనాలను అందుకోలేకపోతోందని కలెక్టర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగని ఇక్కడ కలెక్టర్‌ను కూడా తప్పుపట్టక్కర్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్లతో రోజువారీ సమీక్షలు పెరిగిపోయాయి. ఈరోజు శంకుస్థాపన చేసిన పని మూడు రోజుల తర్వాత ఎలా ఉందని స్వయంగా అమరావతి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇందులో పురోగతి లేకపోతే నేరుగా కలెక్టర్లను బాధ్యులను చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ పరుగు పందెంలో వెనుకబడుతుండటం కలెక్టర్‌పై ప్రభావం చూపుతోంది.
అడుగడుగునా అడ్డంకులు
వాస్తవానికి శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ దగ్గర్నుంచి కమిషనర్ కుర్చీ వరకు అన్ని పనులు కమిషనరే పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో పనుల పురోగతిలో అనుకున్నంత వేగం లేదు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెక్షన్‌లో సిబ్బంది కొరత ఉంది. ఉన్నవారు కూడా రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉండటం, మిగిలినవారు దీర్ఘకాలిక సెలవులో ఉండటం వంటి కారణాల వల్ల ఈ విభాగం పనులను కూడా కమిషనరే చేస్తున్నారు. కొన్నాళ్లుగా మున్సిపల్ ఇంజినీర్ సెలవులో ఉన్నారు. ఆయన మళ్లీ ఇక్కడికి వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే.. కర్నూలులో ఉన్న ఎంఈని శ్రీకాకుళం తీసుకువచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినవారే ఇక్కడ విధుల్లో చేరడానికి, కొనసాగడానికి సుముఖత చూపించరు. అటువంటిది కర్నూలు నుంచి శ్రీకాకుళం అనగానే ఎంఈ సెలవు పెట్టేశారు. సాధారణంగా కమిషనర్‌కు బదిలీ అయితే ఎంఈకి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడ డీఈ కమలాకర్‌కు ఇచ్చారంటే ఎంఈ లేరని, రారని అర్థమవుతుంది. డీఈ కమలాకర్ కూడా ఇన్‌ఛార్జి ఎంఈగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఇన్‌ఛార్జి కమిషనర్ పోస్టు ఆయనకు అదనం. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారు కలెక్టర్ లేదా ప్రజాప్రతినిధులు చెప్పే పనులు ప్రారంభిస్తే, ఆ తర్వాత విజిలెన్స్ కేసులో ఇరుక్కుంటే పెన్షన్లు రాక, కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడతామని భావించి ఏ పనినీ పూర్తిచేయడానికి గానీ, అంచనాలు రూపొందించడానికి గానీ ఇష్టపడటంలేదు. దీంతో మొన్నటి వరకు నగరంలో 38 కొత్త పనులు శంకుస్థాపన లేకుండా నిలిపేశారు. ఈ పనులకే మున్సిపల్ కాంట్రాక్టర్లు లాభాలు రావంటూ టెండర్లు వేయలేదు. వీటన్నింటినీ అధిగమించి వేరేవారితో పాత రేట్లకే ఎమ్మెల్యే టెండర్లు ఖరారు చేయించినా, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు మాత్రం దీని మీద ఫిర్యాదు చేస్తారన్న భయంతో అడుగు ముందుకు వేయలేదు. దీంతో మళ్లీ కమిషనర్ దుర్గాప్రసాదే ఈ బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు.
ఎవరొస్తారో మరి..
శ్రీకాకుళం వచ్చిన కొద్ది రోజులకే కమిషనర్‌కు ఇక్కడి పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఎమ్మెల్యే గొండు శంకర్ తనకు తెలియకుండా బదిలీ ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వంతో మాట్లాడి నిలుపుదల చేయిస్తానని చెప్పడంతో కమిషనర్ ఏదో ఒకరోజు తన సొంత జిల్లా విజయనగరం మున్సిపల్ కమిషనర్‌గా వెళ్లిపోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు. కానీ రథసప్తమి వల్ల ఆయన్ను రిలీవ్ చేయడానికి ఎమ్మెల్యే ఇష్టపడలేదు. ఈలోగా విజయనగరం కమిషనర్ పోస్టును వేరేవారితో భర్తీ చేసేశారు. దీంతో దుర్గాప్రసాద్‌కు విజయనగరం పోస్టింగ్ తప్పిపోయింది. అందుకే మున్సిపల్ డైరెక్టరేట్‌కు రిపోర్టు చేయమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెనాలిలో కమిషనర్‌గా పనిచేస్తున్న రాజాం ప్రాంతానికి చెందిన ఉద్యోగి శ్రీకాకుళం కమిషనర్‌గా రావడానికి తొలుత ప్రయత్నించారు. దుర్గాప్రసాద్ కంటే ఆయన ఏ విధంగానూ మెరుగు కాదని భావించి ఎమ్మెల్యే నిరాకరించారు. ఆ తర్వాత ఆమదాలవలస కమిషనర్‌గా పని చేసిన మరో వ్యక్తి కూడా ట్రై చేశారు. కాకపోతే ఆయనకు సర్వీసు రెండేళ్లే ఉండటంతో కాదనాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త కమిషనర్‌గా ఎవరిని తేవాలో ఎమ్మెల్యే తేల్చుకోలేదు. కమిషనర్‌గా ఎక్కడికి పోస్టింగ్ అడగాలో దుర్గాప్రసాద్‌కు తెలియడంలేదు. కమిషనర్ పోస్టంటే అంత సులువు కాదు. శానిటేషన్ నుంచి ఇంజినీరింగ్ పనుల వరకు అన్నింటిపైన అవగాహన ఉండాలి. శ్రీకాకుళం కలెక్టర్‌గా పని చేస్తున్న స్వప్నిల్ దినకర్ అంతకు క్రితం విజయవాడ కమిషనర్‌గా చేశారు. కాబట్టి అంతే వేగంగా పనులు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ శ్రీకాకుళంలో పని చేయడానికి అసలు ఉద్యోగులే రారన్న ప్రాక్టికాలిటీ ఆయనకు తెలియదు. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధిపై కలెక్టర్‌కు అవగాహన ఉంది. కానీ అవన్నీ ఒక్క కమిషనరే చేయాలంటే కుదిరే పని కాదు. ఈ ఏడాది రథసప్తమిని ఏడురోజుల పాటు నిర్వహిస్తుండటంతో కమిషనర్ పాత్ర కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో ఆయన వెళ్లిపోవడం ఇబ్బందే.










Comments