ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
- Prasad Satyam
- Nov 14
- 5 min read
మాస్ బేస్‌లోకి ధర్మాన
కేడర్‌కు కళ్లు తెరిపించిన శంకర్
అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం
చాపకింద నీరులా పేరాడ వ్యూహం
చావో రేవో తేల్చుకోనున్న పిరియా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు రాకపోతే తన శైలి ఏమిటో కేడర్‌కు చూపించాలన్న గొండు శంకర్ ఆగ్రహం ఒకే సమయంలో బయటపడ్డాయి. అదే స్థాయిలో పలాసలో ఉప్పు, నిప్పులా ఉండే మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, సిటింగ్ ఎమ్మెల్యే గౌతు శిరీషల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, తెర వెనుక రెండు పార్టీల కేడర్ కలిసే వ్యాపారాలు చేస్తున్నాయని జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా అప్పలరాజు మీద 10 కేసులు నమోదు కావడం, అదే సమయంలో ఎమ్మెల్యే శిరీష నియోజకవర్గంలోనే ఇప్పుడు ఎక్కువ సమయం గడపడం ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ మూడుసార్లు ఎమ్మెల్యే అయినా సగటు మౌలిక సదుపాయాల కల్పనలో ఏమాత్రం ముందడుగు లేదని వైకాపా శ్రేణులు రోడ్డెక్కడం, సిట్టింగ్ వైకాపా ఇన్‌ఛార్జి పిరియా విజయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సోంపేట కేడర్ ప్రకటించడం, అది సరికాదని, ఆమె నాయకత్వంలోనే పని చేస్తామని పెద్ద ఎత్తున మద్దతు రావడం, టెక్కలిలో వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ ఆర్థిక మూలాల మీద మంత్రి అచ్చెన్నాయుడు దెబ్బ కొట్టడం, అదే సమయంలో గతంలో ఇన్‌ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీను కంటే తిలక్ తెలివిగా కింజరాపు కుటుంబాన్ని జనంలో పలుచన చేయడం వంటి వ్యవహారాలు ఒకే సమయంలో ఊపందుకున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా మూడేళ్లు పైబడి సమయం ఉంది. పోనీ స్థానిక ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్షాలు అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నాయా.. అంటే జగన్మోహన్‌రెడ్డి మాదిరిగానే స్థానిక పోటీలో వైకాపా తరఫున పోటీకి నిలబడేవారు లేకుండా టీడీపీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ దూకుడు ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తకమానదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్న సమయంలో ప్రజల నాడి ఏమిటో ఇప్పుడిప్పుడే వైకాపాకు అర్థమవుతుంది. అందుకేనేమో ధర్మాన ప్రసాదరావు రెండేళ్ల వరకు వేచిచూడాలని అప్పట్లో జగన్మోహన్‌రెడ్డికి కూడా చెప్పారు. కానీ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో అన్నిటికంటే ఎక్కువ విజయవంతమైంది పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా వైకాపా చేసిన ర్యాలీయే. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్‌రెడ్డి మాదిరిగానే సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సామాజిక భద్రతా పింఛన్లు మూడు వేలు నుంచి నాలుగు వేలకు పెంచినా, తల్లికి వందనం ఇంటిలో అర్హులైన పిల్లలందరికీ ఇచ్చినా, సంక్షేమ పథకాల అమలుతీరు మీద సగం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని తేలింది. రెండేళ్ల లోపే ప్రభుత్వ గ్రాఫ్ సగం పడిపోతే, మిగిలిన మూడేళ్లు ఎలా ఉంటుందోనన్న భయం ప్రభుత్వానికి ఎంత ఉందో తెలియదుగానీ, కచ్చితంగా ఇది వైకాపాకు అడ్వాంటేజ్ అవుతుందని ఆ పార్టీ భావిస్తుంది. బహుశా అందుకేనేమో అన్నిచోట్లా వైకాపా దూసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో సాఫ్ట్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరు ధర్మాన. ఎన్నిసార్లు గెలిచినా, మంత్రిగా సుదీర్ఘకాలం పని చేసినా, ప్రత్యర్ధి పార్టీ వ్యక్తుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టినట్లు గానీ, అధికారులను హెరాస్ చేసినట్లు గాని, కనీసం దురుసుగా మాట్లాడినట్టు గాని రికార్డులు లేవు. కానీ మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పోలీసులు ఆయన రౌద్రాన్ని చూశారు. అప్పుడెప్పుడో పోలాకి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎస్పీ బంగ్లా ముందు ధర్నాకు కూర్చున్న ధర్మానను బహుశా ఈ జనరేషన్ చూసివుండదు. డీసీసీ కార్యాలయానికి తాళం వేసివుంటే తుపాకీతో వెళ్లిన ధర్మాన కోసం చదవడమే తప్ప చూసిన జనరేషన్ కాదిది. అటువంటి ధర్మాన ఇప్పుడు పూర్తి సాఫ్ట్ పాలిటిక్స్‌కు కేంద్రబింధువుగా మారారు. అటువంటిది తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించిన తీరుపై ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 300 మీటర్లు నడిచినందుకు పోలీసులు రోప్ పార్టీని పెట్టి కార్యకర్తల్లో, నాయకుల్లో వయసుడిగినవారిని కూడా చూడకుండా ఆటోల్లోకి విసిరేసిన విధానాన్ని ధర్మాన నడిరోడ్డు మీదే నిలదీశారు. ఏం చేసినా తగ్గేదే లే అనే సంకేతాన్ని ఇచ్చారు. దీంతో ధర్మాన తనయుడి దగ్గరకు వెళ్లి 50 మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగతావారిని ఈడ్చేస్తామని చెబితే, ఎటువంటి కేసులకైనా భయపడేది లేదని, ర్యాలీ చేసే తీరుతామని ఓపెన్‌గానే చెప్పారు. అయినా పోలీసుల మీద ప్రభుత్వం ఒత్తిడి, ర్యాలీ విజయవంతమైందని ఇంటెలిజెన్సీ రిపోర్టు ఇస్తే తమ పని పడతారన్న భయంతో పోలీసులు అత్యుత్సాహం చూపిన మాట వాస్తవం. అయితే దీన్ని ధర్మాన నేతృత్వంలో కేడర్ ఖాతరు చేయలేదు. కార్యక్రమానికి ముందు వైకాపా శ్రేణులు డే అండ్ నైట్ జంక్షన్‌కు చేరుకున్నప్పుడే వారెవరూ ఒకడుగు ముందుకు వేయకుండా రోప్ పార్టీ బంధించింది. ఎప్పుడైతే ధర్మాన కారు దిగారో.. జై ధర్మాన అంటూ ఉరకలేసుకుంటూ లేచిన కార్యకర్తలను పోలీసులు ఆపలేకపోయారు. ఆ ప్రస్టేషన్‌లో ధర్మాన వెంట నడుస్తున్నవారిని వెనుక నుంచి లాగేసి ఆటోల్లో తరలించుకుపోయే ప్లాన్ చేశారు. ఆ సందర్భంలోనే ధర్మానకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో ఆయన పట్టును నిరూపించే సన్నివేశమిది.
సరిగ్గా రెండు రోజుల తేడాలో టీడీపీ కార్యాలయం సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పార్టీలో వెన్నుపోటు నాయకుల వలువలు ఊడదీశారు. తనతో పని చేయాలంటే మనసా, వాచా, కర్మనా తనతోనే ఉండాలని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తాను ఈ ఐదేళ్లు ఇక్కడ ఎమ్మెల్యేనని, తన కార్యాలయంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని, తన ఇద్దరు పీఏల పేర్లు ప్రకటించి, వారు స్పందించకపోతే తనకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఎవరికో ఫోన్ చేసి ఎమ్మెల్యే పలకలేదనడం సరికాదని పెద్ద ఎత్తున అసంతృప్త నాయకులను ఉతికి ఆరేశారు. వాస్తవానికి శంకర్ ఒక సర్పంచ్‌గా వచ్చి, గుండ కుటుంబ అనుచరుడిగా ఉంటూ ఎమ్మెల్యే కావడాన్ని చాలామంది ఇప్పటికీ చులకనగా తీసుకుంటున్నారు. అసలు ఎమ్మెల్యే ప్రోటోకాల్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వచ్చేసారి శంకర్‌కు టిక్కెటివ్వరన్న ప్రచారం చేస్తున్నారు. ఇచ్చినా గెలవరని ఆ పార్టీ కేడరే చెప్పుకు తిరుగుతోంది. వీటన్నిటికీ పుల్‌స్టాప్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఇంట్లో కూర్చోనని, పార్టీ టిక్కెటిచ్టిన అభ్యర్థి కోసం త్రికరణశుద్ధిగా పని చేస్తానని, అంతవరకు తాను ఎమ్మెల్యేను కాబట్టి, తనకోసం అలాగే పని చేయాలని కోరారు. నియోజకవర్గంలో రెండు మండలాలు, ఒక నగరం పార్టీ కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న చోట కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసుకోవాలని పిలుపునిస్తే సరిపోతుంది. కానీ అంత దూడుకుగా, ఓపెన్‌గా మాట్లాడటం వెనుక ఎన్నికలకు ముందు నుంచీ గొండు శంకర్ పడుతున్న ఆవేదన ఉంది. ఎదుర్కొన్న వివక్ష ఉంది. ఆమధ్య ప్రతీ రెండు డివిజన్ల కేడర్‌తోనూ మాట్లాడాలని పార్టీ నిర్దేశిస్తే ఎమ్మెల్యే పిలుపును అందుకొని కొందరు అసలు స్పందించలేదు. నగరంలో తెలుగుదేశం కార్యవర్గాన్ని నియమించడానికి సమావేశాన్ని అనేకసార్లు నిర్వహిస్తే అనేకమంది సీనియర్లు అనేకసార్లు ముఖం చాటేశారు. చిన్న, చితక నామినేటెడ్ పదవుల భర్తీకి ఎమ్మెల్యే పేర్లు ఇస్తే.. దాన్ని గౌరవించిన పాపాన పోనివారే చాలామంది ఉన్నారు. ఇలాంటి అనేక అవమానాలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే ఇన్నాళ్లకు తనకు సరైన వేదిక దొరికిందని భావించివుంటారు. వచ్చే ఎన్నికల కోసం తాను పట్టించుకోవడంలేదని, ఈ టెన్యూర్ మాత్రం తనతో ఉండకపోతే మర్యాదగా ఉండదని ఒక విధంగా హెచ్చరికే పంపించారు. ఇది శంకర్ వ్యతిరేక వర్గం కళ్ల నుంచి రక్తం కారేటట్టు చేసింది. ఇకనుంచి వెన్నుపోటు వైపు వెళ్తే.. తమకు పోటు తప్పదని వీరికి అర్థమైపోయింది. వాస్తవానికి ఇంతవరకు శంకర్ తీసుకున్న ఏ చర్యా, చేపట్టిన ఏ పనీ వ్యూహాత్మకంగానో, ఎత్తుగడలో భాగంగానో చేయలేదు. మరీ ముఖ్యంగా మరో మూడు ఎన్నికల వరకు తానే ఎమ్మెల్యేగా ఉండాలన్న దిశగా అడుగులు వేయలేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం తప్ప, వారు ఏ పార్టీవారు, ఏ గ్రూపునకు చెందినవారని కూడా చూడలేదు. కానీ జిల్లాలో ఏ టీడీపీ నాయకుడి మీద లేనంత వ్యతిరేక ప్రచారం శంకర్ మీద ఉంది. బహుశా ఈ ఫీడ్‌బ్యాక్‌తోనే ఆయన గురువారం చెలరేగిపోయినట్టున్నారు. ధర్మాన శ్రీకాకుళంలో యాక్టివ్ అయి కేడర్‌కు బలమైన సంకేతం ఇచ్చినట్టే, శంకర్ కూడా ముసుగు తీసేసి మల్లయుద్ధానికి దిగిపోయారు. ఇక జరగబోయేది యుద్ధమే.
పలాస నియోజకవర్గంలో డాక్టర్ అప్పలరాజు ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి బలమైన ప్రతిపక్షంగానే నిలబడ్డారు. కార్యకర్తల కోసం తాను ముందుంటానని నిరూపించడంలో భాగంగా ఇప్పుడు దాదాపు 10 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాలో గౌతు శిరీషకు సెకండ్ హయ్యస్ట్ మెజార్టీ వచ్చింది. దాన్ని కాదని 2029 ఎన్నికల్లో అప్పలరాజు గెలవడం చిన్నవిషయం కాదని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆయన మైలేజ్ పెంచే పనులకు టీడీపీ అవకాశం ఇచ్చింది. 2024 ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రస్థాయి అంశంపై కూడా అప్పలరాజు ఇక్కడి నుంచి స్పందించేవారు. ఆ కోణంలో చూసుకుంటే పబ్లిసిటీలో రెండు ప్రధాన పత్రికలున్న గౌతు శిరీష కంటే సాక్షి మాత్రమే అందుబాటులో ఉన్న అప్పలరాజు నిరంతరం వార్తల్లో వ్యక్తి అయ్యారు. కాశీబుగ్గ వేంకటేశ్వర దేవాలయం అంశంలో అప్పలరాజును పోలీసులు ప్రశ్నించడం అనవసర చర్య. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి పెట్టీ కేసుల కోసం సమయాన్ని వృథా చేయడం అనవసరం. అయితే గౌతు శిరీషకు కూడా అప్పలరాజు మీద కేసులు పార్టీకి వ్యతిరేకమవుతున్నాయన్న విషయం అర్థమైనట్టుంది. ఆమె గతంలో కంటే నియోజకవర్గంలో ఎక్కువ సమయం ఉంటున్నారు. అలా అని అప్పలరాజును బంధించి ఉంచకపోతే వైకాపాను బలంగా నియోజకవర్గంలో నడిపిస్తారన్న భయం కూడా ఆ పార్టీలో ఉంది. కానీ విచిత్రంగా ఇక్కడ రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి వ్యాపారాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇది ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలకు తెలుసని కూడా చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు ఈ కక్షలను రాజకీయ కోణంలో చూడాలా? వ్యక్తిగత కోణంలో విశ్లేషించాలో తెలియని పరిస్థితి. టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు కుంటుంబానికి వ్యతిరేకంగా ఇన్నాళ్లూ దువ్వాడ శ్రీనివాస్ పని చేస్తూ వచ్చారు. ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కొట్టుకుందాం రమ్మంటూ పిలుపునివ్వడం మినహా అక్కడ పార్టీ గెలవడానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ శైలికి పేరాడ తిలక్ పూర్తిగా భిన్నం. ఆ విషయం రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుకు కూడా తెలుసు. వైకాపాను చాపకింద నీరులా తిలక్ విస్తరిస్తారని భావించడం వల్లే ఆయన ఆర్థిక మూలాలపై ఈ ప్రభుత్వం దెబ్బకొట్టింది. ప్రస్తుతం సొంత వాహనంలో డీజిల్ వేయించుకోడానికి కూడా కష్టంగా ఉన్నా తిలక్ మాత్రం అచ్చెన్నాయుడును, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపారాలను, వ్యవహారాలను బయటపెట్టడంలో ఎక్కడా తగ్గడంలేదు. ఆమధ్య బాబు ఆరు గ్యారెంటీలు కింజరాపు కుటుంబానికే వచ్చాయంటూ సోదహరణంగా ప్రెస్‌మీట్ పెట్టారు. అంతకు ముందు క్రషర్లు, గ్రానైట్లు, అందులో కింజరాపు కుటుంబ పాత్ర కోసం ఎస్టాబ్లిష్ చేశారు. మొదటి రెండేళ్లకే ఇలా ఉంటే.. ఎన్నికల ఏడాది ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
ఇచ్ఛాపురంలో సిటింగ్ ఎమ్మెల్యేకు మూడు పర్యాయాలు అవకాశమిచ్చారు కాబట్టి.. ఈసారి వైకాపా గెలుపు ఖాయమన్న టాక్ నడుస్తోంది. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి మిగతా ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అప్పుడే అక్కడ ప్రతిపక్షంలో వెన్నుపోటు రాజకీయాలు మొదలైపోయాయి. కానీ దాన్ని ధీటుగా పిరియా సాయిరాజ్ దంపతులు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన నాయకుల జాబితా జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉన్నందున ఈసారి ముందునుంచి టీడీపీని కార్నర్ చేసే పనిలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణో, లేదూ అంటే మార్పులు, చేర్పులు జరిగి బెందాళం అశోక్‌కు మంత్రి పదవి వస్తే ఈసారి వైకాపాకు గెలుపు మరింత సులభమైపోతుంది. ఈ యుద్ధానికి పిరియా కుటుంబం ఇప్పటి నుంచే సిద్ధమైపోతుంది. తనతో కలిసొచ్చే నాయకులతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈసారి చావోరేవో తేల్చుకోడానికి వారికిది చివరి అవకాశం. కాబట్టి రణం తప్పదు.. అదే సమయంలో మూడుసార్లుగా తనను గెలిపిస్తున్న నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోవాలని సిటింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కావాలా? అభివృద్ధి పనులు కావాలా? అంటే.. రెండోదానికే ఓటేస్తానన్న రీతిలో, ఇదే మొదటిసారి గెలిచినంత స్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. ఏది ఏమైనా ఏడాదిన్నర దాటగానే కత్తులకు సానపడుతున్నారు. కొందరు సొంత పార్టీలోనే శత్రుశేషం లేకుండా చేయాలని చూసుకుంటున్నారు. మరికొందరు ప్రత్యర్థిని ఓడిరచాలని ముందుకెళ్తున్నారు.










Comments