top of page

‘ఆర్థిక’ అవగాహన లేని అమాత్యులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 9, 2025
  • 2 min read

సమాజంలో అన్ని రంగాల గురించి అందరికీ తెలియదు. ఒక రంగం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసి నైపణ్యం సాధించినవారిని ఆయా రంగాల ప్రముఖులుగా పరిగణిస్తుంటాం. అందరికీ.. అన్నింటిలోనూ ప్రవేశం, పాండిత్యం, పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు.. ఉండాలనుకోవడం సమంజసం కూడా కాదు. కానీ కొన్ని ప్రత్యేక రంగాలవారికి మాత్రం మిగతా అన్ని రంగాల అంశాలపై పూర్తి పట్టు లేకపోయినా.. కనీస పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ కోవలోకి వస్తారు. జర్నలిస్టులు సమాజ వారధులైన జర్నలిస్టులు అన్ని రకాల వార్తలను ప్రజలకు అందించాల్సి ఉంటుంది కనుక అన్ని రంగాలపై కాస్తో కూస్తో పరిజ్ఞానం వారికి తప్పనిసరి. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రభుత్వాలను నడిపే నాయకులకు ప్రతి అంశం గురించి రేఖామాత్రంగానైనా తెలిసి ఉండాలి. లేకపోతే అధికారులు ఇచ్చే సమచారంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ సమాచారాన్ని మించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు మాట్లాడలేక.. మాట్లాడినా తప్పులు దొర్లి ప్రజల్లో చులకన అయిపోతారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో ఉన్న నేతలు తమకు ఫలానా అంశం గురించి తెలియదు, అవగాహన లేదు అని చెప్పడాన్ని.. వారి నిజాయితీ అని చెప్పుకోవచ్చేమోగానీ.. అలా చెప్పడం వారికే నామోషీ. ప్రభుత్వంలో ఉన్నవారు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, పథకాల గురించి కనీస అవగాహన ఏర్పరచుకోకతప్పదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడు, మీడియాతో మాట్లాడేటప్పుడు ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయన్నది ఊహించలేం. ఎవరైనా ఒక సమస్య ప్రస్తావించినా, ప్రశ్న అడిగినా అది తనకు సంబంధంలేని శాఖ అనో.. దాని గురించి తనకు తెలియదనో చెప్పడం బేలతనమే అవుతుంది. కానీ పవన్‌కల్యాణ్‌ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలవరం గురించి అవగాహన లేదు, ఆర్థిక శాస్త్రం గురించి అసలే తెలియదు.. అని అమాయకత్వం ప్రదర్శిస్తున్న ఆయన మరో మూడు దఫాలు సీఎం చంద్రబాబే అని మాత్రం చెప్పేస్తున్నారు. ప్రజలు నిర్ణయించాల్సిన సీఎం అంశం గురించి చెబుతున్న ఆయన రాష్ట్రానికి చెందిన కీలక విషయాలు తెలియవనడం ఘోరం. తెలియకపోతే తెలుసుకోవాలి. అలా చేయకపోవడం ఆయన అసమర్థతగా కనిపిస్తుంది. ఇక కేబినెట్‌ మరో కీలక మంత్రి నారా లోకేష్‌ చాలాకాలం తర్వాత మళ్లీ తన మాటతీరుతో ట్రోలింగ్స్‌ గురవుతున్నారు. ఈమధ్య ఒక సభలో మాట్లాడుతూ మంగళగిరిలో గెలుపు గురించి మాట్లాడుతూ 91వేల నాలుగు వందల 13వేల మెజారిటీ వచ్చిందని ఉవాచించారు. వాస్తవానికి ఆయనకు వచ్చిన మెజారిటీ 91,413. దాన్ని పలికేటప్పుడు 91వేల నాలుగువందల పదమూడు అని చెప్పాలి. కానీ లోకేష్‌ మాత్రం మొదట 91వేల అని చెప్పి మళ్లీ చివరిలోనూ 13 తర్వాత వేలు అన్న పదం చేర్చేశారు. ఇది విన్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు. అంకెలపై ఆమాత్రం అవగాహన లేదా అని ఎద్దేవా చేస్తున్నారు. చిన్నప్పుడే ప్రాథమిక స్థాయిలోనే ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు అంటూ అంకెలు నేర్పిస్తారు. అలాగే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేలు, లక్షల స్థానాలకు ఎలా గుర్తించాలో, ఎలా రాయాలో, ఎలా పలకాలో.. గురువులు క్షుణ్ణంగా నేర్పిస్తారు. పోనీ లోకేష్‌ ఔపోసన పట్టిన ఆంగ్లంలోనూ 91,413 అంకెను నైన్టీవన్‌ థౌజెండ్‌ ఫోర్‌ హండ్రెడ్‌ అండ్‌ థర్టీన్‌ అని అంటారే గానీ.. లోకేష్‌ చెప్పినట్లు చెప్పరు. గణితంపై కనీసం ప్రాథమిక అవగాహన లేకుండా పవన్‌, లోకేష్‌ మాట్లాడటం విడ్డూరమనిస్తుంది. 2025-26లో మన రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3,22,359 కోట్లు. ఐదంకెల సంఖ్యనే సక్రమంగా పలకలేనివారు, ఆర్థిక శాస్త్రం గురించి తెలియని వారు మొత్తం అంకెల గారడీతో నిండిపోయే రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా అర్థం చేసుకుంటున్నారో.. తమ శాఖల ఆర్థిక లావాదేవీలను ఎలా నడపుతున్నారో దేవుడికే తెలియాలి. బడ్జెట్‌ లెక్కల్లో రూపాయి రాకడ.. రూపాయి పోకడం అని కొన్ని లెక్కలు చెబుతారు. రూపాయి రాకడ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పోకడ అంటే ఖర్చు అని అర్థం. ఈ అంచనాల ప్రకారమే పథకాలు అమలు చేయాలి. ప్రణాళికలు రూపొందించాలి. ఇక విదేశాలతో లావాదేవీలను డాలర్ల రూపంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది మరింత సంక్లిష్టం. ఆర్థిక శాస్త్రం, గణాంకాలపై అవగాహన లేనివారు వీటిని ఎలా అర్థం చేసుకుంటారో మరి!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page