ఆర్థిక నావను ముంచడం ‘గ్యారెంటీ’!
- DV RAMANA

- 1 day ago
- 2 min read

ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో గ్యారెంటీ లేదా ష్యూరిటీ పేరుతో కొన్ని హామీలు ప్రత్యేకంగా ఇవ్వడాన్ని పార్టీలు అలవాటు చేసుకున్నాయి. అంటే.. ‘గ్యారెంటీ లేదా ష్యూరిటీ’ అన్న ముద్ర వేసిన ఉచిత పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పడమన్నమాట! ఇటువంటి గ్యారెంటీ హామీలతోనే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు గద్దెనెక్కాయి. కానీ ఆచరణలోకి వచ్చిన తర్వాతే తెలిసింది గ్యారెంటీ హామీలు అంటే ఆయా పథకాల అమలుకు గ్యారెంటీ కాదని.. మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే ముంచేయడం గ్యారెంటీ అని అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసివస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని పది గ్యారెంటీలు ఇచ్చి హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. పథకాల కారణంగా రాష్ట్రాభివృద్ధిని పడకేసింది. మూడేళ్ల పాలనలో ఎక్కడపడితే అక్కడ అప్పులు చేయడంతో రాష్ట్రం మొత్తం అప్పు రూ.95,633 కోట్లకు చేరుకున్నట్లు కాగ్ తాజా నివేదికలో పేర్కొంది. ఎఫ్‌ఆర్‌బీఎం విధించిన పరిధి రూ.90 వేలు కోట్లు కాగా అప్పులు దాన్ని మించిపోయాయి. వీటి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు సర్దుబాటు చేయలేక ఒక్కొక్కటిగా పథకాలను అటకెక్కిస్తోంది. అక్కడితో ఆగకుండా గత ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకానికి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. ఉచిత సబ్సిడీని వదులుకోవాలని ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ఆదాయం పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. విరాళాలు ఇవ్వాలని ఆలయ ట్రస్టులను ఒత్తిడి చేస్తోంది. టాయ్‌లెట్ ట్యాక్స్ విధించడానికి కూడా వెనుకాడలేదు. విధానపరమైన లోపాలతో రాష్ట్ర ఆదాయం తగ్గడం, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లేక కంపెనీలు, పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, ప్రభుత్వంలో అవినీతి వెరసి హిమాచల్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. కొత్త అప్పులు ఎక్కడా పుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం దిగజారిపోయింది. దీంతో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న తలతిక్క నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగులు భగ్గుమనడంతో ఆ జీవోను వెనక్కి తీసుకోకతప్పలేదు. హిమాచల్ పరిస్థితి ఇలా ఉంటే.. దక్షిణాదిలోని కర్ణాటకలు ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గ్యారెంటీల సంక్షోభంలో కూరుకుపోయాయి. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, నిరుద్యోగ సమస్య, రైతుల కష్టాలు తీర్చడంలో ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కార్యకలాపాలు, పథకాల అమలుకుల ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తూ పోతున్నది. దీంతో హిమాచల్ బాటలోనే ఉచిత హామీలు ఇచ్చిన రాష్ట్రాలు పతనమవుతున్నాయని సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇవే ఉచిత పథకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో గ్యారెంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాదిన్నరలోనే గ్యారెంటీ పథకాల అమలు, అభివృద్ధి పేరుతో ఏకంగా రూ.2.93 లక్షలు మేరకు అప్పులు చేసేసింది. దాదాపు ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ముందు చేతులు చాపి నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశే మొదటిస్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ రాష్ట్రం ఎంతమేరకు రుణాలు తీసుకోవచ్చన్నది కేంద్ర ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. దీన్నే ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి అంటారు. ఈ పరిమితికి లోబడి రుణాలు తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుంది. ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితిని రాష్ట్ర జీఎస్‌డీపీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ విధంగా మన రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి మూడు నుంచి నాలుగు శాతం ఉంది. అంటే రాష్ట్ర జీఎస్‌డీపీలో మూడు, నాలుగు శాతం వరకే రుణాలు తీసుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వానికి ఉంది. అంకెల్లో చెప్పాలంటే.. 2024`25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.16.41 లక్షల కోట్లు. ఎఫ్‌ఆర్‌ఎంబీ లిమిట్ ప్రకారం అందులో మూడు శాతం అంటే రూ.49,230 కోట్లు లేదా గరిష్టంగా నాలుగు శాతం అంటే రూ.65,640 కోట్ల వరకు రుణాలుగా తీసుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రిజర్వ్‌బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు రూ.2.93 లక్షల కోట్లు దాటిపోయాయంటే రాష్ట్రం ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి దాటి ఎంతగా అప్పుల్లో కూరుకుపోయిందో అర్థమవుతుంది. ఈ పరిస్థితికి కారణం అధికారం కోసం గత జగన్ ప్రభుత్వంతో పోటీ పడి మరీ సూపర్‌సిక్స్ పేరుతో ఆరు గ్యారెంటీ హామీలు ఇవ్వడమే. గతంలో జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని విమర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా తనవరకు వచ్చేసరికి గత ప్రభుత్వానికి మించిన హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. సూపర్‌సిక్స్ పథకాలన్నీ అమలు చేసేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొంటున్నా.. నిరుద్యోగ భృతి, 19 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 భృతి పథకాలను ఇప్పటికీ ప్రారంభించలేకపోయింది. మిగిలిన పథకాలకు నిధులు సమకూర్చలేక నానా అవస్థలు పడుతోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతున్నదని విమర్శించిన ఎన్డీయే కూటమి.. తాను అధికారంలోకి వచ్చాక కొత్తలో కొన్ని నెలలు ఏదోలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చినా.. రెండు మూడు నెలలుగా జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నింటి వల్ల ఏపీ ఆర్థికం కూడా అప్పుల నావలా మారింది.










Comments