ఆర్థిక విపత్తా.. వికాసమా?!
- DV RAMANA

- Oct 18, 2025
- 3 min read

ఆంధ్రుల ఆశల నగరం విశాఖకు అంతర్జాతీయ మెగా ఐటీ సంస్థ గూగుల్ రాకడ.. అంతర్ రాష్ట్ర రగడ సృష్టిస్తోంది. సాగరతీర నగరమైన విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టబడితో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవలే ఢల్లీి వేదికగా ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదురింది. ఇంత భారీ పెట్టుబడిని రాష్ట్రానికి రప్పించగలిగామంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. అందులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. అదే సమయంలో గూగుల్‌ను ఆకట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసిన భారీ రాయితీలను అనుచితమంటూ కర్ణాటక మంత్రులు విమర్శిస్తుంటే.. తమ రాష్ట్రానికి రావాల్సిన భారీ ఐటీ సంస్థను ఏపీ తన్నుకుపోయిందని తమిళనాట అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అంశం కర్ణాటక, ఏపీ రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్య ఆసక్తికరమైన ట్వీట్‌వార్‌కు దారి తీసింది. సరే.. వాటిలోని రాజకీయ ఆరోపణలు, విమర్శల సంగతెలా ఉన్నా.. వాటిలో ప్రస్తావనకొచ్చిన కొన్ని కీలకాంశాలు మాత్రం ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఐటీ కంపెనీ కోసం అలవిమాలిన రాయితీల వర్షం కురిపించడం అనౌచిత్యమే కాకుండా ఆర్థిక విపత్తు అని కర్ణాటక ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్‌లో చేసిన ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ఈ ట్వీట్‌లోనే గూగుల్‌కు ఏపీ సర్కారు ఇచ్చిన రాయితీలను వెల్లడిరచారు. గూగుల్ డేటా సెంటర్ కోసం ఏకంగా రూ.22వేల కోట్ల విలువైన రాయితీలు కల్పించిందని అన్నారు. ఇవి కాకుండా మార్కెట్ ధర కంటే 25 శాతం తక్కువ ధరకు భూమి, రాష్ట్ర జీఎస్టీలో పూర్తి మినహాయింపు అంటే వంద శాతం రాయితీ, 100 శాతం విద్యుత్ ఉచిత ట్రాన్స్‌మిషన్, నీళ్ల టారిఫ్‌లో 25 శాతం డిస్కౌంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇన్ని రాయితీలు ఇవ్వడమంటే పరిశ్రమ కాళ్ల మీద సాగిలబడటమేనన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. పైగా ఒక్క పరిశ్రమకే ఇన్ని రాయితీలు ఇస్తే.. మిగతా పరిశ్రమలు కూడా ఈస్థాయిలోనే రాయితీలు ఆశిస్తాయని.. అంతిమంగా ఇది ఆర్థిక విపత్తుకు దారి తీస్తుందని కర్ణాటక మంత్రి విశ్లేషించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఫణంగా పెట్టి ఇంత భారీ రాయితీలు తాము ఇవ్వలేమని ప్రియాంక్ ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన ఈయన ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రస్తావించారు. విశాఖకు గూగుల్‌ను రప్పించేస్తున్నామని ఘనంగా చెబుతున్నారే తప్ప.. అందుకోసం ఆ సంస్థకు ఎంత ధారబోస్తున్నారన్నది మాత్రం ఏపీ ప్రభుత్వం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో బెంగళూరు నగరం ఐదో స్థానంలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికే ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా కూడా ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారని.. ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని కర్ణాటక మంత్రి చెప్పుకొచ్చారు. ఖర్గే వ్యాఖ్యలకు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ ఎక్స్‌లోనే స్పైసీగా స్పందించారు. ‘నేరుగా కర్ణాటక పేరు ప్రస్తావించకుండా వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉందంటున్నారు. పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మా పక్క వాళ్లు కొంతమంది ఆ మంటను ఫీల్ అవుతున్నారు’ అని పోస్ట్ చేయడం ద్వారా ఏపీకి పెట్టుబడులు రావడం చూసి పక్క రాష్ట్రాలు కడుపు మంటతో రగిలిపోతున్నాయన్నట్లు వ్యాఖ్యనించడం ఈ రచ్చను మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్లింది. దక్షిణ భారత రాష్ట్రాల మధ్య పోటీని మరింత ఊపందుకునేలా చేసింది. లోకేష్ తన ట్వీట్‌లకు ఆంధ్ర రైజింగ్, యంగెస్ట్ స్టేట్ హయ్యస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న హ్యాష్టట్యాగ్‌లతో తమ ప్రభుత్వం గురించి ప్రమోట్ చేసుకున్నారు. ఇదే సందర్భంలో బెంగళూరు రోడ్లు, కాలువల దుస్థితి, పవర్ కట్‌లపై కర్ణాటక ప్రభుత్వాన్ని ఆయన కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం రాజకీయ వివాదం రేపింది. దీనికి స్పందిస్తూ ప్రియాంక్ ఖర్గే, ‘అందరూ స్పైసీని ఇష్టపడినా.. వైద్యులు ఎప్పుడూ బ్యాలెన్స్ డైట్ (సమతుల్య ఆహారం) తీసుకోవాలని సూచిస్తారు’ అంటూ చురక అంటించారు. పెట్టుబడుల్లో ‘స్పైసీనెస్’ కాకుండా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎత్తిపొడిచారు. ఏపీ అప్పుల భారాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ‘మా పొరుగువారి అప్పులు రూ.10 లక్షల కోట్లకు పెరిగాయి. కేవలం ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రెవెన్యూ లోటు మరింత దిగజారి 2.65 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది. దయచేసి బ్యాలెన్స్ డైట్‌పై దృష్టి పెట్టండి. అప్పులు, లోటుపై అప్రమత్తంగా ఉండాలి’ అని ఖర్గే స్పష్టమైన హెచ్చరిక చేశారు. కేవలం పెట్టుబడుల ప్రకటనలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మరోవైపు తమిళనాడుకు రావాల్సిన గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీ ప్రభుత్వం తన్నుకుపోవడంపై ఆ రాష్ట్రంలో అసహనం వ్యక్తమవుతోంది. తమ మంత్రులు చేతకాని వారైపోయారని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రుల మధ్య పెట్టుబడుల ఆకర్షణ కోసం మొదలైన ఈ ట్వీట్ యుద్ధం రాష్ట్రల మధ్య అనవసర పోలికలకు దారితీస్తోంది. లోకేష్ బెంగళూరులో మౌలిక వసతుల లోపాన్ని ప్రస్తావిస్తే.. ఖర్గే ఏపీ ఆర్థిక లోపాలను, అప్పుల భారాన్ని హైలైట్ చేశారు. ఇది కేవలం మాటల యుద్ధంగానే కాకుండా, పెట్టుబడుల ఆకర్షణకు తీవ్రమైన పోటీని ప్రతిబింబిస్తోందని పరిశీలకులంటున్నారు. అయితే ఇలాంటి వివాదాలు దక్షిణ భారత ఐటీ రంగం ఏకత్వాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.










Comments