ఆర్ & బి అల్లాడిపోయిందమ్మ పాపం!
- NVS PRASAD

- Sep 9
- 2 min read
గత ప్రభుత్వంలో కమీషన్లు లేక దిగాలు
ప్యాచ్ వర్క్‌లకే ప్యాచ్‌లు పడ్డాయి
క్రషర్ డస్ట్‌తోనే రెన్యువల్ వర్క్‌లు
సీఎస్‌పీ రోడ్డుపై ప్రయాణం వెన్నెముకకు ప్రమాదం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మార్కెట్‌లో ఏ వస్తువు కొన్నా ఎన్నాళ్లు గ్యారెంటీ ఇస్తున్నారని అడుగుతాం. ఎక్కడ బాగుంటే అక్కడ కొంటాం. సర్వీసు బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని వస్తువు కొనడానికి ముందుకొస్తాం. కేవలం ఒక మిక్సీ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనం నెలంతా కష్టపడి సంపాదించిన దానిమీద అనేక రూపాల్లో టాక్స్‌లు కట్టి మరీ వెన్నుపూసను వంపు చేసుకుంటున్నాం. కనీసం ఈ రోడ్లు బాగులేవు, రోడ్‌టాక్స్ నేనెందుకు కట్టాలని ఒక్కరోజు ప్రశ్నించిన పాపాన ఎవరూ పోము. ఆమధ్య తెలంగాణలో చేతిలో ప్లకార్డు పట్టుకొని ఒక యువకుడు పాడైన రోడ్ల మధ్యలో కూర్చుని నిరసన తెలిపితే, వింతగా సోషల్‌మీడియాలో చూశాం. కానీ అదే పరిస్థితి మన దగ్గరుంటే మాత్రం పట్టించుకోం. అసలే జన్`జీ జనరేషన్ ఇది. తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అంటూ ఎంజాయ్ చేయడం తప్ప దేన్నీ పట్టించుకోని పరిస్థితి మనది. అందుకే జిల్లా కేంద్రంలోనే రోడ్లు ఇలా తగలడ్డాయి. జగన్మోహన్‌రెడ్డి పాలించినన్నాళ్లూ రోడ్ల వైపు కన్నెత్తి చూడలేదు సరికదా.. ప్యాచ్‌వర్క్‌లకు కూడా డబ్బులు విదిల్చలేదు. దీనివల్ల రోడ్లు, భవనాల శాఖలో పనులు జరగక, కమీషన్లు రాక సిబ్బంది అల్లాడిపోయారు. అప్పటికే భారీ భవంతులకు అడ్వాన్సులో, అప్రూవ్డ్ లేఅవుట్లలో ప్లాట్లకో, ఖరీదైన కార్లకో సగం చెల్లించేసుంటారు కాబట్టి మిగతా నెలవారీ మామూళ్లు రాకపోతే అల్లాడిపోయారు పాపం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి చేయని పనిని తమ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం ముందుగా ఆర్ అండ్ బి రోడ్లు రెన్యువల్‌కు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే స్థానిక సీఎస్‌పీ రోడ్డు, పాఠకుల భాషలో చెప్పాలంటే పాలకొండ రోడ్డులో గోతులు పడిన చోట ప్యాచ్‌లు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన చాన్నాళ్ల తర్వాత ఆ మధ్య ఈ పనులు జరిగాయి. హమ్మయ్య.. రోడ్లు మెరుగుపడ్డాయని భావించిన నెల రోజులకే కురిసిన అకాల వర్షానికి ఈ ప్యాచ్‌లు కరిగిపోయాయి. ఇప్పుడు వరుసగా కురిసిన మూడు రోజుల వర్షాలకు ఉన్న తారు కోటింగ్ కూడా ఊడిపోయి నగర పరిధిలో ఉన్న పాలకొండ రోడ్డు మొత్తం గోతులమయమైపోయింది. సాక్ష్యాత్తు కార్పొరేషన్ కార్యాలయం ఎదుటే కమిషనర్ కారు దిగబడిపోయేంత గోతులున్నాయి. ఇక ఏడురోడ్ల జంక్షన్ నుంచి డే అండ్ నైట్ వరకు రోడ్డు గుంతలమయంగా ఉంది. సాధారణంగా కొత్త రోడ్డు నిర్మించినప్పుడు రెండేళ్ల వరకు దానిపై రెన్యువల్‌కు టెండర్లు పిలవరు. అంటే.. దానర్ధం కాంట్రాక్టరే ఈ రెండేళ్లలో ఏం జరిగినా బాధ్యత వహించాలి. అలాగే ప్యాచ్‌వర్క్‌లు చేసినప్పుడు కూడా కనీసం రెండేళ్లు నిలవాలనే నిబంధన ఉండేవుంటుంది. కానీ వేసిన నెల రోజులకే పోతే రోడ్లు, భవనాల శాఖలో అడిగే నాధుడు లేడు. అప్పటికే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి తమ కడుపులు కొట్టిందని తెగ ఫీలైపోయిన ఆర్ అండ్ బి అధికారులు కూటమి ప్రభుత్వంలో రెన్యువల్ వర్క్‌కు సొమ్ములు రాగానే పనులు ప్రారంభం కాకుండానే వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటప్పుడు ఏ కాంట్రాక్టర్ మాత్రం పిక్క, తారు వాడి ప్యాచ్‌వర్క్‌లు చేస్తాడు చెప్పండి. అందుకే ఇప్పుడు ప్యాచ్‌కే ప్యాచ్ పడిపోయింది. ఇది ప్రకృతి సహజం. చిన్నప్పుడు మన సైకిల్‌కు ఓ చోట ప్యాచ్ అయితే ఎండకు అది కరిగిపోయేది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా వర్షానికి ఈ ప్యాచ్‌లు కరిగిపోవడం వింత. పోనీ సైకిల్ ప్యాచ్‌లాగ పావలాకో, అర్థకో జరిగే పనా.. అంటే అదీ కాదు. లక్షలాది రూపాయలు పెట్టి ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేశారు. సాధారణంగా ఇందుకోసం తారుతో పాటు 6 ఎంఎం చిప్స్‌ను హాట్‌మిక్సర్ ద్వారా కలిపి వాడతారు. అయితే ఇప్పుడు ఈ ప్యాచ్‌లు కరిగిపోవడంతో ఆ గోతుల్లో కనిపిస్తున్న దృశ్యం చూస్తే ఎక్కడా 6 ఎంఎం చిప్స్ కనిపించడంలేదు. కేవలం క్రషర్ డస్ట్ మాత్రమే దర్శనమిస్తుంది. అందుకే రెండేళ్లు మన్నాల్సిన రోడ్లు రెండు నెలలకే పాడవుతున్నాయి. ఇప్పుడు దీనిపై మళ్లీ రెన్యువల్‌కు పిలుస్తారు. లేదూ రెండేళ్లు పూర్తవలేదు కాబట్టి ఆ కాలపరిమితి వరకు మనం ఈ గోతుల్లోనే పయనించాలి. ఈలోగా మన వెన్నుపూసలో ఎల్`4లు, ఎల్`5లు మెళికలు తిరిగిపోతుంటాయి. ఇది ఒకవైపు డాక్టర్లకు కాసులు కురిపిస్తే, రోడ్డు పనులు ఆర్ అండ్ బి అధికారుల జేబులు నింపుతున్నాయి.










Comments