ఆర్‌సీఐకి బురిడీ..ఫేక్ ఫ్యాకల్టీ!
- NVS PRASAD

- May 18, 2024
- 3 min read
`శిష్యుడి సీటు కాపాడేందుకు నిమ్మవారి పల్టీలు
`స్పెషల్ బీఈడీ రెన్యువల్ కోసం నియమాలకు నీళ్లు
`తనిఖీ బృందాన్ని మాయ చేసి అనుమతుల సాధన
`కోర్సు ఫ్యాకల్టీగా చూపించిన వారందరూ వేరే చోట పనిచేస్తున్నవారే
`వీరిలో కొందరికి అర్హతలు కూడా లేవని ఆరోపణలు
స్థానిక యూనివర్సిటీకి కొంతకాలం క్రితం వరకు వీసీగా పని చేసిన నిమ్మ వెంకట్రావు పాపాలు ఇప్పటికీ ఆ సంస్థను వెంటాడుతున్నాయి. వైస్‌ఛాన్సలర్ అంటే న్యాయమూర్తుల కంటే ఎక్కువని, గవర్నర్ తర్వాత స్థానం వీసీదేనన్న దర్పం ప్రదర్శించిన నిమ్మ వెంకట్రావు తన శిష్యుడు హనుమంతు సుబ్రహ్మణ్యాన్ని అందలం ఎక్కించేందుకు చేయని పాపం లేదు. తన శిష్యుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో గత కొంతకాలంగా అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని భావించిన నిమ్మవారు ఆయన పోస్టును కాపాడటానికి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాన్ని చూపించి ఆ పోస్టును రెగ్యులర్ చేసుకోవాలని పదవిలో ఉన్నన్నాళ్లూ నిమ్మవారు తీవ్రంగా ప్రయత్నించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే.. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు ప్రత్యేక పద్ధతిలో పాఠాలు బోధించే స్పెషల్ బీఈడీ అన్నమాట. దీనికి ఈ యూనివర్సిటీ పరిధిలో డిమాండ్ ఉంది. రెగ్యులర్ బీఈడీ కంటే స్పెషల్ బీఈడీ కోర్సు చదివితే ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం గ్యారెంటీ అనే భరోసా ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరుతున్నారు. అయితే.. ఈ కోర్సు నడపాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) అనుమతి పొందాలి. నిర్ణీత కాలపరిమితిలో అనుమతులను రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. అయితే మొదట్నుంచి స్పెషల్ బీఈడీ కోర్సులకు ి అర్హులైన అధ్యాపకులు లేరన్న విషయం బహిరంగ రహస్యం. రెగ్యులర్ బీఈడీ పాఠాలు చెప్పేవారే స్పెషల్ బీఈడీకి కూడా పాఠాలు చెబుతున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టినా ఆర్‌సీఐ రెన్యువల్ కోసం వర్సిటీ ఇచ్చిన డాక్యుమెంట్లలో 99 శాతం ఫేక్‌వే కావడం గమనార్హం. ఎంతలా అంటే.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తున్నవారినే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చూపించి ఆర్‌సీఐ అనుమతులు పొందారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)స్థానిక వర్సిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించిన అనుమతులను రెన్యువల్ చేసేందుకు 2022 నవంబరు 14న ఆర్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టింది. దీనికోసం తమిళనాడులోని కైలాసలింగం యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.డి.వెంకటేష్, కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ ఛాలెంజ్‌డ్ డైరెక్టర్ జెన్సీ వర్గీస్‌లను ఆర్‌సీఐ నియమించింది. వెరిఫికేషన్ ప్రక్రియలో అనేక విధివిధానాలు ఉన్నాయి. ఆర్‌సీఐకి యూనివర్సిటీ తరఫున సమర్పించిన నివేదికలో 174 పేజీలు ఉన్నాయంటే.. ఎన్ని మార్గదర్శకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన ఆర్‌సీఐ వర్సిటీలో ఈ విభాగానికి కోర్స్ కో ఆర్డినేటర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం ఇచ్చిన కాగితాలు తీసుకువెళ్లి ఆర్‌సీఐ అనుమతులు ఇచ్చేసింది. వాస్తవానికి హెచ్‌వోడీ అప్పటి రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ దృష్టిలో పెట్టి పత్రాలు సమర్పించినట్లు ఆర్‌సీఐ పేర్కొంది. కానీ హెచ్‌వోడీగా పేర్కొన్న పేరు దిద్దుబాట్లు, కొట్టివేతలతో ఉంది. అంటే ఆర్‌సీఐ తరఫున వచ్చిన సభ్యులు ఎక్కడో ఏదో మతలబును అంగీకరించే ఈ రిపోర్టు రాసినట్లు అర్థమవుతుంది. ఐదేళ్లకోసారి ఆర్‌సీఐ ఇన్‌స్పెక్షన్ జరుగుతుంది. వర్సిటీ సమర్పించిన పత్రాల్లో జెన్యూనిటీ ఏమిటనేది చూడకుండా ఉండేందుకు కచ్చితంగా ఆర్‌సీఐ తరఫున వచ్చిన వారికి నోరు కట్టేసుంటారనేదే సుబ్రహ్మణ్యం వ్యవహార శైలి తెలిసిన ఎవరైనా చెప్పే మొదటి మాట.
ఎక్కడో రెగ్యులర్ ఉద్యోగం.. ఇక్కడ ఫ్యాకల్టీఆర్సీఐకి సమర్పించిన అధ్యాపకుల జాబితాలో కోర్ ఫ్యాకల్టీ కింద ఎన్.ఎన్.లక్ష్మి, పి.నాయుడులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చూపించారు. అయితే ఎన్.ఎన్.లక్ష్మి విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఉన్న ఒక మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. మరి ఈమె ఇక్కడి యూనివర్సిటీకి వచ్చి ఎప్పుడు పాఠాలు చెబుతున్నారో ఎవరికీ తెలియదు. అలాగే పి.నాయుడు విశాఖపట్నంలోని రాణీ చంద్రమతీదేవి మానసిక ఆస్పత్రిలోని జిల్లా రీ హేబిలిటేషన్ సెంటర్‌లో రెగ్యులర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. మరి ఈయన ఇక్కడకు వచ్చి ఎలా పాఠాలు చెబుతున్నారో తెలియదు. ఆ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఎ.సూర్యకళను చూపించారు. ఈమె క్లినికల్ సైకాలజిస్ట్ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఆమె ఎచ్చెర్ల హైస్కూల్‌లో ఐఈడీఎస్‌ఎస్‌ఏ ఉద్యోగం చేస్తున్నారు. ఎం.ఏ.,ఎంఈడీ (మెంటల్లీ రిటార్డెడ్) కోర్సు ఇదే యూనివర్సిటీలో పూర్తిచేశారు. అయితే క్లినికల్ సైకాలజిస్ట్‌గా పని చేయడానికి ఈమెకు ఆర్‌సీఐ అనుమతులు ఉన్నాయా? ఈ కోర్సులో ఎంఫిల్ చేశారా? అన్న విషయాలు కాసేపు పక్కన పెడితే, యూనివర్సిటీలో ఈమె పనిగంటలు రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్న ఎచ్చెర్ల హైస్కూల్ పనివేళలు ఒకటే. అటువంటప్పుడు ఆమె ఎప్పుడు ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి చెప్పి వెళ్లిపోతున్నారో తెలియజేస్తే సంతోషం. గెస్ట్ ఫ్యాకల్టీలో ఉదయలక్ష్మిని కౌన్సిలర్‌గా చూపించారు. ఈమెకు 11 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. కానీ ఎక్కడ, ఏమిటి అనే వివరాలేవీ ఇవ్వలేదు. అయినా ఆర్‌సీఐ పెద్ద గ్రేడే ఇచ్చింది. ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ కోటాలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ కింద సీపాన హేమమోహనరావు పేరు చూపించారు. ఈయనకు ఎనిమిదేళ్ల అనుభవం ఉందట. ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు కూడా ఆర్‌సీఐకి ఇవ్వలేదు. అలాగే సైకాలజీ కౌన్సిలర్‌గా డాక్టర్ ఎన్.సీతారామ కృష్ణారావును చూపించారు. ఈయన సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న శ్రీకార్ ఉపకార్ రీహేబిలిటేషన్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. పాపం ఈయన రోజూ సికింద్రాబాద్‌లో రైలెక్కో, శంషాబాద్‌లో విమానమెక్కో ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగం చేయడానికి ఎచ్చెర్ల వస్తున్నట్టు ఉంది. మరో గెస్ట్ ఫ్యాకల్టీ కింద కె.లలిత అనే ఆమెను ఆర్‌సీఐకి ఇచ్చారు. ఈమె ఎన్‌సీటీఈ భువనేశ్వర్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కానీ ఇక్కడ పని చేస్తున్నట్టు రిజిస్టర్‌లో రెగ్యులర్‌గా సంతకాలు పెట్టడం గమనార్హం. ఇక గెస్ట్ ఫ్యాకల్టీలో హెడ్‌గా డాక్టర్ కె.యు.గిరిధర్ ఇక్కడ పని చేస్తున్నట్టు ఆర్‌సీఐకి వివరాలు అందజేశారు. నిజానికి గిరిధర్ హైదరాబాద్‌లో ఠాగూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌లో రెగ్యులర్ ఫ్యాకల్టీగా పని చేస్తూ హెచ్‌వోడీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎవరికైనా అనుమానముంటే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ వెళ్తే అక్కడ కూడా ఈయన పాఠాలు చెబుతున్నట్టు సంతకాలు ఉంటాయి. మరి హైదరాబాద్‌లో చెబుతూ ఎచ్చెర్లకు కూడా వచ్చి రిజిస్టర్‌లో సంతకం పెట్టి మరీ పాఠాలు చెబుతున్నారంటే.. నిజంగా కాలుకు లేపనం పూసుకున్నా, గాలిలో ఎగిరొచ్చినా సాధ్యంకాని పని. ఇలా చెప్పుకుంటూపోతే ఈ 174 పేజీల్లో ప్రతి 10 పేజీలకు ఒక కథ రాయొచ్చు.
శిష్యుడి కోసం పతనంకానీ ఎచ్చెర్ల వర్సిటీలో నిమ్మ వెంకట్రావు హయాంలో ఏదైనా సాధ్యమే అన్నట్లు సాగిపోయింది. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా భోజనం దొరుకుతుందన్నట్టు వ్యవహరించారు. ఇన్ని పాపాలు ఎందుకు చేశారంటే శిష్యుడి కోసమే అని వేరే చెప్పక్కర్లేదు. నిమ్మ వెంకట్రావు పదవిలో ఉండగా తన శిష్యుడికి వంగి దండాలు పెట్టని అనేక డిపార్ట్‌మెంట్లను ఎత్తేశారు. సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో జియో సైన్స్ కోర్సుకు డిమాండ్ ఉన్నా దాన్ని ఓ పథకం ప్రకారం చంపేసి అక్కడి ఫ్యాకల్టీని ఇంటిదారి పట్టించారు. యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీయే వెన్నెముక. అటువంటి చోట బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాన్ని ఎత్తేసి అక్కడ పని చేస్తున్న అధ్యాపకులను వేరే వారి కంట్రోల్‌లో పెట్టి ఆ తర్వాత ఏకంగా ఒక రిక్రూట్‌మెంట్ మొత్తాన్ని తొలగించిన ఘనత నిమ్మవారిదే. వర్సిటీలో పనికొచ్చే డిపార్ట్‌మెంట్లలో విద్యార్థులు లేరనే సాకుతో లేపేశారు. ఇప్పుడు రెగ్యులర్ బీఈడీ అభ్యసించడానికి విద్యార్థులు రావడంలేదు. వచ్చినవారికి పాఠాలు చెప్పరు. కేవలం సర్టిఫికెట్ కోసం ఒడిశా బ్యాచ్ మాత్రమే ఇక్కడ బీఈడీ కాలేజీల్లో కనిపిస్తుంది. భవిష్యత్తులో వీసీలు మారినప్పుడు, ఆప్షేలో చెంచాగాళ్ల పోస్టులు ఊడిపోయినప్పుడు ఇక్కడ రెగ్యులర్ బీఈడీ కోర్సును ఎత్తేస్తే స్పెషల్ బీఈడీ కేటగిరీలో తన శిష్యుడు ఇక్కడ కొనసాగడం కోసం నిమ్మవారు నడిపిన నాటకంలో ఇదో భాగం.










Comments