top of page

‘గురజాడ’లో అశ్లీల మార్ఫింగ్ జాడ

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 12 hours ago
  • 2 min read
  • మహిళా అధ్యాపకులే ప్రథమ బాధితులు

  • డిగ్రీ విద్యార్థినుల ఫొటోలకూ అదే గతి

  • నిందితులకు టీసీ ఇచ్చామంటున్న మేనేజ్‌మెంట్

  • అసభ్య డేటా అమ్మేశారంటున్న తల్లిదండ్రులు

  • మార్ఫింగ్‌కు సహకరించిన తోటి విద్యార్థిని

  • ఎస్పీకి ఫిర్యాదు వెళ్లకుండా బంధిఖానా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మహాకవి గురజాడ అడుగుజాడల్లో చదువు చెబుతామంటూ నెలకొల్పిన సొసైటీ అది.. చదువుల తల్లి గాయత్రీదేవి పేరుతో నడుస్తున్న కార్పొరేట్ కాని కార్పొరేట్ సంస్థ అది.. ఊరికి దూరంగా మునసబుపేటలో ప్రత్యేక క్యాంపస్‌గా ఉన్న గురజాడ విద్యాసంస్థల్లో అరాచకం ఆలస్యంగా వెలుగుచూసింది. డిగ్రీ చదువుతున్న కొందరు విద్యార్థులు స్వయంగా పాఠాలు చెబుతున్న అధ్యాపకురాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో రూపొందించి సర్క్యులేట్ చేయడంతో ఇప్ప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. వారం రోజులుగా క్యాంపస్ మధ్యలోనే నలుగుతున్న ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. తమ వద్ద పని చేస్తున్న మహిళా అధ్యాపకులను తొక్కిపెట్టి వివాదం బయటకు రాకుండా చూసుకున్నారు. కానీ ఇలా మార్ఫింగ్ ఫొటోల్లో సాటి విద్యార్థినులు కూడా ఉన్నారని తేలడంతో ఒక్కసారిగా వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ‘సత్యం’ను సంప్రదించారు. దీనిపై మరోవైపు క్యాంపస్‌లోనే విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. ఇవేవీ బయటపడకుండా పోలీసులు వచ్చినట్టే వచ్చి ఎటువంటి కేసు నమోదు చేయకుండా వెళ్లిపోయారు. ఇందుకు బాధ్యులైన విద్యార్థులను టీసీ ఇచ్చి పంపించేశామని, వారి వద్ద 5 జీబీ డేటా మాత్రమే ఉందని, వాటిని స్వాధీనం చేసుకున్నామని మేనేజ్‌మెంట్ చెబుతుంది. ఇంకా గట్టిగా నిలదీస్తే.. ఆ వ్యవహారానికి, తమకు సంబంధం లేదని తెగేసి చెబుతున్నట్టు విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలో మునసబుపేటలో ఉన్న గురజాడ విద్యాసంస్థలో ఉన్న అధ్యాపకులు, విద్యార్థినుల ఫేస్ మార్ఫింగ్ చేసి అసభ్య వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారన్న అంశం గురువారం వెలుగులోకి వచ్చింది. గురజాడ విద్యాసంస్థల్లో డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్ధులు, వీరికి పాఠాలు చెబుతున్న అధ్యాపకులే బాధితులని తెలిసింది. ఇటీవల కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి ఫోటోలు వీరు తీశారు. ఆ తర్వాత వీటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి ట్రోల్ చేయడంతో వ్యవహారం బయటపడింది. దీంతో యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి ఏడాది చదవుతున్న సాయి, మధు, బాలు, హర్షవర్థన్‌తో పాటు బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని కూడా బాధ్యులుగా గుర్తించారు. వీరి నుంచి 5 జీబీ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వీరిలో నలుగురు జూనియర్లకు రెండు రోజుల క్రితం టీసీలు ఇచ్చి కాలేజీ నుంచి పంపించేశారు. బీఎస్సీ సీనియర్ విద్యార్థినిని మాత్రం విడిచిపెట్టేశారు. టీసీని తీసుకొని వెళ్లి పోయిన నలుగురు విద్యార్ధుల్లో ఒకరు దర్జాగా కాలేజీలోనే తిరుగుతున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు గురువారం ఫోన్ చేసి చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అలాగే బాధిత మహిళా అధ్యాపకుల ద్వారా అసలు తెలుసుకుని, అందులో తామూ ఉన్నామని భావించిన విద్యార్ధినులందరూ కాలేజీలోని సీ`బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. కాలేజీలోనే ర్యాలీ చేపట్టి నిందుతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యాజమాన్య ప్రతినిధి ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. విద్యార్థులను బయటకు రాకుండా, బయటివారిని లోపలకు పోనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంలోనే కాలేజీలోని ఒక అధ్యాపకురాలి మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్టు విద్యార్ధినులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు వెయ్యి మంది ఫోటోలను మార్ఫింగ్ చేసిన డేటా నిందితుల వద్ద ఉందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై గురువారం పోలీస్ టోల్‌ఫ్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి విద్యాసంస్థల చైర్మన్ ఛాంబర్‌కు వచ్చి వెళ్లిపోయారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో కేవలం 70 మంది మాత్రమే కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారని తెలిసింది. మిగతా వారంతా డే స్కాలర్స్‌గా ఉంటున్నారు. ఈ మార్ఫింగ్ డేటాను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినట్టు బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసినట్టు విద్యార్థినిలు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు గురజాడ విద్యాసంస్థ వద్దకు చేరుకొని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. విద్యార్ధినులు, అధ్యాపకులతో పాటు బాధితుల తల్లిదండ్రులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి సన్నద్దమవుతున్నారని తెలుసుకొని, వారందర్నీ ఒక గదిలో పెట్టి యాజమాన్యం గట్టిగా కౌన్సిలింగ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మహిళల ఫొటోల మార్ఫింగ్‌లో అబ్బాయిలకు ఓ విద్యార్థిని కూడా సహకరించడం ఇప్ప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page