top of page

ఆరనీకుమా ఈ దీపం..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Dec 29, 2025
  • 1 min read

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ ఫొటోలు చూడండి.. ఎంత ముచ్చటగా ఉన్నాయో! అక్కడి వాతావరణం చూసి కేంద్ర మాజీమంత్రి కృపారాణి కూడా బహుశా ఇలాగే ఫీలై ఉంటారు. అందుకే ముచ్చటపడి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను పేంపర్‌ చేస్తూ ఇలా ఫొటోకు కనిపించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉంటే, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీలపరంగా ఇద్దరిదీ రెండు దారులు. కానీ ఆదివారం జరిగిన కళింగ సామాజికవర్గ పిక్నిక్‌లో కృపారాణి, కూన రవికుమార్‌ ఫొటో చూస్తే మంత్రి పదవి రాలేదని దిగులుచెందకని ధైర్యం చెబుతున్నట్టనిపిస్తుంది కదూ..! ఏమో? అదే వాస్తవం కావచ్చేమో!

ఇంకో ఫొటో చూస్తే ఉప్పు, నిప్పులు ఒకే కుంపటిలో ఎలా ఫైరవకుండా ఉన్నాయని ఆలోచన రాకమానదు. కూన రవికుమార్‌ పక్కనున్న వ్యక్తి మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడు నాని. గడిచిన వైకాపా హయాంలో కూన రవికుమార్‌ను విమర్శించడానికి ఏమాత్రం వెనుకంజ వేయని మేనల్లుడు. ఇక సీతారామ్‌, కూన రవి కోసం ఏమాత్రం ఈ జిల్లా రాజకీయాలు పరిశీలిస్తున్నవారికి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. ఎన్నికల ముందే కాదు.. ఇద్దరూ విడిపోయిన దగ్గర్నుంచీ కంటిన్యూగా కత్తులు దూసుకుంటున్న ప్రముఖులు వీరు. కానీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కళింగ సమ్మేళనంలో కనిపించారు. వీరిద్దరూ ఏ పార్టీలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు మించి ఎప్పట్నుంచి ప్రత్యర్థులుగా ఉన్నారో కూడా ఉటంకించక్కర్లేదు. అంతా కళింగులమేనన్న భావనతో జరిగిన ఈ సమ్మేళనలో ఇలాంటి దృశ్యాలు అనేకం కనిపించాయి. సొంత నియోజకవర్గంలో తమ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు సైతం ఈ సమ్మేళనంలో భుజాన్నెత్తుకొని వేదిక వద్దకు తీసుకువెళ్లడాలు, ఈ పార్టీ, ఆ పార్టీ అని సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా మాట్లాడటాలు కనిపించాయి. అన్నిటికంటే కొసమెరుపేంటంటే.. ఈ సమ్మేళనంలో ఇన్ని పార్టీలు ఒకచోట గుమికూడినా రాజకీయ వాసన లేకుండా ముగించడం. ఈ స్ఫూర్తి, వారి ఆర్తి ఎన్నికల నాటికి ఉంటాదని భావించక్కర్లేదు. ఎందుకంటే.. కులాలతోనే రాజకీయం నడుస్తున్నప్పుడు ఈ సామాజికవర్గం నేతపై ప్రత్యర్థి పార్టీ అదే సామాజికవర్గం నేతతో రంగంలో దిగుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page