ఆశీలు పేరుతో వసూళ్ల రుబాబు!
- BAGADI NARAYANARAO

- Nov 12
- 2 min read
శ్రీముఖలింగేశ్వరుని సాక్షిగా దోపిడీ
పార్కింగ్ స్థలం లేకుండానే దండేస్తున్న కాంట్రాక్టర్
ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటిపైనా దౌర్జన్యం
15 గ్రామాల ప్రజలకు అనవసర భారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అక్కడ ఎటువంటి పార్కింగ్ వ్యవస్థా లేదు. అయినా ఆశీలు పేరుతో కాసులు దండేస్తున్నారు. అదే ఒక తప్పు అనుకుంటే ఆ దారినపోయే వాహనాల నుంచి కూడా రుబాబు చేసి మరీ అశీలు వసూళ్లు సాగిస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే సుమారు 15 గ్రామాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రముఖ శైవక్షేత్రమై శ్రీముఖలింగంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీముఖలింగేశ్వర ఆలయం ఎదురుగానే అక్రమ వసూళ్లు సాగిస్తున్నారు. గ్రామాల్లో ఆశీలు వసూలు సర్వసాధారణం. ఇవే వాటికి ఆదాయ వనరులు. దీనికి పంచాయతీ అధికారుల అనుమతి అవసరం లేదు. పంచాయతీ పెద్దలే నిర్ణయం తీసుకోవచ్చు. మేజర్ పంచాయతీల్లోనూ, ప్రముఖ దేవాలయాలు ఉన్న గ్రామాల్లో మాత్రం పంచాయతీ అధికారులు.. పట్టణాలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీముఖలింగేశ్వరుడు కొలువుదీరిన అతిపురాతన శ్రీముఖలింగం గ్రామంలో పంచాయతీ అధికారుల అనుమతితోనే ఆశీలు వసూలు చేస్తున్నారు. అయితే దేవాలయ సందర్శనకు భక్తులను తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే ఆశీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కార్తీకమాసం, శివరాత్రితో పాటు పండుగలు వంటి కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయం రద్దీగా ఉంటుంది. అందువల్ల ఆయా రోజుల్లో మాత్రమే పోలీసుశాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ నిర్వహణ చూస్తుంటారు. మిగతా రోజుల్లో భక్తులతో వచ్చే వాహనాలను దేవాలయ సమీపంలోనే రోడ్డుకు ఇరువైపుల పార్కింగ్ చేస్తుంటారు. కానీ అక్కడ ఎటువంటి పార్కింగ్ సౌకర్యం లేదు. అయినా టూరిస్టు వాహనాలకు ఆశీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి ద్విచక్ర వాహనాలకు కూడా పార్కింగ్ ఫీజు పేరుతో వసూళ్లు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రద్దీ రోజుల్లో గ్రామ ప్రవేశంలోనే రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల నుంచి ఆశీలు వసూలు చేస్తున్నారు.
రోడ్డు మీద వాహనం కనిపిస్తే చాలు..
శ్రీముఖలింగం మీదుగా కరకవలస, భగీరధపురం, హిరమండలం, బ్యారేజీ సెంటర్, అక్కురాపల్లి, రెళ్లవలస, కిట్టాలపాడు, పిండ్రాడ తదితర గ్రామాల ప్రజలు నిత్యం వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆ గ్రామాల వారికి అదే ప్రధాన మార్గం. కానీ ఆయా గ్రామాలకు చెందిన వాహనదారుల నుంచి కూడా ముక్కుపండి ఆశీలు వసూలు చేస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఆటోలు, కార్లు, టూరిస్టు బస్సులతోపాటు ద్విచక్ర వాహనాలను సైతం రోడ్డుపై నిలబెట్టి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖలింగం దర్శనానికి భక్తులు, ఆలయ సమీపంలో పార్క్ చేసిన వాహనాల నుంచే ఆశీలు వసూలు చేయాలన్నది పంచాయతీ గెజిట్ పేర్కొన్న నిబంధన. కానీ ఏ పనిపై వచ్చారన్నది చూడకుండా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్తీకమాసంలో ఈ దందా మరీ ఎక్కువగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ గెజిట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు శ్రీముఖలింగ ఆలయానికి వచ్చే వాహనాలతోపాటు మార్కెట్, చిల్లర దుకాణాలు, గూడ్స్ వాహనాల నుంచి ఆశీలు వసూలు అధికారాన్ని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.4.88 లక్షలకు వేలంలో దక్కించుకున్నాడు. గెజిట్ ప్రకారం ద్విచక్ర వాహనానికి రూ.10, ఆటోకు రూ.20, కారుకు రూ.30, మినీ బస్సు, వ్యాన్‌కు రూ.70 చొప్పున, లారీ, టూరిస్టు బస్సులకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. అయితే ద్విచక్రవాహనాలకు కూడా వసూలు చేయడాన్ని వాహన చోదకులు తప్పుపడుతున్నారు. ఆలయానికి వచ్చే వాహనాలను దేవదాయ శాఖ నిర్దేశించిన స్థలంలో పార్క్ చేస్తేనే ఆశీలు వసూలు చేయాలి. కానీ రోడ్డు మీద కనిపించే వాహనాలన్నింటికీ ఆశీలు వసూలు చేస్తున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డపై వెళ్లే అన్ని వాహనాల నుంచి ఆశీలు వసూలు చేయడం నిలిపిచేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.










Comments