top of page

ఇంకెప్పుడు నాయకుడివవుతావ్‌!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 5, 2025
  • 3 min read
  • ‘వెన్నుపోటు’లో కనిపించని చిన్ని

  • ఏడాదిగా జనాల్లోకి రాని ధర్మాన తనయుడు

  • సక్సెస్‌ అయ్యాక స్టేట్‌మెంట్లు, డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • అభద్రతా భావంతో వెనుకబడిపోతున్న యువనాయకుడు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘నాన్నగారు ధర్మాన ప్రసాదరావు పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు’’

.. ఇది ధర్మాన రామ్‌ మనోహర్‌నాయుడు సన్నాఫ్‌ ధర్మాన ప్రసాదరావు బుధవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సందేశం.

నిజమే.. వెన్నుపోటు కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ఇన్నాళ్లూ ఆరోగ్యం బాగులేదనో, మరో కారణంతోనో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘వెన్నుపోటు’ విజయవంతానికి తెర వెనుక కృషి చేశారు. తన నియోజకవర్గంలో రెండు మండలాలు, నగరంలో ఉన్న కేడర్‌తో సమావేశాలు నిర్వహించి వెన్నుపోటును ఎందుకు విజయవంతం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఇది కాదనలేని సత్యం. ఆ మాటకొస్తే వైకాపానే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠగా తీసుకుంది. బహుశా ధర్మాన ప్రసాదరావు కూడా అందుకే ఏడాది తర్వాత తొలిసారిగా యాక్టివేట్‌ అయ్యారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. తండ్రి మంత్రిగా ఉన్నప్పుడో, లేదూ తండ్రి ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడో అన్నీ తానేనని ప్రకటించుకోడానికో, లేదూ నిరూపించుకోడానికో నిత్యం పరామర్శలు, పలకరింపులు, పల్లెనిద్రలు పేరుతో మీడియాలో కనిపించిన ధర్మాన తనయుడు రామ్‌మనోహర్‌ నాయుడు బుధవారం జరిగిన వెన్నుపోటు కార్యక్రమంలో ఎక్కడ? అనే ప్రశ్న తలెత్తితే ఏం చెబుతారు? ‘వెన్నుపోటు’కే వెన్నుపోటు పొడిచారా? దీనికి సమాధానం ఎవరు చెబుతారు?

2024లో వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడా జనాల్లో కనపడని రామ్‌మనోహర్‌ నాయుడు కనీసం తండ్రి తరఫున వెన్నుపోటు కార్యక్రమంలో కూడా పాల్గొనకపోవడం గమనార్హం. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గం వరకు ఆయనే అంతా అయి వ్యవహరించారు. పలకరింపులు, పరామర్శలు, సమస్య పరిష్కరించామన్న స్టేట్‌మెంట్లు అన్నీ ఆయనే ఇచ్చేవారు. ఇప్పుడు తన ఆరోగ్యం సహకరించడంలేదంటూ ధర్మాన ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు దూరమైనా కనీసం ఆయన తరఫున ఆయన తనయుడు కూడా యాక్టివ్‌ కాకపోవడంతో నువ్వెప్పుడు నాయకుడివవుతావు చిన్నిబాబు అంటూ వైకాపా కార్యకర్తలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? బుధవారం నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపించినా తమ నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మహామహులంతా ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోయినా జగన్మోహన్‌రెడ్డి నుంచి ఎటువంటి నష్టమూ జరగని సీనియర్లు కూడా ఉన్నారు. కానీ చిన్ని ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడేంటి? ఎన్నికల రిజల్ట్‌ వచ్చిన దగ్గర్నుంచి ఆయన కనపడకుండాపోయారు. ఎప్పుడైనా నాయకత్వ లక్షణాలు బయటపడాలంటే, లేదూ ఒక నాయకుడిగా ఎదగాలంటే గుంపు నుంచి విడిపోతే సాధ్యంకాదు. అలాగని గుంపులో కలిసిపోయినా సాధ్యంకాదు. గుంపునకు నాలుగడుగుల ముందు నడవాలని నెపోలియన్‌ చెప్పేవాడు. ధర్మాన ప్రసాదరావు ఇదే సూత్రం ఫాలో అయి ఇంత స్థాయికి ఎదిగారు. నాయకులు ఏసీల్లోను, కేడర్‌ మండుటెండలోను నడవాలా? అనే ప్రశ్న తలెత్తితే చిన్నీ ఏం చెబుతారు? బుధవారం వెన్నుపోటు కార్యక్రమం జరిగినప్పుడు చిన్నీ శ్రీకాకుళంలోనే ఉన్నారు. కానీ నలుగురితో పాటు ర్యాలీలో కనిపించలేదు. సాయంత్రం మాత్రం విజయవంతమైన కార్యక్రమాన్ని తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఏమాత్రం నాయకుడి లక్షణం కాదు. ధర్మాన ప్రసాదరావు ఎన్నికల్లో కేవలం ఓడిపోయారు అంతే.. లొంగిపోలేదు. ఓటమి వేరు, లొంగిపోవడం వేరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అనేది ఆయన వ్యూహంలో ఒక భాగం కావచ్చు. లేదూ అంటే అనారోగ్యమూ ఉండొచ్చు. కానీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాకు వెళితే రామ్‌మనోహర్‌నాయుడుకు కూడా దండం పెట్టి వెళ్లాలని భావించిన వైకాపా కేడర్‌కు ఏడాదిగా ఎందుకు చిన్నీ కూడా అందుబాటులో లేకుండాపోయారు? ధర్మాన ప్రసాదరావు వారసత్వాన్ని రాజకీయంగా కూడా అందుకోవాలని చూస్తున్న చిన్నీ వెన్నుపోటు కార్యక్రమంలో కూడా కనపడకపోవడం చూస్తే ఇంకెప్పుడు నాయకుడవుతాడన్న ప్రశ్న తలెత్తక మానదు. పక్కనే ఉన్న నరసన్నపేట నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్‌, ఆ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబుతో పాటు ఇచ్ఛాపురంలో జరిగిన వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొంటే, నరసన్నపేటలో కేడర్‌ను నిన్న రోడ్డు వెంబడి పరుగెత్తించింది కృష్ణదాస్‌ తనయుడు కృష్ణచైతన్య. అక్కడ కూడా ఈ కార్యక్రమం హిట్టయింది. దీనికి కర్త, కర్మ, క్రియ కృష్ణచైతన్యే అయి వ్యవహరించారు. ఇదే ధర్మాన కుటుంబం నుంచి పక్క నియోజకవర్గంలో తన సోదరుడు నాయకుడుగా ఎదుగుతున్నా, రాజకీయాల శైలి మారుతున్నా ఇంకా రామ్‌మనోహర్‌నాయుడు మాత్రం ప్రకటనలిచ్చి పబ్బం గడుపుకోవాలని చూడటం విడ్డూరం. అలా అని నగరంలోనో, ఈ నియోజకవర్గంలో ఉన్న మిగిలిన మండలాల్లోనో రామ్‌మనోహర్‌నాయుడు చెబితే వినని కేడర్‌ లేదు. ఆ ధీమాతోనే కదా.. జగన్మోహన్‌రెడ్డి పాలకొండ వచ్చినప్పుడు ధర్మాన బంగ్లా నుంచి అందరూ బయల్దేరాలని చిన్నీ పిలుపునిచ్చింది. ధర్మాన ప్రసాదరావు పిలుపు ఇవ్వకుండానే ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిని ప్రమోట్‌ చేయడానికి ప్రతీ డివిజన్‌లోనూ ఉచిత వైద్యశిబిరాలు రామ్‌ మనోహర్‌నాయుడు ఏర్పాటుచేశారు. దీనివల్ల ఎంతమంది రోగులు ఆరోగ్యవంతులయ్యారో తెలియదు కానీ, ఒక పేద వైకాపా డివిజన్‌ ఇన్‌ఛార్జికి రూ.50వేలకు తక్కువ కాకుండా ఆ సమయంలో ఖర్చయింది. చిన్నీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కేడర్‌కు భోజనాలు, స్వాగత ఏర్పాట్లకే ఇంత ఖర్చు చేసినా, 2024లో ఓటమి తర్వాత చిన్నీ ఎవరికీ అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. ఎన్నిల్లో గెలుపోటములు సాధారణమని, తన తండ్రి తరఫున నేనున్నానని భరోసా ఇచ్చిన ప్రకటన ఒక్కటి కూడా రామ్‌మనోహర్‌నాయుడు చేయలేదు. ఏడాది కాలంలో వైకాపా చేపట్టిన ఏ కార్యక్రమాన్నీ ఆయన ఓన్‌ చేసుకోలేదు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు, విద్యుత్‌ ఛార్జీల పెంపుదల మీద నిరసన చేపట్టినప్పుడు చిన్నీ ఈమేరకు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. వాటిని కూడా ధర్మాన ముఖం చూసే కేడర్‌ అంతో ఇంతో సక్సెస్‌ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమైనా, ఫెయిలైనా అందుకు పూర్తి బాధ్యత ధర్మానదే. దీనికోసం ప్రత్యేకంగా క్రెడిట్‌లు, క్రెడెన్షియల్‌లు ఇచ్చుకోనక్కర్లేదు. ఎందుకంటే.. ఇక్కడ ఉన్నది ధర్మాన ప్రసాదరావు మాత్రమే. పక్కనే ఉన్న ఆమదాలవలస, ఎచ్చెర్ల మాదిరిగానో, జిల్లా బోర్డర్‌లో ఉన్న ఇచ్ఛాపురం మాదిరిగానో మరో నాయకత్వం వైకాపాకు లేదు. ఇక్కడ ఎవరు చేసినా ధర్మాన కోసమే చేయాలి. ఎవరు ముసుగేసి పడుకున్నా ధర్మాన శైలి మీద అలిగే పడుకోవాలి.. తప్ప ధర్మానకు ధీటుగా పని చేశామని చెప్పే నాయకత్వం లేదు. అంతే ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు నాన్నగారి పిలుపు మేరకు విజయవంతం చేసిన అని నొక్కి వక్కానించడం చూస్తుంటే చిన్నీ అభద్రతతో ఉన్నారని తెలుస్తుంది. రాజకీయంగా అభద్రతా భావంతో ఉండటంలో తప్పులేదు. కానీ ఇలా ప్రజాక్షేత్రంలోకి రాకుండా నా పల్లకీ మోయండి బోయిల్లారా.. అంటే రాజకీయాలు ఇప్పుడలా లేవు. ఈరోజు కాకపోతే రేపైనా వైకాపా జిల్లా పగ్గాలు ధర్మాన చేతికొస్తాయి. గట్టిగా మాట్లాడితే ఇప్పటికే ఉన్నట్టు లెక్క. ఎందుకంటే.. కృష్ణదాస్‌, ధర్మాన ఇప్పుడు వేరు కాదు. ఎప్పుడూ కాదు. కాకపోతే తన కొడుకు కృష్ణచైతన్యకు టిక్కెటివ్వాలని దాస్‌ ఓపెన్‌గానే అడుగుతున్నారంటే అందుకు కారణం కృష్ణచైతన్య యాక్టివిటీనే. ధర్మాన ప్రసాదరావుకు ఆయన కుమారుడు కూడా ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నా బహిరంగంగా ప్రకటించకపోవడానికి కారణం చిన్నీ అధికారంలో లేనప్పుడు ఇనాక్టివ్‌గా స్టేట్‌మెంట్లకు పరిమితం కావడమే. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ధర్మాన ప్రసాదరావు చేతిలో జిల్లాను పెడితే జగన్మోహన్‌రెడ్డిని ఒప్పించి టిక్కెట్‌ అడిగితే రామ్‌మనోహర్‌ నాయుడు ఏం చేశాడన్న ప్రశ్న తలెత్తితే ఏం చెప్పాలి? ధర్మాన కొడుకుగా ఉండటం ఒక్కటే ఎమ్మెల్యే కావడానికి క్వాలిఫికేషన్‌ కాదు. నాయకుడిగా ముందుండాలి.. ముందు తరాల కోసం ఉండాలి.. అన్నింటికీ మించి నేనున్నానని భరోసా కలిగించగలగాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page