top of page

ఇంటి కోసం ఇంత మంకుపట్టా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 6 days ago
  • 2 min read

ree

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి మరో రాజకీయ వివాదానికి దారి తీసింది. ఓడిపోయిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నివాసగృహాలను ఖాళీ చేసే అంశం ఇప్పుడు బీహార్‌లో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు రాజేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగోసారి నితీష్‌కుమార్‌ నేతృత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకే మాజీ ప్రజాప్రతినిధులైన ఆర్జేడీ వ్యవస్థాపకులైన మాజీ సీఎం లాలు`రబ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఎస్టేట్స్‌ విభాగం నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ తప్పుపడుతోంది. ప్రభుత్వ భవనాలను వాడుకోవడం తమ హక్కు అన్నట్లు మాజీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనం. లాలూ`రబ్రీలను ప్రభుత్వ బంగ్లాను నుంచి ఖాళీ చేయాలనుకోవడం రాజకీయ ప్రతీకార చర్య అని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగనిలాల్‌ మండల్‌ విమర్శించారు. తాము ఏమైనా చేస్తాం.. కానీ బంగ్లాను మాత్రం ఖాళీ చేసేది లేదని స్పష్టీకరించారు. పైగా లాలూ కుటుంబంపై రాజకీయ ద్వేషంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ, అధికార వ్యవస్థల్లో అనేక మార్పులు జరిగినా ఈ అంశాన్ని ఎవరూ లేవనెత్తలేదని గుర్తు చేయడం ద్వారా అధికారంలో లేకపోయినా, ప్రజాప్రతినిధులు కాకపోయినా లాలూ కుటుంబం ప్రభుత్వ భవనాన్ని రెండు దశాబ్దాలుగా వాడుకుంటున్న విషయాన్ని అంగీకరించారు. పైగా ఇప్పటివరకు ఎందుకు ఖాళీ చేయించలేదని దబాయిస్తూ.. ఇన్నాళ్లూ మౌనం వహించిన పాపానికి ఇప్పుడు ఖాళీ చేయమనే అధికారాన్ని ప్రభుత్వం కోల్పోయినట్లు, ప్రభుత్వ భవనాన్ని జీవితాంతం వాడుకోవడానికి ఆర్జేడీ అధినేత కుటుంబానికి సంక్రమించినట్లు మంగనిలాల్‌ భావిస్తున్నట్లుంది. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ నాయకత్వం మెప్పు కోసమే సీఎం నితీష్‌ ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపించడం ద్వారా ప్రభుత్వపరంగా జరిగిఏ ఈ ప్రక్రియకు రాజకీయాన్ని ఆపాదించేశారు. రాష్ట్ర హోం శాఖను బీజేపీకి అప్పగించడం లాలూ కుటుంబాన్ని అవమానించడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు. హెడిరగ్‌ రోడ్‌లో ప్రస్తుతం లాలూ కుటుంబం నివసిస్తున్న భవనాన్ని కల్పిత వాదనలతో ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోందని మండల్‌ ఆరోపించారు. ఆ భవనం విషయంలో ఆర్జేడీ పట్టుకు వేరే కారణాలు ఉన్నాయి. బీహార్‌ రాజధాని పాట్నాలోని వీఐపీ ప్రాంతంలో ఉన్న నెం.10 సర్క్యులర్‌ రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లా దాదాపు ఇరవై ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. మాజీ సీఎంలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవి తమ రాజకీయ కార్యకలాపాలను, అధికార వ్యవహారాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న కేంద్రం ఇది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్ష ఆర్జేడీకి ముఖ్య కార్యాలయం లాంటిది. కానీ ఇప్పుడు ఆ భవనాన్ని ఖాళీ చేయమని నితీష్‌ ప్రభుత్వం లాలూ`రబ్రీ కుటుంబానికి నోటీసులు పంపింది. 2005కి ముందు సుమారు ఒకటిన్న దశాబ్దంపాటు లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవిలు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో వారి కుటుంబం మొత్తం ఏక్‌అని మార్గ్‌లోని ప్రభుత్వ నివాసంలో నివసించారు. అయితే 2005 నవంబర్‌లో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఏక్‌అని మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనం నితీష్‌కు దక్కగా, అంతవరకు అక్కడ నివసించిన లాలూ కుటుంబానికి ఆ పక్కనే ఉన్న సర్క్యులర్‌ రోడ్డులోని నెం.10 బంగ్లా కేటాయించారు. ఇక అప్పటి నుంచి రెండు దశాబ్దాలుగా అదే వారి నివాసంగా, రాజకీయ స్థావరంగా మారింది. ఈ రెండు దశాబ్దాల్లో పలుమారు అధికారం చేతులు మారినా వీరి నివాసం మాత్రం మారలేదు. 2015లో గ్రాండ్‌ అలయన్స్‌(మహా ఘటబంధన్‌) ప్రభుత్వం ఏర్పడినప్పుడు తేజస్వియాదవ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో వారికి నెం.5 దేశరత్న మార్గ్‌లో ఉన్న ప్రభుత్వ నివాసం కేటాయించారు. 2017లో ఆ ప్రభుత్వం కూలిపోవడంతో బంగ్లాను ఖాళీ చేయమని ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. కానీ దాన్ని తేజస్వి సవాలు చేయగా హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 2019 ఫిబ్రవరిలో ఇచ్చిన మరో తీర్పులో హైకోర్టు తేజస్వి నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించడమే కాకుండా, మాజీ ముఖ్యమంత్రులకు కల్పించిన ప్రభుత్వ వసతి, భద్రత, సిబ్బంది తదితర సౌకర్యాలను రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం లాలూ`రబ్రీలు తాము నివసిస్తున్న ప్రభుత్వా భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. కానీ ఆ సమయంలో రబ్రీదేవి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉండటంతో ఆ హోదాలో ఆమెకు నెం.10, సర్క్యులర్‌ రోడ్‌లోని ప్రభుత్వ భవనంలో ఉండటానికి అనుమతి లభించింది. ఇప్పుడు ఆ పదవీ లేదు.. హోదా కూడా లేదు. అయితే మాజీ సీఎంల కోటాలో లాలూ`రబ్రీలకు హార్డింగు రోడ్డులో నివాసం కేటాయిస్తూ భవన నిర్మాణ శాఖ జాయింట్‌ సెక్రటరీ కమ్‌ ల్యాండ్‌ ప్రాపర్టీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు నెం.10 సర్క్యులర్‌ రోడ్‌ నివాసాన్ని ఖాళీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన లాలూ దంపతుల పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌కు కేటాయించిన ప్రభుత్వ నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు. నెం. 26, ఎం. స్ట్రాండ్‌ రోడ్‌లోని ఈ బంగ్లాను కొత్త మంత్రి లఖేంద్రకుమార్‌ రోషన్‌కు కేటాయించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓడిపోయిన, రిటైర్‌ అయిన ప్రజాప్రతినిధులు అంతవరకు తాము ఉంటున్న ప్రభుత్వ నివాస భవనాలను నిర్ణీత గడువులోపు ఖాళీ చేయాలని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అలా ఖాళీ అయ్యే వాటిని కొత్తగా ఎన్నికైనవారికి కేటాయిస్తుంటారు. కానీ పలువురు నాయకులు పదవులు, అధికారం కోల్పోయినా భవనాలను పట్టుకుని వేలాడటం వారి నిబద్ధతకు, విశ్వసనీయతకు మచ్చగా మిగిలిపోతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page