top of page

ఇంతకు మించి అంటే కష్టం గురూ..!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 15 minutes ago
  • 4 min read
  • పాస్‌లకు పిల్లలు పుట్టాయి

  • చుక్కలు చూసిన వీవీఐపీలు, వీఐపీలు

  • వచ్చిన జనానికి సిక్కోలు రోడ్లు సరిపోలేదు

  • అరసవల్లిని ముంచెత్తిన భక్తజన సునామీ

  • సామాన్యుల క్యూలైన్ భక్తుల్లో సంతప్తి

  • అందరికీ భాగస్వామ్యం కల్పించి ఉంటే మరింత సక్సెస్

  • పోలీసులకు రెస్ట్‌లెస్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నువ్వు వీఐపీవి కావు.. ఏ కోణంలో చూసుకున్నా ఆ హÃదాకు సరితూగవు.. కానీ నీ చేతికి వీవీఐపీ పాస్ వచ్చిందంటే ఏమనుకోవాలి? ఎంతమందికి ఇలా వచ్చి ఉండాలి?? అలాంటప్ప్పుడు అరగంటలో సూర్యనారాయణస్వామి దర్శనమైపోతుందని ఎలా అనుకుంటావు??? ఇందుకు ఎవర్ని నిందిస్తావు????’
‘సూర్యమహల్ జంక్షన్ వద్ద ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్‌స్టాల్‌లో నూడుల్స్ తిన్న ఓ కస్టమర్ ఫోన్‌పే చేయడానికి జేబులో ఉన్న ఫోన్ బయటకు తీయబోతే దాంతోపాటు భళ్లున ఓ పది వీవీఐపీ పాస్‌లు అతని జేబు నుంచి బయటకు జారిపడ్డాయి. ఇంత విరివిగా అందరి చేతుల్లో పాసులున్నప్ప్పుడు ప్రశాంతంగా దర్శనాలవుతాయని ఎలా అనుకున్నారు?’
‘గత ఏడాది రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజుల పాటు నిర్వహిస్తే వచ్చినంత స్పందన.. ఈసారి ఏడు రోజుల సప్తాహంగా నిర్వహించినప్పటికీ కేవలం శోభాయాత్ర ఒక్కరోజులోనే కనిపించింది. ఎంతమంది ఈ వేడుకకు రాబోతున్నారో అర్థం చేసుకోకపోవడం ఎవరి తప్ప్పు?’
‘ఏడు రోజుల పాటు ఒక రోజుకు మించి మరోరోజు కార్యక్రమాలు నిర్వహించి.. ఒకదాన్ని మించి మరోదాన్ని విజయవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల దష్టిని ఆకర్షించిన తర్వాత పోటెత్తే జనవాహినికి శ్రీకాకుళం రోడ్లు, అరసవల్లి వీధులు సరిపోతాయని భావించడం ఎవరి తప్ప్పు?’
క్యూఆర్ కోడ్ స్కానింగే లేదు

సునామీ వస్తే కొట్టుకుపోవాల్సిందే తప్ప, తప్పించుకుంటామనుకోవడం మూర్ఖత్వం. ఈసారి రథసప్తమి వేడుకకు భక్తజన సునామీయే చుట్టేసింది. ఎంతమంది వచ్చారని లెక్క కట్టడం ఇప్ప్పుడప్ప్పుడే అయ్యే పని కాదు. ఎందుకంటే ఏ లెక్కకూ తేలని అంకె ఇది. శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు నగరంలో కాలు పెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొనడం చరిత్రలో ఇదే తొలిసారి. లెక్కకందని అంకె అని ఎందుకంటున్నామంటే.. ఎన్ని వీఐపీ పాస్‌లు ముద్రించారు? ఎన్ని వీవీఐపీ పాస్‌లు పంపిణీ చేశారు? ఆన్‌లైన్‌లో క్షీరాభిషేకం టిక్కెట్లు ఎన్ని ఇచ్చారు? రూ.300 టిక్కెట్లు ఎంతమంది కొనుగోలు చేశారు? రూ.100 టిక్కెట్లు ఎంతమంది బుక్ చేసుకున్నారు? అన్న లెక్కలు తేలాలంటే మరో రథసప్తమి రావాలి. లేదా ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒక అంకె చెప్పాలి. వాస్తవానికి ప్రతి టిక్కెట్ మీద, ప్రతి పాస్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసిన తర్వాతే దర్శనానికి పంపాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌లోడ్ చేయించారు. అంటే.. తిరుపతి మాదిరిగా ఆధార్‌లో ఉన్న వ్యక్తి వస్తేనే దర్శనం కల్పించాలని అర్థం. కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే పరిస్థితి లేకుండాపోవడంతో దుర్వినియోగం వెర్రితలలు వేసింది. అప్ప్పుడే ఒక టిక్కెట్ లేదా పాస్ వంద పిల్లలు పెట్టింది. జిరాక్స్ షాపులు కలర్ జిరాక్స్ కాపీలు తీసే వ్యాపారాన్ని ఎడతెరిపి లేకుండా చేశాయి. ఇటువంటి చేష్టýతో పనిలేకుండా క్యూలైన్లు నమ్ముకున్న వారు మాత్రం అంతే భక్తితో దేవుడిని దర్శనం చేసుకొచ్చారు. తాము వీఐపీలమని, వీవీఐపీలమని బిల్డప్పులిస్తూ పాస్‌లతో వచ్చినవారు ఫెయిలైపోయారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొన్నవారు డబ్బులు వేస్టని భోరుమన్నారు.

కొందరికే కష్టం.. ఎందరికో ఇష్టం

దేశవ్యాప్తంగా ఈసారి రథసప్తమికి విపరీతమైన హైప్ వచ్చింది. అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. ఇకనుంచి రథసప్తమిని ఒకరోజు నిర్వహిస్తామంటే కుదరదేమో?! తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాకుండా పది రోజులు జరిపి భక్తుల ప్రాణాలు కాపాడినట్టు ఈసారి రథసప్తమిని కూడా ఎక్కువ రోజులు చేయాలేమో? అరసవల్లిలో రథసప్తమి నిర్వహణ హిట్టో, ఫట్టో చెప్పడం కష్టం. ఇందులో ఎవరి వాదనలు వారికున్నాయి. కొందరికి అతి సులువుగా దర్శనమైతే.. మరికొందరు ఏకంగా యుద్ధమే చేయాల్సివచ్చింది. అధికార యంత్రాంగం ఏడు రోజులుగా ఊపరి సలపని ఒత్తిడితో అలసిపోయింది. మరీ ముఖ్యంగా పోలీసులకైతే కంటి మీద కునుకు లేదు. సప్తాహం జరిగినన్నాళ్లూ వీరిదే కీలక పాత్ర. స్టేడియంలోకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తే, జనాల్ని కంట్రోల్ చేసింది పోలీసులే. అంతకు ముందురోజు నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తే బందోబస్తు నిర్వహించిందీ పోలీసులే. ఇక రోజువారీ కార్యక్రమాలకు పోలీసులదే రక్షణ బాధ్యతని వేరేగా చెప్పనక్కర్లేదు. చివరి రోజు మొత్తం యూనిఫాం వేసుకొన్న యంత్రాంగమంతా అక్కడే ఉన్నా జనసునామీని అదుపు చేయలేకపోయారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జరిగే విజయనగరం సిరిమానోత్సవం విజయవంతంగా నిర్వహిస్తున్నప్ప్పుడు ఒకరోజు నిర్వహించే రథసప్తమిని కట్టుదిట్టంగా ఎందుకు నిర్వహించలేకపోయారనే ప్రశ్న తలెత్తొచ్చు. విజయనగరంలో ఉన్న బంధువులింటికి కక్కాముక్కా తిని సిరిమానుకు దూరంగా నిల్చొని దండం పెట్టుకునే సందర్భమది. కానీ ఇక్కడ నడినెత్తిన సూర్యుడున్నా నాలుగు గోడల మధ్య దర్శనానికి ఎగబడే సందర్భమిది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జనాలొస్తే పోలీసు యంత్రాంగంతో కట్టడి చేయడం కుదిరే పని కాదు. ఓవరాల్‌గా ఇది శ్రీకాకుళం చరిత్రలో ఎప్ప్పుడూ జరగనంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

అందరికీ భాగస్వామ్యం కల్పించాల్సింది

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నట్టు రాష్ట్రవ్యాప్త పండగ అన్నప్ప్పుడు సమన్వయ కమిటీని వేసి, అందరి అభిప్రాయాలూ తీసుకొని అందర్నీ భాగస్వాములు చేసుంటే డివైడ్ టాక్ వచ్చి ఉండేది కాదు. అలాగే మున్సిపల్ మంత్రి నారాయణపై ఒత్తిడి తెచ్చి రూ.2 కోట్లు మంజూరు చేయించుకోవడం నుంచి (నిధులు ఇంకా విడుదల కాలేదు) కార్యకర్తలకు అవసరమైన రూ.300 టిక్కెట్లు సొంత డబ్బులతో కొనుగోలు చేసినంత వరకు అన్నింటిలోనూ ఎమ్మెల్యే గొండు శంకర్ ఒక్కరే కాకుండా ఇది కేవలం హెడ్‌క్వార్టర్ పండుగగా మాత్రమే భావించకుండా తలా ఒక బాధ్యత అప్పగించి ఉంటే సజావుగా జరిగి ఉండేది. ఎక్కడైతే వీఐపీ, వీవీఐపీ పాస్‌లు అధికంగా ముద్రించారన్న టాక్ వచ్చిందో, అదే చోట నగరంలో మాత్రం ఎమ్మెల్యే, నగర పార్టీ అధ్యక్షుడు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసి క్యాడర్‌కు పంచారు. టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్ క్షీరాభిషేకం టిక్కెట్లు 53 కొనుగోలు చేసి 50 డివిజన్లలో పార్టీ ఇన్‌ఛార్జి కుటుంబాలకు ఇచ్చారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఆన్‌లైన్‌లో రూ.300 టిక్కెట్లు వెయ్యి కొనుగోలు చేసి తన కార్యాలయం ద్వారా కేడర్‌కు పంపిణీ చేశారు. తీరా చూస్తే క్యూలైన్‌లో ఈ టిక్కెట్లు చూసే నాధుడే లేకుండాపోయాడు. దీంతో ఏది ఫ్రీలైనో, ఏది క్యూలైనో పట్టుకోవడం కష్టమైంది. అలా కాకుండా ఏదో ఒక సమయంలో సూర్యభగవానుడిని దర్శించుకుంటే చాలు అన్న భావనతో పోలీసుల మాట విని క్యూలైన్లలో వెళ్లినవారు మాత్రం కుమ్ములాట లేకుండా నాలుగు గంటల లోపు దర్శనం చేసుకొచ్చారు. అలా కాకుండా టిక్కెట్లు, పాస్‌లు చూపించి వేరే లైన్ ద్వారా వెళ్లినవారు మాత్రం చుక్కలు చూసొచ్చారు.

అర్ధరాత్రి వరకు జనకెరటం

గత ఏడాది 1.10 లక్షల నుంచి 1.20 లక్షల మధ్యలో ఆదిత్యుని దర్శించుకున్నారనేది పోలీసువర్గాల లెక్క. ఈ ఏడాది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నాటికి 2.20 లక్షల మంది దర్శించుకున్నారని ఒక అంచనాకు వచ్చారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికే కలెక్టర్ దినకర్ 1.40 లక్షల మంది దర్శించుకున్నారని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే స్థానికంగా ఉన్నవారు నగరానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గాల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండటం వల్ల అనేక ప్రాంతాల నుంచి వారు పోటెత్తేశారు. దేవదాయ శాఖ దగ్గర ఉన్న లెక్కల మేరకు మూడువేల క్షీరాభిషేకం టిక్కెట్లు విక్రయించారు. టిక్కెట్‌కు ఇద్దరు వెళ్లే అవకాశం ఉంది. అలాగే 1400 మందికి డోనార్ పాస్‌లు అందాయి. ఒక పాస్‌కు నలుగురికి అవకాశం ఉంది. మూడువేల మందికి రూ.300 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించారు. రూ.100 టిక్కెట్లు ఎన్ని అనేది ఇంకా లెక్క తేలలేదు. ఇవి కాకుండా ఉచిత దర్శనాల గురించి ఎవరికి తోచింది వారు ఊహించుకోవడమే. ఈసారి ఆలయం లోపల మంత్రులు, ప్రజాప్రతినిధుల తాకిడి ఎక్కువైంది. వీరి కోసం ఆలయంలో ఉత్తర ద్వారాన్ని కూడా తెరిచారు. అలా అయితేనే ప్రధాన ద్వారం నుంచి మిగిలిన భక్తులకు దర్శనం నిరంతరాయంగా కల్పించగలమని భావించారు. ఇందులో సక్సెస్ అయ్యారు. కాకపోతే వైకుంఠ ఏకాదశినాడు కాకుండా మిగిలిన రోజుల్లో ఉత్తర ద్వారం తెరవడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమా? కాదా? అనే దాంట్లో ఎవరి వాదనలు వారికున్నాయి. ఉగాది రోజున తెలుగుదేశం కార్యాలయంలో పంచాంగం చదివేవారు చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతారు. వైకాపా కార్యాలయంలో చదివిన మరో పండితుడు జగన్మోహన్‌రెడ్డిదే రాజ్యమంటారు. ఎవరి నమ్మకాలు వారివి. అలాంటిదే ఇది కూడాను. వీవీఐపీ కింద కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన పాస్‌లు దాదాపు వెయ్యి నుంచి రెండువేల లోపు ఉండొచ్చనేది ఒక అంచనా. కానీ అక్కడికి వచ్చినవారి సంఖ్యను చూస్తే అక్కడికి మూడు రెట్లు ఎక్కువ కనిపించింది. నిజంగా అన్ని పాస్‌లు ఇచ్చారా? లేదా కలర్ జిరాక్స్‌లు పుట్టుకొచ్చాయా? అన్నది భేతాళ ప్రశ్నే. ఈ రష్ చూసి దర్శనాలకు రావద్దంటూ కలెక్టర్ పదే పదే ప్రకటించడం అంచనాలు తప్పాయనడానికి నిదర్శనం. గత ఏడాది రథసప్తమికి ఆలయ ఆదాయం రూ.78 లక్షలు వస్తే, ఈసారి రూ.1.10 కోట్లు వచ్చింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page