ఉత్తరాంధ్రకు దక్కిన ఘనమైన అవకాశం
- BAGADI NARAYANARAO

- 32 minutes ago
- 2 min read
వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసిన బొత్స
పార్టీలో పెరిగిన ప్రాధాన్యతకు సంకేతం

(సత్యంన్యూస్, అమరావతి)
సాధారణంగా పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు వరించినవారు రైళ్లలో ఉచిత ప్రయాణం లభిస్తుందనే ఆశతో దాన్ని అందుకోరు.. పోయినప్ప్పుడు కూడా వంటిపై జాతీయ పతాకాన్నుంచి పోలీసు వందనంతో సాగనంపుతారనే ఒక గౌరవం కోసం చూస్తుంటారు. ఆగస్టు 15న జెండా ఎగరేయడం, జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వంటివి ఇటువంటి గౌరవాలే. దేశవ్యాప్తంగా జరిగే గణతంత్ర దినోత్సవాన్ని అందరిలాగే రాజకీయ పార్టీల కార్యాలయాలు కూడా నిర్వహిస్తాయి. అందులో ఆ పార్టీ అధినేతలు, లేదా వారి వారసులు మాత్రం ఈ జెండా ఎగరేయడానికి ముందుకొస్తారు. అటువంటి అరుదైన అవకాశం ఉత్తరాంధ్ర నుంచి తొలిసారిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైకాపా కార్యాలయంలో జెండా ఎగురవేసే అరుదైన అవకాశం దక్కింది.
ప్రాంతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ఒక ప్రాంతానికి చెందిన నాయకుడికి సాధ్యం కాదు. అలాంటిది శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఈ అరుగైన గౌరవాన్ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కల్పించడంపై ఉత్తరాంధ్రాలో వైకాపా నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి సజ్జల రామకష్ణ కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తూ వచ్చారు. ఈ ఏడాది సజ్జల స్థానంలో బొత్సతో జాతీయ జెండాను ఎగురవేయించడం రాజకీయంగా పార్టీలో చర్చ సాగుతుంది. రానున్న రోజుల్లో పార్టీలో బొత్స స్థానం కీలకం కానుందని వైకాపా నాయకులకు పరోక్ష సంకేతం ఇచ్చారు. కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన బొత్సకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బీసీ కోటాలో 2012లో సీఎం పదవి లభిస్తుందని ఆశించినా, చివరి నిమిషంలో తప్పిపోయింది. ఆతర్వాత పీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతూ 2014 ఓటమి తర్వాత వైకాపాలో చేరి 2019లో విజయం సాధించి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఐదేళ్లు పాటు కొనసాగారు. 2024లో ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్‌ఛార్జిగా నియమించి ఆయన సేవలను పార్టీ కోసం జగన్ వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎంపిక చేసి ప్రతిపక్ష నేతగా శాసనమండలికి ఎన్నుకున్నారు. బొత్సపై పూర్తి విశ్వాసంతో ప్రభుత్వ స్థాయిలో, పార్టీలో ముఖ్య పాత్రను పోషించే అవకాశం కల్పించడం పట్ల వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐక్యత, గ్రామస్థాయిలో బలోపేతం, ప్రజా సంక్షేమం కోసం బొత్స అనుభవాన్ని సీఎం జగన్ సమర్థంగా వినియోగించుకోవడానికి నిర్ణయించినట్టు భావిస్తున్నారు. 2029లో ఉత్తరాంధ్రలో పార్టీకి పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న బొత్సకు మరో అరుదైన అవకాశం దక్కింది.

జగన్‌కు ఉత్తరాంధ్ర ఎప్ప్పుడూ ప్రత్యేకమే
భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పట్ల ప్రజలందరూ నిబద్ధతతో ఉండాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రను ఆర్థిక, పరిపాలనా హబ్‌గా అభివృద్ధి చేయాలనే స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సమానంగా అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం కల్పించడం పట్ల జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.










Comments