ఇంధన ఒత్తిళ్లకు ఇథనాల్‌తో చెక్!
- DV RAMANA
- 23 hours ago
- 2 min read

తన మాట వినకుండా రష్యాతో వాణిజ్య బంధం కొనసాగిస్తున్నామన్న కక్షతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నారు. భారత్ ఒక సార్వభౌమాధికార దేశమని మర్చిపోయి అవాకులు చవాకులు పేలుతున్నారు. ముఖ్యంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు, నాటో కూటమి విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ట్రంప్ దొర 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నామని.. తమ దేశ ఆర్థిక, వాణజ్య భద్రతకు ఇది అత్యావశ్యకమని భారత్ స్పష్టం చేస్తోంది. అయినా భారత వాదనను వినిపించుకోకుండా ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను కూడా నిలిపివేసి ఏకపక్షంగా 25 శాతం వాణిజ్య సుంకాలను విధించేశారు. ప్రస్తుతానికి దీనిపై భారత ప్రభు త్వం కాస్త మౌనం, సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ మౌనం వెనుక ఒక వ్యూహ రచన జరుగుతోంది. అదే ముడిచమురు దిగుమతులను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలన్నదే ఆ వ్యూహంగా కనిపిస్తోంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ మోతాదు పెంచడం ద్వారా చమురు దిగుమతుల భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మన దేశంలో ముడి చమురు నిల్వలు పెద్దగా లేవు. అందుకే అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతంలో రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా సహా 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేయగా.. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్‌లో ఉద్రిక్తలు, అమెరికా పెత్తందారీ ధోర ణుల నేపథ్యంలో ఇప్పటికే చమురు కొనగోళ్లకు వేరే దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంది. దాంతో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల సంఖ్య 40కి పెరిగింది. దీనివల్ల చమురు దిగుమతులు ఢోకా లేకపోయినా.. పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో వీటి కోసమే 242.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి తోడు ఇప్పుడు ట్రంప్‌గారి సుంకాల మోత తోడవుతోంది. ఇలాంటి అనేక సవాళ్లు, ఒత్తిళ్లను అధిగమించగలిగే ప్రత్యామ్నాయాల గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తోంది. చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గితేనే ఖర్చులు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. దేశీయంగా ముడి చమురు వనరులు పెంచుకునే అవకాశాలు ఇప్పటికిప్పుడు అందుబాటులో లేవు. దానికి బదులుగా పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి వినియోగించడం మరో ప్రత్యామ్నాయం. ఈ దిశగా ఇప్పటికే దేశంలో విక్ర యిస్తున్న పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలపాలన్న లక్ష్యానికి చేరుకున్న భారత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతాన్ని 27 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఇంధనాన్ని ఈ`27 అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేయడం ద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు. 27 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉపయోగించడానికి వీలుగా వాహనాల ఇంజిన్లలో చేయాల్సిన మార్పులపై పరిశోధనలు ప్రారంభించాలని ఏఆర్‌ఏఐ సంస్థకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఈ పరిశోధనల ఫలితాలకు అనుగుణంగా వాహన తయారీ దారులు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది దేశీయ ఇంధన వినియోగంలో పెద్ద మార్పు తీసుకురావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. మన ఇంధన అవసరాలను దేశీయంగా తీర్చుకోగలిగితే ఇతర దేశాలపై దాని ఆధారపడటం తగ్గుతుంది. ఇది భౌగోళిక రాజకీయాల్లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లను అధిగ మించడానికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్ శాతాన్ని పెంచడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు మొత్తాన్ని గణనీయంగా తగ్గించవడం మొదటి అతి పెద్ద ప్రయోజనం. దీనివల్ల మన దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇక దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెరుగడం రెండో ప్రయోజనం. ఇది వ్యవసాయ రంగానికి బూస్ట్ ఇస్తుంది. రైతులకు అదనపు ఆదాయ వనరులను సృష్టిస్తుంది. ఇథనాల్ తక్కువ కాలుష్యం విడుదల చేస్తుంది. దాంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. మొత్తంగా ఇంధన రంగంలో భారత్ ఇబ్బందులను తగ్గిస్తుంది.
Comments