ఇక్కడ ఎవ్వరికీ బాధ్యత లేదు!
- Prasad Satyam
- 1 day ago
- 3 min read
నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం కేబుల్ కనెక్షన్లు
విద్యుత్ స్తంభాలపై కట్టలు కట్టలు
రోడ్లపై తెగి పడినా పట్టించుకోని ఆపరేటర్లు
మెడకు చుట్టుకుంటున్న వైర్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కొద్ది రోజుల క్రితం పాతశ్రీకాకుళం ప్రాంతంలో సిరిమానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సిరిమాను ఆ ప్రాంతంలో తిరగడానికి విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను కమిటీ సభ్యులు కోరారు. దీనికి అనుగుణంగా కరెంటు స్తంభాలను పద్ధతిగా ఓవైపునకు మార్చి రోడ్డుకు మధ్యలో కరెంటు తీగలు వెళ్లకుండా లక్షలు ఖర్చుపెట్టి పనులు పూర్తిచేశారు. కానీ సిరిమాను వెళ్లడానికి స్థానిక సంతోషిమాత కోవెల వద్ద ఇబ్బంది ఎదురైంది. విద్యుత్ లైన్‌మేన్‌లు, ఇద్దరు ఏఈలు స్వయంగా పర్యవేక్షించిన ఈ సిరిమాను సంబరంలో సిరిమాను నిలిచిపోవడమేమిటా అని ఆరా తీస్తే రోడ్డుకు అడ్డంగా కరెంటు పోళ్లను ఆసరాగా తీసుకొని నెట్ కేబుళ్లు, ఫైబర్ కేబుళ్లు ఉన్నాయి. విద్యుత్ సిబ్బంది పోల్స్ మార్చిన సందర్భంగా కేబుళ్లను తొలగించాలని ఎన్నిసార్లు విన్నవించినా సంబంధిత కేబుల్ ఆపరేటర్లు దీన్ని పట్టించుకోలేదు. చివరకు సంబరం రోజున ఈ ఫైబర్ కేబుళ్లను ముక్కముక్కలుగా తెగ్గొట్టాల్సి వచ్చింది. ఇది కేవలం నగరంలో విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ఫైబర్ కేబుళ్లకు సంబంధించిన ఒక ఉదాహరణ మాత్రమే. ఇది కాకుండా ఏ సందులో ఇల్లు మారి పక్క వీధికి వెళ్లినా సామాన్లు లారీ మీద తరలించాల్సివస్తే.. ఈ కేబుళ్లను పైకి ఎత్తి, వాహనాల్ని నడపాల్సిన పరిస్థితి. కేబుల్‌ను పోల్‌కు పోల్‌కు మధ్యలో టైట్‌గా బిగిస్తే గాలికి తెగిపోతుందని, ఊగేటంత లూజుగా వీటిని అమరుస్తున్నారు. దీంతో పాటు పోల్ మీద భవిష్యత్ అవసరాల కోసం లూప్‌ను ఉంచుతున్నారు. ఇది కూడా కొన్ని వందల మీటర్లు ఉండటం వల్ల చాలాచోట్ల ఫైబర్ కేబుళ్లు తలంత ఎత్తులో వేళాడుతున్నాయి. మరికొన్నయితే నడుస్తుంటే కాళ్లకు అడ్డం తగులుతున్నాయి. జిల్లాలో కేబుల్ టీవీ ఆపరేటర్లు విపరీతంగా పెరిగారు. అలాగే ఇంటర్నెట్ అందించే సంస్థలూ ఎక్కువగానే ఉన్నాయి. వీటన్నింటి కేబుళ్లు ప్రతీ పోల్ మీద కట్టలు కట్టలుగా వేళాడుతున్నాయి. పొరపాటున విద్యుత్ స్తంభం మీద కరెంట్ సర్వీస్ ప్రాబ్లం వస్తే పోల్ ఎక్కి సర్వీస్ చేయడానికి కూడా అవకాశం లేనంతగా ఫైబర్ కేబుళ్లతో చుట్టేస్తున్నారు. గతంలో తమ పోల్‌ను వాడుకున్నందుకు విద్యుత్ శాఖ నగరంలో రూ.100, రూరల్‌లో రూ.75 చొప్పున నెలకు వసూలు చేసేది. కానీ ఇది కూడా ఓ స్వయంఉపాధి యూనిట్టేనని పోల్‌కు రూ.100 ఛార్జీని మినహాయించాలని రాష్ట్రవ్యాప్తంగా విన్నపాలు రావడంతో ఇటీవల దీన్ని రద్దు చేశారు. స్థానికంగా ఉన్న నెట్‌వర్క్‌లతో పాటు కార్పొరేట్ కంపెనీల ఫైబర్‌నెట్‌లు కూడా వచ్చేయడంతో ప్రతీ విద్యుత్ స్తంభం మీద వైర్లు వేళాడుతున్నాయి. కొన్నయితే ట్రాన్స్‌ఫార్మర్‌కు టచ్ అవుతున్నాయి. అది కూడా స్కూల్ జోన్‌లో ఉన్నాయి.
ఇటీవల తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన విద్యుత్ లైన్ల దిద్దుబాటులో భాగంగా కేబుల్ వైర్లను కట్ చేస్తే నెట్ డిస్‌కనెక్ట్ అయిందని ఒకరు, కావాలనే ఇంటర్నెట్ కేబుల్స్ తొలగిస్తున్నారని ఇంకొకరు, ముందస్తు నోటీసు ఇవ్వలేదని మరొకరు విమర్శించారు. విద్యుత్ శాఖ, కాంగ్రెస్ సర్కారుపై వేలాదిమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అయితే ప్రస్తుతం కరెంట్ పోల్స్‌పై వేలాడుతున్న ఇంటర్నెట్ వైర్లు, కేబుల్ కనెక్షన్ల కట్టలు చూస్తే అక్కడి ప్రభుత్వం, విద్యుత్ శాఖ చేసిన పని తప్పుకాదని కచ్చితంగా చెప్పొచ్చు. రామంతాపూర్‌లో ఆదివారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కేబుల్ కారణంగా రథానికి కరెంట్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయిన విషయం విదితమే. మొన్న భారీ వర్షాల సమయం.. తెలంగాణలోని సూర్యాపేటలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోసిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు.
నెట్‌వర్క్.. ఇప్పుడు ప్రతి ఇంటికి అవసరమే. అది టీవీ, లేదా ఇంటర్నెట్ కావచ్చు. ఇందులో ఇంటికో రకం నెట్‌వర్క్. ఇప్పుడంతా ఇంటర్నెట్‌మయం. ఇళ్లలో ఓటీటీలు, డిష్‌లు కూడా నెట్‌తోనే నడుస్తున్నాయి. ఇవన్నీ వెరసి విద్యుత్ స్తంభాలపై కట్టలు కట్టలుగా కేబుల్ వైర్లు. కనీసం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు లైన్‌మేన్‌కు పూర్తిగా వీలుకాని పరిస్థితి.
ఒకప్పుడు పట్టణమంతా ఒకటో రెండో నెట్‌వర్క్‌లు.. అందులో ఏరియాకు ఒక ఆపరేటరు ఉండేవారు. ఇప్పుడు వినియోగదారులు ఒకరు ఎయిర్‌టెల్, మరొకరు జియో, ఇంకొకరు బీఎస్‌ఎన్‌ఎల్.. అలాగే లోకల్ కేబుల్ కనెక్షన్లు.. ఇలా ఎన్నో రకాలు. వీటిలో జియో తప్ప బీఎస్‌ఎన్‌ఎల్‌తో సహా మిగిలినవన్నీ వీధుల్లో కనిపించిన విద్యుత్ పోల్‌ను ఆధారం చేసుకొని నడిపేస్తున్నాయి. ఇందులోనూ ఒక ఏరియా ఆపరేటరు ఇంకో ఏరియాలో వేరే నెట్‌వర్క్ వైర్లను రాత్రికి రాత్రే కట్ చేసిపడేస్తున్న సందర్భాలు ఇప్పుడు అనేకం. దీంతో అవి రోడ్డు మధ్యలో వేలాడుతూ ఉంటాయి. వాహనాలను నడిపేవారు ఎంత అలర్ట్‌గా ఉన్నా ఈ తెగిన కేబుల్ వైర్ల కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిసార్లు ద్విచక్ర వాహనదారుల మెడకు చుట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. కేబుల్ ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు రోడ్డుకు అటూ ఇటూ కేబుల్ కనెక్షన్లు వేసేస్తుండటంతో వాటి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కనీస ఎత్తు పాటించకుండా ఎదురుగా కనిపించే పోల్స్ అన్నిటికీ కట్టలు కట్టలుగా కేబుల్ వైర్లు కట్టేస్తున్నారు. ముఖ్యంగా పోల్స్‌పై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు లైన్‌మెన్లు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇక కొన్నిచోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫారమ్ నుంచి పక్కనున్న పోల్స్‌కు వచ్చే కనెక్షన్ల మధ్య నుంచి కేబుల్ కట్టలు వదిలేస్తుండటంతో కింద వేలాడుతున్న వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫారమ్‌ల దగ్గర నుంచి వెళ్లవద్దని అధికారులు, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా తెగిపడిన కేబుల్ వైర్ల నుంచి విద్యుత్ ప్రసరణ జరిగి షాకిస్తున్నాయి.
ఇక వినియోగదారుడు తనకు నెట్‌వర్క్ రావడంలేదని చెబితే వచ్చి కనెక్షనిచ్చి, కట్ చేసిన వైర్లు అలాగే రోడ్డుపై పడేసి వెళ్లిపోతున్నారు. కట్ చేసిన వైరు చిన్నది అయినా ఫర్వాలేదు గానీ, కనీసం ఐదు మీటర్ల పైబడి వైరు రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలేయడం అందరికీ తెలిసిందే.
Comments