ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
- Prasad Satyam
- 6 days ago
- 2 min read
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి
ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు
అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని
`వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశేషం నగరంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో మనకు కనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధికి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తే.. దాన్ని ఎలా పరిష్కరిస్తారనే దానికి ఉదాహరణ.. అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు తమవారికి న్యాయం చేయడానికి తనది కాని పనిలోనూ ఎంతలా ఇన్‌వాల్వ్ అవుతారో తెలియజెప్పే ఉదంతమిది.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణాపార్క్ జంక్షన్ దాటిన తర్వాత తురాయిచెట్టు వీధి మెయిన్ రోడ్డును అడ్డంగా చీల్చి యుద్ధప్రాతిపదికన పెద్ద కాలువ, దాని మీద కల్వర్టు నిర్మిస్తున్నారు. తద్వారా అక్కడ కాలువను వెడల్పు చేసి కల్వర్టు వేయడం ద్వారా రైతుబజారు రోడ్డు నుంచి స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచి జంక్షన్ వరకు వర్షం పడినప్పుడు ప్రస్తుతం నిలిచిపోతున్న నీటిని తురాయిచెట్టు వీధి నుంచి నాగావళి నదిలో కలిసే మార్గాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ఇప్పుడు ఓపెన్ చేయించారు. వర్షాలకు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుండటానికి గమనించి.. ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతున్న క్రమంలో నగరంలోని ప్రతి ప్రాంతానికి చెందిన వర్షపు నీరు నదిలోనే కలవాల్సి ఉంటుందని తేలింది. దాంతో పుణ్యపువీధి, హరేరామ హరేకృష్ణ రోడ్డుతో పాటు ఆరు ప్రాంతాల్లో నిలిచిపోతున్న నీరు వెళ్లడానికి వీలుగా పాలకొండ రోడ్డు మీద ఓ కల్వర్టు నిర్మించారు. సాధారణంగా ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రజాప్రతినిధులకు సూచనలిస్తుంటారు. కానీ ఫలానాచోట కాలువను వెడల్పు చేయడం ద్వారా మురుగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మొదట గ్రహించింది ఎమ్మెల్యే శంకరే. ప్రస్తుతం పాలకొండ రోడ్డులో రోడ్లు భవనాల శాఖ బీటీ రోడ్డు నిర్మిస్తోంది. ఈ పనులకు అక్కడ బ్రేక్ ఇచ్చి, కల్వర్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. భవిష్యత్తుల్లో ఆరు డివిజన్ల నుంచి నీరు సులభంగా నదిలోకి వెళ్లడానికి ఇప్పుడు అనుకూలంగా ఉంది. పనిలో పనిగా డే అండ్ నైట్ జంక్షన్ లో వరం రెసిడెన్సీ వైపు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కాలువను వెడల్పు చేస్తే మరికొంత ముంపు నుంచి నగరాన్ని కాపాడవచ్చు. ఎందుకంటే.. త్రిష హోండా షోరూమ్ ముందు భాగంలో ఉన్న కాలువ రోటరీ శ్మశానవాటిక మీదుగా నాగావళి నదిలో కలువడానికి వెడల్పుగా ఉన్నా.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న కల్వర్టును ఓపెన్ చేస్తే ఫారెస్ట్ ఆఫీస్ వైపు వెళ్లే వరదనీరు కూడా నాగావళిలో కలవడానికి అనుకూలంగా ఉంటుంది.
ఆ పనులతో మరింత ఇరుకు
ఇదిలా ఉంటే.. ఇంతవరకు పెద్దపాడు రోడ్డును వెడల్పు చేయడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసించలేదు. అటువంటిది ఇప్పుడు ఆ రోడ్డును కూటమి ప్రభుత్వంలోనే స్థానికులను ఒప్పించి ఎటువంటి నష్టపరిహారాలు లేకుండా వెడల్పు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే బ్యూటిఫికేషన్‌లో భాగంగా పెద్దపాడు నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు భారీ డివైడర్ నిర్మిస్తున్నారు. ఇక్కడే సమస్య వచ్చిపడిరది. మధ్యలో డివైడర్, సెంటర్ లైటింగ్, మొక్కలు నాటడం వంటివాటి వల్ల అదనపు సొబగులు సంతరించుకున్నా రోడ్డు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఇరుకైపోవడం ఖాయం. ఎందుకంటే.. ఈ ప్రాంతంలో పెద్దపాడు గ్రామంతో పాటు దానికి ముందు అంతా ఆటోఫీల్డ్ ఉంది. వీరంతా వాహనాలు రోడ్డు మీదే పెడుతున్నారు. దానివల్ల రోడ్డు మళ్లీ ఒకవైపు డివైడరు, మరోవైపు ఆక్రమణల వల్ల ఇరుకైపోతుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి ఇక్కడ డివైడర్ అవసరం లేదనేదే ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయం. కాకపోతే శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే చెవికెక్కించుకోని కాంట్రాక్టర్లు ఉన్నచోట అర్జంటు వర్కుల కోసం తన పిలుపునకు స్పందించి కాంట్రాక్ట్‌లు చేసిన కొందరికి పనులు కట్టబెట్టడానికి ఇక్కడ డివైడర్ నిర్మిస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల ఈ రోడ్డులో డివైడర్ నిర్మాణ పనులను దాదాపు పది మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. వాస్తవానికి రామిగెడ్డ జంక్షన్ నుంచి విశాఖ`ఏ కాలనీ ఎంట్రన్స్ వరకు డివైడర్ నిర్మించి బ్యూటిఫికేషన్ పనులు చేపడితే సరిపోతుంది. అలాకాకుండా పెద్దపాడు హైవే దగ్గర్నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు నిర్మిస్తున్న ఈ డివైడర్ వల్ల రోడ్డు కుదించుకుపోతుంది. గత రథసప్తమి సమయంలో పాలకొండ రోడ్డు బ్యూటిఫికేషన్ చేపట్టారు. వచ్చే రథసప్తమి నాటికి పెద్దపాడు రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. అనంతరం రామలక్ష్మణ జంక్షన్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ వరకు రోడ్డును వెడల్పు చేయనున్నారు.










Comments