ఇక.. డిజి‘పిన్’కోడ్!
- DV RAMANA

- Sep 16, 2025
- 3 min read
అర్ధశతాబ్ది పిన్‌కోడ్ సేవలకు త్వరలో సెలవు
త్వరలో దేశవ్యాప్తంగా పది అంకెల కొత్త కోడ్ కేటాయింపు
జియో కోడిరగ్‌తో కచ్చితత్వంతో చిరునామా గుర్తించే సౌకర్యం
పెరిగిన జనాభా, నివాస ప్రాంతాలకు అనుగుణంగా చర్యలు

ఉత్తరాలు రాయాలన్నా.. మనియార్డర్లు పంపాలన్నా.. పార్శిళ్లు సక్రమంగా గమ్యస్థానం చేరాలన్నా సరైనా చిరునామా ఉండాలన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒక్క చిరునామా ఉంటే సరిపోదు.. ఆ చిరునామాకు చెందిన పిన్‌కోడ్ ఉంటే ఉత్తరమైనా, మనియార్డర్లయినా, పార్శిళ్లయినా కచ్చితంగా గమ్యస్థానాలకు చేరతాయని పోస్టల్ శాఖ చెబుతుంటుంది. ఆధునిక యుగంలో కొరియర్లు, ఇతర పార్శిల్ సర్వీసులు, మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చినా వాటిలో కూడా చాలావరకు చిరునామాలతో పాటు పిన్‌కోడ్ నమోదు చేయమని తమ కస్టమర్లకు సూచిస్తుంటారు. సాంకేతిక విప్లవం ఇప్పుడు పోస్టల్ సర్వీసులనూ డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తోంది. ఫలితంగా 50 ఏళ్లకు పైగా పోస్టల్ బట్వాడలో కీలకంగా వ్యవహరించిన పిన్‌కోడ్ ఇక చరిత్రలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. దాని స్థానంలో ఆధునిక డిజిపిన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో పిన్‌కోడ్ ఎలా పనిచేసేది? కొత్త వస్తున్న డిజిపిన్ దీనికంటే ఎంత మెరుగ్గా పని చేస్తుందన్నది ఓసారి చూద్దాం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మన దేశంలో సుమారు రెండున్నర శతాబ్దాల క్రితమే పోస్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తరఫున వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు 1774లో కలకత్తాలో దేశంలోనే మొట్టమొదటి జనరల్ పోస్టాఫీస్ (జీపీవో)ను ప్రారంభించారు. ఆ కాలంలో ఉత్తరప్రత్యుత్తరాలు, వస్తు రవాణా వంటి వాటికి పోస్టాఫీసులే వారధులుగా ఉండేది. పోస్టుమన్ వస్తున్నాడంటే చాలు.. ఏదో సమాచారం లేదా వస్తువు మోస్తుకొస్తున్నాడని ఆసక్తిగా జనం ఎదురుచూసేవారు. ఎక్కడిక్కడి నుంచో వచ్చే ఉత్తరాలు, మనియార్డర్లు, టెలిగ్రాములను సంబంధితులకు సకాలంలో సక్రమంగా చేరవేయడానికి వాటిపై ఉండే చిరునామాతో పాటు పిన్‌కోడ్ ఉపయుక్తంగా ఉంటాయి. అయితే పోస్టల్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత చాలా ఏళ్ల వరకు పిన్‌కోడ్ లేకుండానే కేవలం చిరునామా ఆధారంగా పోస్టుమెన్ ఉత్తరాలను చేరవేసేవారు. అయితే స్వాతంత్య్రానంతరం 1972 ఆగస్టు 15న పోస్టల్ శాఖ పిన్‌కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. తపాలా సేవలను మరింత సమర్థవంతంగా, కచ్చితత్వంతో అందించడానికి పిన్‌కోడ్ ఉపయోగపడుతుంది.
పిన్‌కోడ్ ఎలా కేటాయిస్తారు
పిన్‌కోడ్ అంటే.. పిఐఎన్ (పోస్టల్ ఇండెక్స్ నెంబర్) పేరుతో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నెంబర్ కేటాయించడమన్న మాట. ఇందులో ఆరు అంకెలు ఉంటాయి. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థముంది. దేశంలోని జోన్లు, సబ్ జోన్లు, జిల్లాలు, పోస్టాఫీసులుగా వర్గీకరించి సులభంగా డాక్ సేవలు అందించేందుకు వీలుగా వాటికి నెంబర్లు కేటాయించారు. పిన్‌కోడ్‌లో ఉండే నెంబర్లు వాటికే ప్రాతినిధ్యం వహిస్తాయి. పిన్‌కోడ్‌లోని మొదటి అంకె జోన్‌ను, రెండోది సబ్ జోన్‌ను, మూడోది జిల్లాను.. చివరి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి. ఉదాహరణకు శ్రీకాకుళం పిన్‌కోడ్ నెంబర్ 532001ను పరిశీలిస్తే.. అందులోని 5 సౌత్‌జోన్‌ను సూచిస్తుంది. 3 అంకె సబ్ జోన్‌ను, 2 అంకె మన జిల్లాను, చివరి మూడంకెలైన 001 శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీసును సూచిస్తాయన్నమాట. దీనికి అనుగుణంగా దేశంలోని రాష్ట్రాలను దిక్కులను బట్టి విభజించి.. ఒక్కో దిక్కుకు రెండు నెంబర్లు కేటాయించారు. ఆ ప్రకారం ఒకటి అంకెను నార్త్ జోన్ (ఢల్లీి, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్), 2 అంకెను నార్త్ జోన్ (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్), 3 అంకెను వెస్ట్ జోన్ (రాజస్థాన్, గుజరాత్). 4 అంకెను వెస్ట్ జోన్ (మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్), 5 అంకెను సౌత్ జోన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక), 6 అంకెను సౌత్ జోన్ (కేరళ, తమిళనాడు), 7 అంకెను తూర్పు జోన్ (పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం), 8 అంకెను తూర్పు జోన్(బీహార్, జార్ఖండ్)కు కేటాయించారు. చివరిగా 9 అంకెను సైనిక పోస్టల్ సర్వీస్‌కు ప్రత్యేకంగా కేటాయించారు. వేలాది గ్రామాలు, పట్టణాలు, తపాలా కార్యాలయాలు ఉన్న విశాలమైన మన దేశంలో కచ్చితంగా తపాలాను బట్వాడా చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. తపాలా సేవలకే కాకుండా బ్యాంకు అకౌంట్లు, ఆధార్, రేషన్, అంబులెన్స్, పోలీసు, ఇతర అత్యవసర సేవలకు సైతం పిన్‌కోడ్ కీలకంగా మారిపోయింది. చివరికి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా కచ్చితమైన డెలివరీ కోసం పిన్‌కోడ్ నమోదు చేయాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల నిర్వాహకులు సూచిస్తుండటం విశేషం.
ఆధునిక పిన్ వ్యవస్థ
అర్ధ శతాబ్దికిపైగా విస్తృత సేవలు అందిస్తున్న వ్యవస్థలో భాగమైపోయిన పిన్‌కోడ్ మాయమైపోయి దాని స్థానాన్ని డిజిపిన్ ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఉపయుక్తమైన పిన్‌కోడ్‌ను తీసేసి డిజిపిన్ ప్రవేశపెట్టాల్సిన అగత్యం ఏమొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం పెరుగుతున్న మన అవసరాలే. పోస్టల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో జనాభాతో పాటు జనావాసాలు చాలా తక్కువగా ఉండేవి. అందువల్ల ప్రాంతం పేరు చెబితే చాలు వ్యక్తులను ఈజీగా గుర్తించగలిగే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత పిన్‌కోడ్ అందుబాటులోకి వచ్చి తపాలా సేవలను మరింత సులభం చేసింది. అయితే జనాభా, జనావాసాలు పెరుగుతున్నకొద్దీ పిన్‌కోడ్ ఆధారంగా చిరునామాలను గుర్తించడం కష్టమవుతోంది. ప్రస్తుతం ఉన్న పిన్‌కోడ్ నెంబర్లు పెద్దపెద్ద ప్రాంతాలను మాత్రమే సూచిస్తాయి. ఉదాహరణకు శ్రీకాకుళం నగరానికి ఉన్న 532001 పిన్‌కోడ్ నెంబరు పరిధిలోనే నగరంలోని దాదాపు అన్ని వీధులు, కాలనీలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబం నివసించే కచ్చితమైన స్థలాన్ని పిన్‌కోడ్ ఆధారంగా గుర్తించడం కష్టంగా మారిందన్నమాట. అలాగే గ్రామీణ, అటవీ ప్రాంతాలు ఉన్నచోట్ల ఎలాంటి ఫిజికల్ చిరునామా లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిపిన్ వ్యవస్థను ప్రారంభించింది. ప్రతి ఇంటిని లేదా స్థలాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఈ డిజిటల్ చిరునామా వ్యవస్థను ప్రారంభించింది.
జీపీఎస్‌తో అనుసంధానం
సంప్రదాయ పిన్‌కోడ్‌కు బదులు ప్రతి ఇంటికీ పది అక్షరాల ప్రత్యేక డిజిటల్ అడ్రస్‌ను అందిస్తుంది. దీనిద్వారా చిరునామా స్పష్టంగా లేకపోయినా.. అడవుల్లో ఉన్న ప్రదేశాన్ని అయినా కచ్చితంగా గుర్తించవచ్చు. పోస్టల్ డిపార్ట్‌మెంట్, ఐఐటీ హైదరాబాద్, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన జియోకోడ్ అడ్రస్ వ్యవస్తే ఈ డిజిపిన్. ఇందులో దేశం మొత్తాన్ని సుమారు 4 I 4 మీటర్ల పరిధి గల చిన్న చిన్న గ్రిడ్‌లుగా విభజించి.. ప్రతి గ్రిడ్‌కు పది అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కేటాయిస్తారు. ఈ కోడ్‌ను జీపీఎస్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధారంగా సృష్టిస్తారు. దీనివల్ల మీరు ఎక్కడ ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఆన్‌లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా, సమర్థవంతంగా అందించడానికి వీలవుతుందంటున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో జీపీఎస్ ఆధారంగా కచ్చితమైన చిరునామాకు వెంటనే చేరుకోవచ్చు. ముఖ్యంగా అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతుంది. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు చిరునామాలను కూడా జోడిరచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఉచితంగానే అందుబాటులో డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్‌ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. దీనివల్ల ఇంటర్నెట్‌తో అవసరం లేకుండానే డిజిపిన్ జనరేట్ చేయవచ్చు. వ్యక్తుల పాత లేదా శాశ్వత చిరునామాను మార్చకుండానే అదనపు డిజిటల్ చిరునామాగా ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.










Comments