ఇక లోకల్‌గానే ఉంటాం.. గుర్తించండి!
- SATYAM DAILY
- 2 hours ago
- 1 min read
చంద్రబాబుకు గుండ సోదరుల విజ్ఞప్తి
మంగళగిరి కార్యాలయంలో సీఎంతో భేటీ
తండ్రి కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తమ తండ్రి, ఇటీవల పరమపదించిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించినందుకు ఆయన కుమారులు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుండ అప్పలసూర్యనారాయణ కుమారులైన శివగంగాధర్, విశ్వనాథ్‌లు మంగళగిరిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలుసుకున్నారు. ఇటీవల మరణించిన తమ తండ్రి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో సగౌరవంగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను విదేశీ పర్యటనలో ఉండటం వల్ల రాలేకపోయానని విచారం వ్యక్తం చేస్తూ అప్పలసూర్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. మనదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని, నాన్నగారు లేకపోయినప్పటికీ ఆయన ఆశయ సాధనలో గుండ సోదరులకు, కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా , అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబ పెద్ద అయిన తండ్రి దూరమైన పరిస్థితుల్లో తల్లికి తోడుగా ఇక్కడే ఉండాలని స్థానిక ప్రజలలు కోరుకుంటున్న నేపథ్యంలో తాము స్థానికంగా ఉండాలని నిర్ణయించుకున్నామని వారు చంద్రబాబుకు వివరించగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అరసవల్లి ప్రజలందరూ గుండ అప్పలసూర్యనారాయణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలియజేస్తూ అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ అందించగా ఆయన సానుకూలంగా స్పందించారని గుండ సోదరులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.










Comments