ఎచ్చెర్ల దిశగా రాజకీయ ‘పవన’ం!
- NVS PRASAD

- 1 hour ago
- 3 min read
తరచూ ఆ నియోజకవర్గంలో నాగబాబు చక్కర్లు
వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ప్రచారం
అదే ప్రచార మాయలో వైకాపా నేతలు
కానీ తెరవెనుక జనసేనాని వేరే వ్యూహం
రెండు జిల్లాల్లో ప్రభావం చూపేలా ప్రణాళిక

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జనసేనాని పవన్‌కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఈమధ్య ఎచ్చెర్ల నియోజకవర్గంలో తరచూ కనిపిస్తున్నారు. పనిలో పనిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కాలు.. అక్కడి సమస్యల్లో వేలు పెడుతున్నారు. స్థానిక టీడీపీ క్యాడర్‌కు, ఆ మాటకొస్తే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కూడా సమాచారం ఇవ్వకుండా జనసైనికుల్ని వెంటేసుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీనిపై సిటింగ్ ఎమ్మెల్యేలు అధిష్టానం దష్టికి తీసుకువెళ్లినా దీనిపై స్పందన శూన్యం.
ఎచ్చెర్ల రాజకీయాల్లోకి నాగబాబు రావాలనుకుంటే ముందు కాపు సామాజికవర్గానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైకాపా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ నాలుగు రోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టి విరుచుకుపడ్డారు. జిల్లాలో ఇప్పటికే తూర్పు కాపులను రెండు నియోజకవర్గాలకు పరిమితం చేసి.. వాటిలో ఒకటి కమ్మ సామాజికవర్గానికి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్ప్పుడు నాన్‌లోకల్ కోటా కింద నాగబాబు వస్తే కాపులకు మరింత అన్యాయం జరుగుతుందన్నది స్వరూప్ ప్రెస్‌మీట్ సారాంశం.
.. ఈ రెండు అంశాలు వేర్వేరు కావు. అలా అని ఒకటీ కావు. ఒకదానితో ఒకటి అనుసంధానమైనవి. నాగబాబు పోటీ చేస్తారనో, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కు కష్టమవుతుందేమో.. అందుకే స్వరూప్ ప్రెస్‌మీట్ పెట్టారన్న కోణంలో ఈ కథనాన్ని చదవొద్దు. ఆరేళ్ల ఎమ్మెల్సీ పోస్టు ఉండగా 2029 ఎన్నికల్లో నేరుగా డబ్బులు ఖర్చుపెట్టి నాగబాబు పోటీ చేస్తారనుకోవడం అవివేకం. కానీ అంతకు మించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏదో జరుగుతోంది. అక్కడి పాతకాపులు చెబుతున్న మాట కూడా 2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల రణరంగాన్ని తలపిస్తుందనే! పోటీ చేయడానికైతే నాగబాబు నియోజకవర్గాన్ని వెతుక్కోనవసరం లేదు. ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిలో ఉండగా మళ్లీ పోటీ చేయడం ఎందకన్నది ఒకటైతే.. తన తమ్ముడు తలచుకుంటే మరోసారి ఎమ్మెల్సీని, మంత్రిని చేయడం పెద్ద విషయం కాదన్నది రెండోది. అలాంటప్ప్పుడు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం నాగబాబుకు లేదు. అలాగే నాగబాబు పోటీ చేస్తే వైకాపాకు గెలుపు అవకాశాలు తగ్గుతాయని ఆందోళనతో నాగబాబును స్వరూప్ టార్గెట్ చేసి ఉండరు. ఎందుకంటే నాగబాబు రాజకీయ జీవితం ప్రజారాజ్యం నుంచి అందరూ చూస్తున్నదే. కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేస్తారంటే స్థానిక వైకాపా నేతలు భయపడే పరిస్థితి లేదు. కానీ స్వరూప్ ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చారు? నాగబాబు ఎందుకు పదేపదే ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసైనికులను కలుస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే మరింత లోతుగా ఆలోచించాలి.
నాగబాబు పర్యటనలు అందుకేనా..
2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన 2019 మాదిరిగా కాకుండా రెండుచోట్లా గెలిచేలా ముందుజాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. దానికి రెండు కారణాలు ఉన్నాయి. అది కాపు నియోజకవర్గం కావడం ఒకటైతే.. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో కలిసి ఉండటం రెండో కారణం. తన ప్రణాళికలో భాగంగానే నాగబాబును పైలెట్‌గా పంపి నియోజకవర్గంలో సానుకూలతలను అధ్యయనం చేయిస్తున్నారు. కాపులు ఏమేరకు పోలరైజ్ అవుతున్నారు? బీజేపీకి ఎచ్చెర్ల టిక్కెట్ ఇచ్చినప్ప్పుడు తెలుగుదేశంతో పాటు జనసేన ఓట్లు ఎలా పోలరైజ్ అయ్యాయ్? అనే అంశాలపై కసరత్తు చేయడానికే నాగబాబు ఇక్కడకు వస్తున్నారు. 2024లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకోవడానికి ముందు నాగబాబు అక్కడ పాగా వేసి, టీడీపీ అభ్యర్థి రేసులో ఉన్న వర్మను ఒప్పించి లైన్ క్లియర్ చేశారు. దానివల్లే పవన్‌ను ఓడించడానికి వైకాపా సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం దక్కలేదు. అయితే కాపుల్లో పవన్ చరిష్మా అప్ప్పుడున్నంత ఇప్పుడు లేదు. అందుకే తూర్పుకాపుల వైపు వచ్చి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది.
రెండు జిల్లాలను కొట్టే ప్లాన్
దీనికి తోడు పవన్ ఎచ్చెర్లను కేంద్రంగా చేసుకుంటే.. రెండు జిల్లాలు సెంట్రిక్‌గా వైకాపా సీనియర్లకు చెక్ పెట్టవచ్చు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, విజయనగరంలో బొత్స సత్యనారాయణలకు కౌంటర్‌గా పవన్‌ను వదలడానికి చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని వైకాపా ముందుగానే గ్రహించింది. పవన్ బరిలో ఉంటే విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీనును ఆయన మీద పోటీకి పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ పవన్‌ను ఢీకొట్టలేరని, ఎచ్చెర్లలో ఉన్న గ్రూపులు ఇప్పటికీ ఒక్కటి కానందున విజయనగరం నుంచి చిన్నశ్రీనును రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూడా చిన్నశ్రీనుకే ఎచ్చెర్ల టిక్కెట్ ఇవ్వాలని నాలుగు మండలాల్లోని వైకాపా శ్రేణులు పార్టీ పెద్దలను పదే పదే కలిసి విన్నవించారు. చిన్నశ్రీను ఇక్కడ పోటీ చేయడంపై తన విముఖతను బయటపెట్టడానికి అప్పటి ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ ఏమాత్రం వెనుకాడలేదు. ఫ్లెక్సీలు చింపుకోవడం నుంచి పోలింగ్ బూత్ ఏజెంట్ల వరకు రెండు వర్గాలుగా వైకాపా విడిపోయింది. ఒకానొక సమయంలో గొర్లె కిరణ్‌కుమార్ అయితే గెలవలేరని చిన్నశ్రీనును తీసుకురావడానికి జగన్ రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అలకపాన్పు ఎక్కడంతో చిన్నశ్రీనును ఎచ్చెర్లకు పంపే ప్రతిపాదన విరమించుకున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే బొత్స సత్యనారాయణ విజయనగరం ఎంపీగాను, బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి ఎమ్మెల్యే కింద, చిన్నశ్రీనును ఎచ్చెర్లకు పంపడానికి జగన్ సిద్ధమయ్యారు. కానీ బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ రద్దయిపోయాయి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. అటు తక్కువ ఓట్‌షేర్ ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి ఎనఈఆర్ అంతే స్థాయిలో ఓటుబ్యాంకు ఉన్న బీజేపీ తరఫున పోటీ చేస్తే ఎచ్చెర్ల ప్రజలు ఆదరించారు. అటువంటిది పవన్‌కల్యాణ్ వస్తే పెద్దగా కష్టపడకుండానే గెలవొచ్చనే భావన జనసైనికుల్లో ఉంది. అందుకే నాగబాబు నిరంతరం ఇక్కడ పర్యటిస్తున్నారు. ఆయన రాకపోతే వీరే అక్కడకు వెళ్లి కొన్ని రాజకీయాలు చర్చిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తితే ఎనఈఆర్ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేశారు గానీ, వాస్తవానికి ఆయన కరడుగట్టిన తెలుగుదేశం నేత. బాబు చెప్తే కాదనే పరిస్థితి ఉండదు. చంద్రబాబుకు కూడా ఎనఈఆర్ మీద మంచి నమ్మకమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే పొత్తు ధర్మాన్ని పాటించడంలేదని ఎచ్చెర్ల సీనియర్ టీడీసీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే ఈశ్వరరావు బయటి వ్యక్తి కాదని టీటీపీ కుటుంబ సభ్యుడేనని వ్యాఖ్యానించారట. దీనిబట్టి రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమైపోతుంది.






Comments