top of page

ఇకనైనా ఆలోచిద్దాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 5, 2025
  • 2 min read


బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవంలో సంభవించిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 50 మంది గాయపడ్డారు. క్రికెట్‌ ఈ దేశంలో ఎంత అతిగా మారిందనేదానికి ఈ ఘోర దుర్ఘటన ఓ సాక్ష్యం. ఎందుకు అతిగా మారదు గెలిచిన టీం సభ్యులకి స్వాగతం చెప్పడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళితే? కర్ణాటక చరిత్రలోనే ఐపీఎల్‌ గెలవడం ఓ సువర్ణాధ్యాయం అన్నట్లు రాజకీయ నాయకులు, మీడియా ఓవరాక్షన్‌ చేస్తే సామాన్యుల మీద ఎంతో ప్రభావం చూపించ కుండా వుంటుందా? కళలు, క్రీడలు కేవలం మానసికోల్లాసానికి ఉద్దేశించినవి. ఐతే ఈ రెండూ పూర్తిగా వాణిజ్యపరమైనందువల్ల వాటి పరిధిని, ప్రాముఖ్యతని దాటి దేశం నవనాడుల్నీ కుంగదీస్తున్నాయి. ఒక కళగా సినిమాని, ఒక క్రీడగా క్రికెట్‌ని అభిమానించొచ్చు.. తప్పులేదు. అయితే మితిమీరిన వాణిజ్యీకరణ వల్ల ఈ రెండూ జనాల మెదళ్ల మీద పాము పుట్టల్లా లేచి వారి ఆలోచనా శక్తిని, సృజనాత్మకతని ధ్వంసం చేసి, సాంస్కృతికంగా పట్టి పీడిస్తూ దేశానికి సంబంధించిన మరింక దేని గురించీ ఆలోచించడానికి వీల్లే కుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌ వచ్చినప్పటి నుంచి జాతిని క్రికెట్‌ ఓ జ్వరంలా తగులుకుంది. ఇదివరకటి రోజుల్లో గుర్రప్పందేలుండేవి. ఐపీఎల్‌ దాన్ని మించిపోయింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయడం, డిస్కార్డ్‌ చేయడం, రిటెయిన్‌ చేయడం.. అంతా క్రీడా నైపుణ్యానికి సంబంధం లేని వాణిజ్య వ్యూహాలతో ఆటని ఓ జూదంలా, గుర్రప్పందెంలా మార్చేశాయి. ప్రేక్షకుల్ని ఫ్రాంచైజీలకు మాన సికంగా బానిసలుగా తయారుచేశారు. ఫలితంగా ఆటగాళ్లు లాభపడుతున్నారు. బీసీసీఐ ఆర్ధికంగా బలిసి పోతున్నది. ఆర్ధికంగా చూస్తే మనది ఓ పేద దేశం. కానీ బీసీసీఐ ప్రపంచంలోనే రిచ్చెస్ట్‌ స్పోర్ట్స్‌ బోర్డ్‌. ఈ వైరుధ్యం అసహజంగా లేదూ? ఇవాళ చనిపోయి, గాయపడ్డవారందరూ ఈ దేశంలో క్రికెట్‌ పిచ్చి ఎంతగా వుండకూడని స్థాయిలో వుందో నిరూపిస్తున్నారు. 35వేల సీటింగ్‌ కెపాసిటీ మాత్రమే వున్న స్టేడియంకి 3 లక్షలమంది హాజరయ్యారంటే.. ఈ పిచ్చిని పెంచి పోషిస్తున్నదెవరు? ఆటని, ఆటగాళ్లని తప్పు పట్టక్కర్లేదు. ప్రధాన ముద్దాయి బీసీసీఐ. సొమ్ము చేసుకోవడం మీదనే దాని దృష్టంతా. ఇదివరకటి రోజుల్లో ప్రతి సం వత్సరం క్రికెట్‌కి ఒక సీజన్‌ అంటూ వుండేది. దాదాపు ఎండాకాలం, వర్షాకాలం క్రికెట్‌కి సెలవు వుండేది. కేవలం టెస్ట్‌ మ్యాచెస్‌ మాత్రమే జరిగేవి. తర్వాత వన్డే మ్యాచెస్‌ వచ్చాయి. ఇక్కడి నుంచే క్రికెట్‌ పిచ్చి ఎక్కు వవడం మొదలైంది. జెంటిల్మెన్‌ గేం కమర్షియల్‌ గేం అయింది. బౌలర్లు నిస్సహాయులై పోయి క్రికెట్‌ బాట్స్‌మెన్‌ గేం అవడం కూడా దీనితోనే మొదలైంది. ఆ తర్వాత టి`20 పుట్టుకొచ్చింది. ఇది క్రికెట్‌ని క్లాస్‌ పరంగా అథఃపాతాళానికి, వాణిజ్యపరంగా ఆకాశానికి తీసుకెళ్లింది. క్రికెట్‌ పొట్టిది అవుతున్న కొద్దీ జనాల్లో దాని పట్ల వేలం వెర్రి పెరగసాగింది. అసలు జనాల్లో వేలం వెర్రి పెంచడానికి అనుగుణంగానే దాని ఫార్మాట్లో మార్పులు తీసుకొచ్చారు. చివరగా ఐపీఎల్‌ క్రికెట్‌ని, ప్రేక్షకుల్ని ఇంక దిగజార్చడానికి ఏమీ మిగల్చకుండా రూపొందించబడిరది. ఇప్పుడు సంవత్సరం మొత్తం క్రికెట్‌కి సీజనే. క్రికెట్‌ని సమాజానికి హానికరంగా దిగజార్చిన జాబితాలో బీసీసీఐ తర్వాత స్థానం ఎలక్ట్రానిక్‌ మీడియాది. ఈ రోజున ఎలక్ట్రానిక్‌ మీడియా మొత్తం కార్పొరెటైజ్‌ ఐపోయింది. పెట్టుబడి సామాజిక విలువల్ని ఎంతగా ధ్వంసం చేయగలదనే దానికి ఎలక్ట్రానిక్‌ మీడియా ఓ పెద్ద సాక్ష్యం. మిగతా క్రీడలు ఎదగకుండా చేసిన పాపం కూడా ప్రభుత్వం తో పాటు మీడియా కూడా మోయాల్సిందే. ప్రజలు దేశంలో మరే సమస్యల గురించి, పాలకుల వైఫల్యాల గురించి ఆలోచించనివ్వకుండా క్రికెట్‌ తయారైందంటే దానికి ఏదో ఒక పాలక వర్గానికి చేరువగా వుండే ఎలక్ట్రానిక్‌ మీడియానే కారణం. క్రికెట్‌ పట్ల మితిమీరిన క్రేజ్‌ తమ మానసిక ఆరోగ్యానికి, దేశ ఆరోగ్యానికి హానికరమని గుర్తించాలి. ఇది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో రాజీనామా చేసి తీరవలసిన దుస్సంఘ టన. దీని వెనుక అధికార మార్పు కోసం జరిగే కుట్ర కోణం కూడా దాగి ఉండవచ్చు. చదువుకున్న వాళ్లు కూడా మూర్ఖులు లాగా పద్దెనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం, వచ్చి తీరాలి అంటూ అదేదో వరల్డ్‌ కప్‌ అన్నట్టు పూనకాలతో ఊగిపోయారు. ఆ కప్పు మనం తయారు చేసుకున్నదే, విరాట్‌ కోహ్లీ అయినా, శ్రేయాస్‌ అయ్యర్‌ అయినా మన ప్రాణాలు వాళ్లు సాధించే ఆ కప్‌ల కంటే చాలా చాలా విలు వైనవని ఈ దేశంలో ప్రతి క్రికెట్‌ అభిమానీ తెలుసుకోవాలి..! అసలు ఆర్‌సీబీకి, బెంగళూరుకి సంబంధ మేంటి? బెంగళూరుకు చెందిన ఓ లిక్కర్‌ సామ్రాజ్య నేత పెట్టిన పేరు ఇది. ఇందులో కోహ్లీ నుంచి ఎవరూ బెంగళూరుకు చెందినవారు కాదు. ఆమాత్రం దానికి ఆర్‌సీబీ గెలిచాక ఈ బలిదానాలెందుకు?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page