top of page

ఇగోల బందిఖానాలో వైకాపా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 2 days ago
  • 4 min read
  • ఓటమి భారం నుంచి ఏడాదిలోనే కోలుకున్న పార్టీ

  • పెద్ద నేతలు మాత్రం ఇంకా పాత ధోరణిలోనే..

  • ఆమదాలవలస సభకు పార్లమెంటరీ ఇన్‌ఛార్జి తమ్మినేని డుమ్మా

  • శ్రీకాకుళం కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించని ధర్మాన

  • పార్టీ వీడటం లేదని ఆయన చెప్పడం ఒక్కటే ఉపశమనం

బిడ్డ చచ్చినా పురిటి కంపు వదల్లేదు.. చింత చచ్చినా పులుపు చావలేదు.. ప్రతిపక్ష వైకాపా విషయంలో ఇలాంటి ఎన్ని నానుడులు చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ పక్షం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నా జిల్లాలో మాత్రం వైకాపా నాయకుల్లో జోష్‌ పెరిగిందనే చెప్పాలి. విద్యుత్‌ బిల్లుల పెంపు తర్వాత వైకాపా చేపట్టిన ప్రతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. కేసులకు సైతం వెరవకుండా క్యాడర్‌ ముందుకొస్తోంది. కానీ పదవులు అనుభవించి పెద్ద నాయకులుగా చెలామణీ అవుతున్నవారు మాత్రం ఇగోలకు పోవడంతో పార్టీకి ఇంకా బుద్ధి రాలేదన్న సంకేతాలు వెళ్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ ` మోసం గ్యారెంటీ’ కార్యక్రమం చేపట్టాలని, నాయకులందరూ కలసికట్టుగా నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా ముందుగా నియోజకవర్గాల స్థాయిలో దీనిపై సమావేశాలు జరపాలి. ఇక్కడే పెద్ద తలకాయల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఆమదాలవలస నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్‌ ఈ కార్యక్రమం నిర్వహిస్తే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి తమ్మినేని సీతారామ్‌ డుమ్మా కొట్టారు. అదే రోజు పలాసలో డాక్టర్‌ సీదిరి అప్పలరాజు నిర్వహించిన కార్యక్రమంలో కనిపించారు. వాస్తవానికి చింతాడ రవిని మొదటి నుంచి ధర్మానతో పాటు తెర వెనుక బలంగా ప్రోత్సహిస్తున్నది సీదిరి అప్పలరాజేనన్న భావన అధికారంలో ఉన్నన్నాళ్లూ సీతారాంకు ఉండేది. అటువంటిది ఇప్పుడు చింతాడ రవి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయ్యేసరికి సీదిరి కంటే సొంత నియోజకవర్గంలో ఉన్న రవికుమార్‌ వల్లే తనకు ఎక్కువ ప్రమాదమని భావించిన సీతారాం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి హోదాలో పలాసకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఆమదాలవలస సభలోనే సీతారాం పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ తాను లేకుండా రవికుమార్‌కు సొంతంగా ఎంత బలముందో పార్టీకి తెలియాలన్న కోణంలో సీతారాం పలాస వెళ్లిపోయారు. కానీ చింతాడ రవి కార్యక్రమానికి భారీగానే పార్టీ నాయకులు వచ్చారు.

ఇక్కడ కాదని అక్కడికి తమ్మినేని

కట్‌ చేస్తే.. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాంటి కార్యక్రమమే నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి తమ్మినేని సీతారాంకు ఆహ్వానం లేదు. వేదికపై ఆయన కనిపించనూ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు మాత్రమే హాజరయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి సీతారామ్‌ను పిలిచి ఉండకపోవచ్చని భావిస్తే అది పూర్తిగా సమర్ధనే అవుతుంది. ఎందుకంటే.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు వచ్చినప్పుడు పార్లమెంటు ఇన్‌ఛార్జి కూడా ఉండాలి. ఇక సీతారాం, ధర్మాన ప్రసాదరావుల మధ్య గ్యాప్‌ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా మిగిలిపోతే స్పీకరైన సీతారాం శ్రీకాకుళం నియోజకవర్గంలో విస్తృతంగా చొరబడ్డారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కృష్ణదాస్‌ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న భావన ధర్మానకు ఉండేది. ఇలా చెప్పుకుంటూపోతే ఒకే పార్టీలో ఉన్నా, ఒకే నియోజకవర్గం కాకపోయినా రాజకీయ పదవుల దగ్గరకొచ్చేసరికి వీరంతా ప్రత్యర్ధులే. ధర్మాన ఇక్కడ సమావేశం నిర్వహించిన రోజునే టెక్కలిలో వైకాపా ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌ ‘బాబు ష్యూరిటీ ` మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఆహ్వాన ఫ్లెక్సీల్లో ఎక్కడా మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఫొటో కనపడలేదు. ఈ విషయం తెలుసుకున్న తిలక్‌ వెంటనే అప్పలరాజుకు ఫోన్‌ చేసి కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. అప్పలరాజు కూడా అంతే గౌరవంతో కార్యక్రమానికి వచ్చారు. సభాముఖంగానే జరిగిన పొరపాటుకు తిలక్‌ అప్పలరాజుకు క్షమాపణ చెప్పారు. ఇదే వేదిక మీద సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌, కుంభా రవిబాబుతో పాటు అందరూ కనిపించారు. అసలు ఈ కార్యక్రమాలను కోఆర్డినేట్‌ చేస్తున్నది ఎవరు? జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కృష్ణదాస్‌ ఏ రోజు ఏ నియోజకవర్గంలో సమావేశం పెట్టాలి? అనేది నిర్ణయించాలి. ఇందుకోసం పార్లమెంట్‌ పరిధిలో నాయకులుగా ఉన్న తమ్మినేని సీతారాం, కుంభా రవిబాబులతో కూర్చోవాలి. ఇలా కాకుండా ఒకేరోజు రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు పెడితే ఆమదాలవలసకు వెళ్లకుండా పలాసకు, శ్రీకాకుళంలో కనపడకుండా టెక్కలిలో ప్రత్యక్షమవడానికి సీతారామ్‌కు అవకాశం దొరికినట్టే. దీనివల్ల ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులకు కూడా అవకాశం లభిస్తుంది. పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జికే శ్రీకాకుళం సమావేశానికి ఆహ్వానం లేకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఆమదాలవలస సమావేశానికి సీతారాం ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించే అవకాశం కూడా పార్టీకి లేకుండా అదే రోజు పలాస మీటింగ్‌ పెట్టించి అక్కడికి వెళ్లిపోయారు.

బొత్స రాకతో అప్రమత్తమయ్యారా?

ధర్మాన ప్రసాదరావు పెట్టిన డిమాండ్లను పార్టీ ఒప్పుకుందో, లేదంటే పక్క జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, ఈ జిల్లా నుంచి సీదిరి అప్పలరాజు వంటి నేతలతో ప్రమాదం పొంచి ఉందని భావించారో ఏమో తెలీదు గానీ.. పార్టీ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా పార్టీ నాయకులను ధర్మాన ప్రసాదరావు మొన్న అడ్రస్‌ చేసి మాట్లాడారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న పిలుపుతో పాటు తాను పార్టీ మారడంలేదని, ఒకవేళ మారితే మొత్తం కట్టగట్టుకొని వెళ్లిపోతాను గానీ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నెరిపిన తాను ఆపార్టీలోకి వెళ్లలేనని ధర్మాన స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఇన్నాళ్లూ నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించింది. తాను పార్టీ మారుతున్నానంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని ధర్మాన చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ ప్రచారం చేసింది వైకాపా నేతలు.. అందుకు అవకాశం కల్పించింది సాక్షాత్తు ధర్మాన ప్రసాదరావే. తాను పార్టీ మారుతానన్న ప్రచారాన్ని ఆయన మొన్నటి వరకు ఎక్కడా ఖండిరచలేదు. ఈ కథనాలు పార్టీ అధిష్టానం వరకు చేరితే తన డిమాండ్లకు ఒప్పుకుంటారన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ దానికి ముందు జరిగిన జిల్లా వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి ఊహించని విధంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వాస్తవానికి ఆయన గతంలో మాదిరిగా రీజనల్‌ కోఆర్డినేటర్‌ గానీ, పార్టీ పరిశీలకుడు గానీ కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి కురసాల కన్నబాబు ఈ సమావేశానికి విచ్చేసినా ధర్మాన ప్రసాదరావు మాత్రం రాలేదు. ఆ తర్వాత పార్టీకి ఏం మెసేజ్‌ వెళ్లిందో.. ధర్మానకు ఏమేరకు తత్వం బోధపడిరదో తెలీదు గానీ అనారోగ్య కారణాల వల్ల తాను పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గోలేకపోయానని, జిల్లాకు టీడీపీ మోసం చేసిందంటూ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’లో చెప్పుకొచ్చారు.

మారుతున్న రాజకీయం

వైకాపాలో కొద్ది నెలలుగా రాజకీయం వేగంగా మారిపోతోంది. జగన్మోహన్‌రెడ్డి వ్యవహార శైలిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు వైకాపాలో గతంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఇంకా తమను ఎందుకు ప్రభుత్వం అరెస్ట్‌ చేయలేదన్న కోణంలో బహిరంగంగానే బాబు కూటమికి బాధ కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. మాజీమంత్రి పేర్ని నాని స్టేట్‌మెంట్లు చూస్తే ఇది అర్థమవుతుంది. మరో మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కూడా అరెస్టుకు తగ్గేదే లే అన్నట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అధికార కూటమి ఎవరిని నిర్బంధిస్తోందో వారికి జగన్మోహన్‌రెడ్డి కచ్చితంగా అగ్రతాంబూలం ఇస్తారన్న భావన ఇప్పటికే విజయవాడ సర్కిల్స్‌లో తిరుగుతోంది. మరోవైపు గతం మాదిరిగా కాకుండా జిల్లాలవారీగా వైట్‌బుక్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జగన్మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచిస్తున్నారు. మరో ఆరు నెలల తర్వాత కచ్చితంగా పార్టీలో మార్పులు, చేర్పులు ఉంటాయని, ఈలోగా అలకబూనినవారు, తెరమరుగైనవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి మీద వ్యతిరేకత, జగన్మోహన్‌రెడ్డికి ఉన్న మాస్‌ ఇమేజ్‌ మేరకు అధికారంలోకి వస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా మెట్టు దిగకపోవడం సరికాదన్న భావన ధర్మానకు కలిగి ఉంటుంది. లేదా పార్టీయే బొత్స సత్యనారాయణను శ్రీకాకుళం మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పిందన్న సంకేతం ధర్మానకు తెలిసి ఉండవచ్చు. కారణమేదైనా సత్తిబాబు రాకతో ధర్మాన అడుగు ముందుకు పడిరది. అయితే పార్టీలో పెద్ద నాయకులు మాత్రం ఇగోలు వీడినట్లు కనిపించడంలేదు.

Yorumlar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page